తెలంగాణకు మరో లేఖ రాశాం

ABN , First Publish Date - 2021-07-23T07:32:18+05:30 IST

శ్రీశైలం రిజర్వాయర్‌ ద్వారా విద్యుదుత్పత్తిని నిలిపి వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి

తెలంగాణకు మరో లేఖ రాశాం

  • విద్యుదుత్పత్తి ఆపాలని సూచించాం
  • 2 రాష్ట్రాల్లోనూ అనుమతుల్లేకుండా  సాగుతున్న ప్రాజెక్టుల నిర్మాణం 
  • ఇది ఘర్షణకు దారి తీస్తుంది: షెకావత్‌

 

న్యూఢిల్లీ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం రిజర్వాయర్‌ ద్వారా విద్యుదుత్పత్తిని నిలిపి వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి లేఖ రాశామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లోనూ అనుమతుల్లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం సాగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో రెండు రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.


గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి మౌఖికంగా సమాధానమిచ్చారు. విద్యుదుత్పత్తి కంటే తాగు, సాగు అవసరాలకు ప్రాధాన్యమివ్వాలని ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం ఏర్పడిన కేఆర్‌ఎంబీ 9వ సమావేశంలో నిర్ణయించామని తెలిపారు. ఏపీ సీఎం నుంచి తనకు లేఖ అందిందని, కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు కూడా ఏపీ సీఎం లేఖ రాశారని ప్రస్తావించారు. దానికి తాము జవాబు కూడా ఇచ్చామని చెప్పారు. విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని తెలంగాణ జెన్కోను ఆదేశించామని తెలిపారు.


కానీ ఉత్పత్తిని నిలిపి వేయబోమని, మూడు ప్లాంట్లను కూడా ఆపరేట్‌ చేస్తామని తెలంగాణ జెన్కో తమకు స్పష్టం చేసిందని వెల్లడించారు. దాంతో మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశామని వివరించారు. కాగా, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకోడానికి కేంద్రం ఏం చర్యలు తీసుకుం టుందని అడిగిన ప్రశ్నకు... రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడడానికి విభజన చట్టం ప్రకారం కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీని ఏర్పాటు చేశామని, ఇటీవలే వాటి పరిధిని ఖరారు చేస్తూ గెజిట్‌ జారీ చేశామని సమాధానమిచ్చారు. 


Updated Date - 2021-07-23T07:32:18+05:30 IST