జనరల్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం... రాజ్‌నాథ్ సింగ్‌ దృష్టికి దర్యాప్తు వివరాలు...

ABN , First Publish Date - 2022-01-05T19:54:29+05:30 IST

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్

జనరల్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం... రాజ్‌నాథ్ సింగ్‌ దృష్టికి దర్యాప్తు వివరాలు...

న్యూఢిల్లీ : చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోవడంపై దర్యాప్తు జరిపిన త్రివిధ దళాల దర్యాప్తు బృందం బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయింది. దర్యాప్తు వివరాలను ఆయనకు తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది. 


జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, జనరల్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో పన్నెండు మంది ప్రయాణించిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరు వద్ద డిసెంబరు 8న కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై భారత వాయు సేనకు చెందిన ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలోని కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీ దర్యాప్తు జరిపింది. ఈ దర్యాప్తులో వెల్లడైన అంశాలను ఈ బృందం రాజ్‌నాథ్ సింగ్‌కు బుధవారం వివరించింది. 


ఈ దర్యాప్తు బృందంలో భారత నావికా దళానికి చెందిన సీనియర్ హెలికాప్టర్ పైలట్ ఒకరు, సైనికాధికారి ఒకరు కూడా ఉన్నారు. మానవేంద్ర సింగ్ బెంగళూరులోని ఐఏఎఫ్ ట్రైనింగ్ కమాండ్‌కు అధిపతిగా ఉన్నారు. విమానాలు, హెలికాప్టర్లు కూలిపోయిన సంఘటనలపై దర్యాప్తు చేయడంలో మానవేంద్ర సింగ్ నిపుణుడు. 


ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడానికి కారణం సాంకేతిక లోపం కాదని ఈ దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురయ్యే ముందు ఈ హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తోందని, ఓ రైల్వే లైను గుండా అది వెళ్తోందని, ఆ సమయంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉన్నాయని ఈ నివేదిక పేర్కొన్నట్లు సమాచారం. దీనిలోని సిబ్బంది అత్యున్నత స్థాయి నిపుణులని, అయితే పరిస్థితిపై సరైన అవగాహన లేకుండా, పైలట్ నియంత్రణలో హెలికాప్టర్ ఉన్నప్పటికీ, అనుకోకుండా భూమిపైకి దించారని పేర్కొన్నట్లు సమాచారం. దర్యాప్తు పూర్తయిందని, అన్ని కోణాల్లోనూ పరిశీలించి ఈ నివేదికను రూపొందించారని తెలుస్తోంది. 


ఇదిలావుండగా, సాయుధ దళాల ఉన్నతాధికారులు ప్రయాణించే హెలికాప్టర్లను నడిపేటపుడు పాటించవలసిన ప్రమాణాలను సవరించాలని ఈ నివేదిక సూచించినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2022-01-05T19:54:29+05:30 IST