కోల్‌కతా కెప్టెన్‌గా మోర్గాన్‌

ABN , First Publish Date - 2020-10-17T08:44:02+05:30 IST

ఓ వైపు పరాజయాలు.. మరోవైపు తన కెప్టెన్సీపై వస్తున్న విమర్శలకు ముగింపు పలుకుతూ దినేశ్‌ కార్తీక్‌ కీలక నిర్ణయం ...

కోల్‌కతా కెప్టెన్‌గా మోర్గాన్‌

వైదొలగిన దినేశ్‌ కార్తీక్‌

దుబాయ్‌: ఓ వైపు పరాజయాలు.. మరోవైపు తన కెప్టెన్సీపై వస్తున్న విమర్శలకు  ముగింపు పలుకుతూ దినేశ్‌ కార్తీక్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. బ్యాటింగ్‌పై మరింత దృష్టి సారించాలనుకుంటున్నట్టు దినేశ్‌ కార్తీక్‌ తెలిపాడు. ప్రస్తుత వైస్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఇకనుంచి  కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని కేకేఆర్‌ యాజమాన్యం ప్రకటించింది. ఈ సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో డీకే 108 పరుగులు (15.42 సగటు) మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. ‘బ్యాటింగ్‌ను మరింత మెరుగుపర్చుకునేందుకు కెప్టెన్సీకి దూరమవుతున్నట్టు దినేశ్‌ కార్తీక్‌ మాకు తెలిపాడు. అలాగే మోర్గాన్‌కు బాధ్యతలు ఇవ్వాల్సిందిగా కోరాడు’ అని కేకేఆర్‌ పేర్కొంది. గంభీర్‌ స్థానంలో రెండేళ్ల క్రితం దినేశ్‌ కార్తీక్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. కేకేఆర్‌ జట్టు ఇప్పటివరకూ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో నెగ్గి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. కాగా ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ జట్టు 2019 వన్డే వరల్డ్‌కప్‌ నెగ్గిన సంగతి తెలిసిందే.

గౌతీ సంచలన ట్వీట్‌

కెప్టెన్సీ మార్పు విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం తెలిపిన కొద్ది నిమిషాల్లోనే గౌతమ్‌ గంభీర్‌ ట్వీట్‌ చేశాడు. ‘ఒక ఘనమైన వారసత్వాన్ని అందించాలంటే  సంవత్సరాలు పడుతుంది. కానీ దాన్ని నాశనం చేయడానికి నిమిషం చాలు’ అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. కాగా 2012, 2014ల్లో నైట్‌రైడర్స్‌కు టైటిల్స్‌ అందించిన గంభీర్‌, 2011లోనూ ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు.


Updated Date - 2020-10-17T08:44:02+05:30 IST