నేను, ధోనీ కలిసి అక్తర్‌ను ఆడుకున్నాం: ఇర్ఫాన్ పఠాన్

ABN , First Publish Date - 2020-06-01T22:35:19+05:30 IST

ప్రపంచంలోని అత్యుత్తమ పేస్ బౌలర్లలో పాకీస్తాన్ రావల్పిండీ ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ఒకరు. అలాంటి అక్తర్‌ను ధోనీతో...

నేను, ధోనీ కలిసి అక్తర్‌ను ఆడుకున్నాం: ఇర్ఫాన్ పఠాన్

న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యుత్తమ పేస్ బౌలర్లలో పాకీస్తాన్ రావల్పిండీ ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ఒకరు. అలాంటి అక్తర్‌ను ధోనీతో కలిసి తాను ఓ ఆట ఆడుకున్నానని భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ ఫఠాన్ చెప్పారు. 2006లో ఫైసలాబాద్‌ వేదికగా జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని పఠాన్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పఠాన్ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటికే భారత్ ఐదు వికెట్లు కోల్పోయి ఉండడంతో తాను బ్యాటింగ్‌కు వెళ్లానని, అయితే అక్తర్ షార్ట్ పిచ్ బంతులను ఎందుర్కోవడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పాడు. "నన్ను షార్ట్‌పిచ్ బంతితో ఆహ్వానించాడు అక్తర్. నిజానికి అది నా కంటికి కూడా కనిపించలేదు. నా చెవి పక్కనుంచి వేగంగా దూసుకెళ్లిపోయింది. ప్రతి బంతిని 150-160కిమీల వేగంతో అక్తర్ విసురుతుండడంతో అతడిని ఎదుర్కోవడం కొంచెం కష్టంగా అనిపించింది. దీనికి తోడు ప్రతి బంతికి స్లెడ్జింగ్ చేస్తున్నాడు అక్తర్. వెంటనే ధోనీ దగ్గరకు వెళ్లి పిచ్ ఎలా ఉందని అడిగా. దానికి ధోనీ పెద్దగా ఏం లేదని, నెమ్మదిగానే బ్యాటింగ్ చేయాలని చెప్పాడు. ఎలాగోలా అక్తర్ స్పెల్ పూర్తయింది. తరువాత  బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. కొంత పార్ట్‌నర్ షిప్ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాం. అయితే పిచ్‌లో కొంత మార్పు వచ్చినట్లు గుర్తించాం. అది రివర్స్ స్వింగ్‌కు అనుకూలంగా  మారింది. సాధారణంగానే అత్యంత వేగంగా బౌలింగ్ చేసే అక్తర్ రివర్స్ స్వింగ్ కూడా తిప్పితే ఇక కష్టమే అనిపించింది. ఇంతలో అక్తర్ మరో స్పెల్ కోసం రానే వచ్చాడు. నేను వెంటనే ధోనీ దగ్గరకు వెళ్లి అక్తర్‌ను స్లెడ్జింగ్ చేస్తానని, నువ్వు కేవలం అతడి వైపు చూసి నవ్వితే చాలని చెప్పాను. ఎలాగైనా అక్తర్ రివర్స్ స్వింగ్‌ వేయకుండా చేయడమే మా ఆలోచన.


వెంటనే అక్తర్‌తో ‘ఇంతేనా.. తరువాతి స్పెల్‌లో కూడా ఇదే తరహా బౌలింగ్ వేయగలవా.. లేదా’ అన్నాను. దాంతో అక్తర్‌కు కోపంతో ‘నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్.. ఇక్కడి నుంచి నిన్ను పంపించేస్తా’ అన్నాడు. వెంటనే నేను ‘నీ వల్ల కాదులే. నేను కూడా అసలైన పఠాన్‌నే. మాట్లాడకుండా చేతనైతే బౌలింగ్ వేయ్’ అన్నాను. అక్కడి నుంచి అక్తర్ అన్నీ షార్ట్ పిచ్ బంతులే వేశాడు. మధ్యలో ధోనీతో మాట్లాడుతుండగా అక్తర్ నా పక్క నుంచి వెళ్లాడు. వెంటనే నేను ‘పిచ్ ఏమంత బాలేదు. నువ్వు మరింత షార్ట్ బంతులు వేయాల్సిందే’ అంటూ ఎగతాళి చేశాను. ధోనీ కూడా అతడివైపు చూసి నవ్వాడు. దాంతో అతడికి మరింత కోపం వచ్చింది. ఆ స్పెల్ మొత్తం షార్ట్ పిచ్ బంతులే వేశాడు. ఆ స్పెల్ తరువాత పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడం మొదలెట్టింది. దాంతో మంచి స్కోరు నెలకొల్పాం’ అంటూ అక్తర్‌ను ఎలా ఆడుకున్నారో ఇర్ఫాన్ వెల్లడించారు. 


ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 588 పరుగులు చేసింది. పఠాన్ ధోనీ కలిసి 210 పరుగుల పార్ట్‌నర్ షిప్ నెలకొల్పారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 603 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే మ్యాచ్ మాత్రం డ్రాగా ముగిసింది.

Updated Date - 2020-06-01T22:35:19+05:30 IST