బంగ్లాదేశ్‌ విముక్తి కోసం జైలుకెళ్లాను

ABN , First Publish Date - 2021-03-27T07:26:31+05:30 IST

అన్యాయాన్ని ప్రతిఘటించి, ధర్మాన్ని కాపాడే క్రమంలో బంగ్లాదేశ్‌ విముక్తి పోరాట యోధులు తమ జీవితాలను త్యాగం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్య్రం కోసం 1971లో పాకిస్థాన్‌తో జరిగిన పోరాటంలో ప్రాణాలర్పించిన

బంగ్లాదేశ్‌ విముక్తి కోసం జైలుకెళ్లాను

బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోదీ

బంగబంధు షేక్‌ ముజిబ్‌-ఉర్‌-రెహమాన్‌

భారతీయులకు కూడా హీరోయేనని వెల్లడి

గాంధీ శాంతి బహుమతి ఆయన కుమార్తెలకు..

మోదీ రాకకు వ్యతిరేకంగా నిరసన.. నలుగురి మృతి

స్నేహితులతో కలిసి సత్యాగ్రహం చేశా!

బంగ్లాదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ


ఢాకా, మార్చి 26: అన్యాయాన్ని ప్రతిఘటించి, ధర్మాన్ని కాపాడే క్రమంలో బంగ్లాదేశ్‌ విముక్తి పోరాట యోధులు తమ జీవితాలను త్యాగం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్య్రం కోసం 1971లో పాకిస్థాన్‌తో జరిగిన పోరాటంలో ప్రాణాలర్పించిన బంగ్లాదేశ్‌ అమరవీరులకు శుక్రవారం ఆయన నివాళులర్పించారు. బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల్లో, బంగ్లాదేశ్‌ జాతి పిత షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం ఆయన ఢిల్లీ నుంచి ఆ దేశానికి వెళ్లారు. కరోనా వ్యాప్తి మొదలయ్యాక.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢాకా చేరుకున్న మోదీకి  విమానాశ్రయంలో.. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, ఆమె కేబినెట్‌లోని మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. సైనికులు 19 తుపాకులతో ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాకు 35 కిలోమీటర్ల దూరంలోని సావర్‌కు చేరుకున్న మోదీ.. బంగ్లాదేశ్‌ జాతీయ అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఆయన తెల్లమద్ది (అర్జున) మొక్క నాటారు. అనంతరం.. కొద్దిసేపు మౌనం పాటించి అమర జవాన్లకు పుష్పాంజలి ఘటించారు.


వారి త్యాగాల వల్లే బంగ్లాదేశ్‌ గొప్ప దేశంగా అవతరించిందని మోదీ పేర్కొన్నారు. ‘‘వంచన, అణచివేతపై సత్యం, ధైర్యం సాధించిన గొప్ప విజయానికి గుర్తుగా.. సావర్‌లోని అనంత జ్వాల శాశ్వత జ్ఞాపికగా మిగిలిపోవాలని నేను భారత దేశ ప్రజల తరఫున ప్రార్థిస్తున్నాను’’ అని రాశారు. అనంతరం ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌ అధికార, ప్రతిపక్షాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులను కలిశారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై ఈ భేటీలో చర్చించినట్టు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పలురంగాల్లో చిన్నవయసులోనే విజయాలు సాధించిన బంగ్లా యువతతో కూడా ప్రధాని మాట్లాడారు.


గాంధీ శాంతి బహుమతి

భారత ప్రభుత్వం 2020 సంవత్సరానికిగాను గాంధీ శాంతి బహుమతిని.. బంగబంధు షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌కు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ బహుమతిని ప్రధాని మోదీ.. ముజిబుర్‌ రహమాన్‌ కుమార్తెలైన షేక్‌ హసీనా (బంగ్లాదేశ్‌ ప్రధాని), షేక్‌ రెహనాలకు ఇచ్చారు. బంగబంధు మానవహక్కుల చాంపియన్‌ అని.. ఆయన భారతీయులకు కూడా హీరోయేనని కొనియాడారు. ఆయనకు గాంధీ శాంతి బహుమతి ఇవ్వడం భారత్‌కు గౌరవమన్నారు. బంగ్లాదేశ్‌ 50వ జాతీయ దినం సందర్భంగా నేషనల్‌ పరేడ్‌ స్క్వేర్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన మోదీ.. షేక్‌ ముజిబుర్‌ నాయకత్వ పటిమను కొనియాడారు. ఈ రెండు రోజులూ (బంగ్లాదేశ్‌ పర్యటన) తన జీవితంలో మరపురాని రోజులని.. భారతదేశాన్ని ఈ వేడుకలకు ఆహ్వానించినందుకు బంగ్లాదేశ్‌కు తాను కృతజ్ఞుడినై ఉంటానని ఆయన పేర్కొన్నారు. కాగా.. తన తండ్రికి గాంధీ శాంతి బహుమతి ఇచ్చినందుకు బంగ్లా ప్రధాని షేక్‌హసీనా భారతదేశానికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.  


నేను సైతం..

బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర పోరాట సమయంలో అక్కడి ప్రజలపై పాకిస్థాన్‌ చేసిన అకృత్యాలు భారతీయులను కూడా కలవరపెట్టేవని.. నేషనల్‌ పరేడ్‌ స్క్వేర్‌ వద్ద చేసిన ప్రసంగంలో మోదీ అన్నారు. అప్పటికి తనకు 21-22 ఏళ్లని.. ఆ సమయంలో తాను, తన స్నేహితులు కలిసి బంగ్లాదేశ్‌ స్వాతంత్య్రం కోసం సత్యాగ్రహం చేశామని.. దానివల్ల తనకు జైలుకెళ్లే అవకాశం కూడా వచ్చిందని.. మోదీ తెలిపారు. భారత్‌, బంగ్లాదేశ్‌.. రెండు దేశాలకూ ప్రజాస్వామిక శక్తి, దార్శనికత ఉన్నాయని, రెండు దేశాలూ కలిసి పురోగమించడం ఈ ప్రాంతానికి అత్యవసరమని పేర్కొన్నారు. 


ముజీబ్‌ జాకెట్‌..

బంగ్లా జాతిపిత ముజిబుర్‌ రెహమాన్‌కు నివాళిగా ‘ముజీబ్‌ జాకెట్‌’ను మోదీ ధరించారు. ఆరు గుండీలతో, కింది భాగంలో రెండు జేబులతో, కోటు పైభాగంలో ఎడమవైపున మరో జేబుతో ఉండే ఖాదీ జాకెట్‌ ఇది. ముజిబుర్‌ రెహమాన్‌ జీవించి ఉన్నప్పుడు ఆయన ధరించిన జాకెట్లు ‘ముజీబ్‌ జాకెట్లు’గా పాపులర్‌ అయ్యాయి. మోదీ పర్యటన సందర్భంగా  ‘ఇందిరాగాంధీ కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ హైకమిషన్‌’.. 100 ముజీబ్‌ జాకెట్లు ఆర్డర్‌ చేసింది. వాటిలో ఒకదాన్నే మోదీ ధరించారు.


నిరసనలు.. కాల్పులు.. నలుగురి మృతి

భారత ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌ పర్యటనను నిరసిస్తూ చిట్టగాంగ్‌లో కొందరు నిరసనలు చేపట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లతో జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. వారు పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించడంతో.. టియర్‌ గ్యాస్‌ ప్రయోగిం,ఆమని, రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. రాజధాని ఢాకాలో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. పోలీ సులు వారిని అడ్డుకునే క్రమంలో ఇద్దరు పాత్రికేయులతో సహా 12 మంది గాయపడ్డారు.


వీవీఐపీ విమానంలో తొలిసారి

బంగ్లాదేశ్‌ పర్యటనకు ప్రధాని మోదీ సరికొత్త బోయింగ్‌ 777.. ‘ఎయిరిండియా వన్‌’లో వెళ్లారు. పీఎం విదేశీ పర్యటనకు ఈ విమానంలో వెళ్లడం ఇదే మొదటిసారి. ‘వీటీ-ఏఎల్‌డబ్ల్యూ’ రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో ఉండే ఈ కస్టమ్‌-మేడ్‌ విమానాన్ని బోయింగ్‌ సంస్థ గత ఏడాది అక్టోబరులో భారత్‌కు అందజేసింది. కస్టమ్‌-మేడ్‌ విమానమంటే.. భారత ప్రభుత్వం కోరిన సౌకర్యాలన్నీ అమర్చిన విమానం ఇది. దీంతోపాటే ‘వీటీ-ఏఎల్‌వీ’ అనే రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఉన్న మరో విమానాన్ని కూడా బోయింగ్‌ సంస్థ గత అక్టోబరులో పంపింది. నిజానికి ఈ రెండు విమానాలూ 2018లో కొన్ని నెలలపాటు ఎయిరిండియా వాణిజ్యవాహనాల శ్రేణిలో ఉన్నవే. ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రయాణాలకు వినియోగించేలా వాటిలో కొన్ని మార్పులు కోరుతూ బోయింగ్‌ సంస్థకు తిప్పి పంపారు. ఆ రెండు విమానాలూ దాదాపు 6 నెలల క్రితం సరికొత్త సౌకర్యాలతో వీవీఐపీ విమానాల్లాగా తిరిగివచ్చాయి. వాటిలో అధునాతన ఆత్మ రక్షణ, హైటెక్‌ క్షిపణి రక్షక సూట్‌లను అమర్చారు. ఈ విమానాలు ఒకసారి గాల్లోకి లేస్తే.. ఏకధాటిగా 17 గంటలు ప్రయాణించగలవు. వీటిలోని అత్యాధునిక సమాచార వ్యవస్థలు.. ఎవరూ హ్యాకింగ్‌ చేయలేనంత పటిష్ఠమైనవి.

Updated Date - 2021-03-27T07:26:31+05:30 IST