Abn logo
May 23 2020 @ 07:52AM

అమెరికా ఆర్థిక వ్యవస్థకు క‌రోనా కోలుకోని దెబ్బ కొట్టింది: తోటకూర ప్రసాద్‌

కరోనాతో అన్ని రంగాలకు భారీ నష్టం

దేశంలో నిరుద్యోగం 15శాతం పెరిగింది

భారతీయుల సందేహాల నివృత్తికి కృషి 

‘ఆంధ్రజ్యోతి’తో ఐఏఎఫ్‌సీ అధ్యక్షుడు డాక్టర్‌ తోటకూర ప్రసాద్‌

(న్యూయార్క్‌ నుంచి కిలారు అశ్వనీ కృష్ణ): కరోనా దెబ్బకు అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ముఖ్యంగా ఐటీ, హోల్‌సేల్‌, రిటైల్‌, ఉత్పత్తి, ట్రాన్స్‌పోర్ట్‌, హోటల్‌ రంగాలు బాగా దెబ్బతిన్నాయి’’ అని చెబుతున్నారు ఇండియన్‌, అమెరికన్‌ ఫ్రెండ్‌షిప్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు డాక్టర్‌ తోటకూర ప్రసాద్‌. అమెరికాలో తెలుగు వారికి పెద్ద దిక్కుగా ఉంటున్న ఆయన స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం. 30 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి డల్లా్‌సలో స్థిరపడ్డారు. తానా అధ్యక్షుడిగా పని చేశారు. కరోనా వ్యాప్తి తర్వాత అమెరికాలో మారిన పరిస్థితులు, అక్కడి భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..


కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి

అమెరికాలో 33 కోట్ల జనాభా ఉండగా, కోటికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 15 లక్షలకుపైగా మందికి పాజిటివ్‌గా తేలింది. మరణాల సంఖ్య లక్ష దాటేసింది. న్యూయార్క్‌, న్యూజెర్సీ, ఇల్లినాయిస్‌ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. న్యూ హాంప్షైర్‌, న్యూ మెక్సికో, అయోవా రాష్ట్రాల్లో రోగుల సంఖ్య పెరుగుతోంది. కరోనాపై భయం కంటే.. ఆర్థికంగా నష్టపోతున్నామనే బాధ ఇక్కడి ప్రజల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అమెరికాలోని చాలా రాష్ట్రాలు పాక్షికంగా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాయి. మాస్క్‌ల వాడకం తప్పనిసరి చేసినా, చాలా మంది వినియోగించడం లేదు. కొన్ని చోట్ల బీచ్‌లను తెరిచినా, సినిమా హాళ్లు,  స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు మూతపడి ఉన్నాయి. విద్యాలయాలను ఆగస్టులో ప్రారంభిస్తారన్న నమ్మకమైతే లేదు. మరి కొంత కాలం ఆన్‌లైన్‌ బోధనకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ సహా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు దీర్ఘకాలం పాటు వర్క్‌ ఫ్రమ్‌ హోం చేసే అవకాశం కల్పించాయి. 


నిత్యావసరాల ధరలకు రెక్కలు

కరోనా దెబ్బకు అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ముఖ్యంగా ఐటీ, హోల్‌ సేల్‌, రిటైల్‌, ఉత్పత్తి, ట్రాన్స్‌పోర్ట్‌, హోటల్‌ రంగాలు బాగా దెబ్బతిన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో నిరుద్యోగం 15శాతం దాటింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న నిబంధనల ప్రకారం నిరుద్యోగ భృతి కింద నెలకు 520 డాలర్లు అందిస్తున్నారు. భారీ మొత్తంలో కొనే రెస్టారెంట్లు, విద్యాలయాలు, కార్పొరేషన్లు మూత పడడంతో బిలియన్‌ డాలర్లకుపైగా విలువ చేసే పండ్లు, పాలు, కూరగాయలను వృథాగా పారబోస్తున్నారు. వ్యవసాయదారులకు 1600 కోట్ల డాలర్లకుపైగా ఆర్థిక వెసులుబాటు కల్పించారు.


సంస్థలకు భారీ సాయం

చిన్న, మధ్య తరగతి, పెద్ద వ్యాపార సంస్థలకు మార్చిలో 2 ట్రిలియన్‌ డాలర్లు, మే నెలలో 3 ట్రిలియన్‌ డాలర్ల భారీ సాయాన్ని ప్రభుత్వం అందించింది. అలాగే, వార్షిక ఆదాయం 75 వేల డాలర్ల కంటే తక్కుగా ఉన్న వ్యక్తులకు 1200 డాలర్ల సాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. కుటుంబ వార్షిక ఆదాయం 1.5 లక్షల డాలర్ల కన్నా తక్కువగా ఉంటే 2,400 డాలర్ల సాయం అందిస్తున్నారు. హెచ్‌1బీ, హెచ్‌4 వీసాలు కలిగిన వారు కొన్ని పరిమితులకు లోబడి ఆర్థిక సాయం పొందే వీలుంది.


సందేహాలు నివృత్తి చేస్తున్నాం

ఇండియన్‌ అమెరికన్‌ ఫ్రెండ్‌షిప్‌ కౌన్సిల్‌ (ఐఏఎఫ్‌సీ) తరఫున ప్రవాస భారతీయుల సందేహాలను నివృత్తి చేసేందుకు కాన్సులేట్‌ అధికారులు, న్యాయవాదులతో ఆన్‌లైన్‌లో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. ‘వందే భారత్‌ మిషన్‌’ విమానాల్లో స్వదేశానికి వెళ్లాలనుకునే వారు ముందుగా ఎంబసీలో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement