ఏబీవీని తొలగించాలని..కేంద్రానికి లేఖ రాశాం

ABN , First Publish Date - 2021-08-03T08:55:05+05:30 IST

అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ఈ ఏడాది మార్చిలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను పాటించామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపింది.

ఏబీవీని తొలగించాలని..కేంద్రానికి లేఖ రాశాం

  • సుప్రీం ఆదేశాల మేరకు రోజువారీ విచారణ  
  • రాష్ట్రప్రభుత్వం అఫిడవిట్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ఈ ఏడాది మార్చిలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను పాటించామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపింది. దర్యాప్తు అథారిటీ నివేదికకు అనుగుణంగా ఆయన్ను సర్వీసు నుంచి తొలగించాలని కేంద్రానికి లేఖ రాశామని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం (రాజకీయ) ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఏప్రిల్‌ నెలాఖరులోగా ఏబీవీపై దర్యాప్తు పూర్తి చేయాలని, రోజువారీ దర్యాప్తు కొనసాగించాలని కోర్టు ఆదేశించిందని.. ఆ ప్రకారం  ఐఏఎస్‌ అధికారి ఆర్పీ సిసోడియాను దర్యాప్తు అధికారిగా నియమిస్తూ మార్చి 8న ప్రభుత్వం జీవో జారీ చేసిందని.. కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు అథారిటీ రోజువారీ విచారణ జరిపి ఏప్రిల్‌ 22న నివేదికను సమర్పించిందని వివరించారు. వెంకటేశ్వరరావుపై ఉన్న మూడు అభియోగాల్లో రెండింటిని అథారిటీ ఖరారు చేసిందన్నారు. ఇజ్రాయెల్‌ నుంచి నిఘా పరికరాల కొనుగోలు కాంట్రాక్టును అక్రమంగా తన కుమారుడికి సంబంధించిన కంపెనీకి వచ్చేలా చేశారని.. నాణ్యత, సాంకేతిక సామర్థ్యం, కొనుగోలు నిబంధనలపై రాజీపడ్డారని.. కాంట్రాక్టు పొందిన కంపెనీ తన కుమారుడిదని ప్రభుత్వానికి చెప్పలేదని.. చిత్తశుద్ధితో, నిజాయితీగా వ్యవహరించడంలో విఫలమయ్యారని పేర్కొందని వివరించారు. దర్యాప్తు అథారిటీ నివేదికపై మే 18న ఏబీవీ జవాబిచ్చారని తెలిపారు. 


దర్యాప్తు నివేదిక, ఆయన స్పందనను పరిశీలించాక ఆయన్ను సర్వీసు నుంచి తొలగించాలని సిఫారసు చేస్తూ కేంద్రానికి జూలై 23న లేఖ రాశామని చెప్పారు. కాగా.. విజిలెన్స్‌ కమిషన్‌ను సంప్రదించకుండానే తనపై దర్యాప్తు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని ఏబీవీ తన స్పందనలో స్పష్టంచేశారు. దర్యాప్తు అథారిటీ పబ్లిక్‌ సర్వెంట్లపై దర్యాప్తునకు నిర్దేశించిన సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించిందని.. తన తరఫు సాక్షులను ఎగ్జామిన్‌ చేయడానికి నిరాకరించిందని.. న్యాయసూత్రాలను పాటించలేదని, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు.

Updated Date - 2021-08-03T08:55:05+05:30 IST