గవర్నర్‌నే బుక్‌ చేసినోళ్లు మమ్మల్ని మాత్రం వదిలిపెడతారా?

ABN , First Publish Date - 2021-11-16T16:10:45+05:30 IST

ఏకంగా గవర్నర్‌నే..

గవర్నర్‌నే బుక్‌ చేసినోళ్లు మమ్మల్ని మాత్రం వదిలిపెడతారా?

తప్పు చేయక తప్పడంలా!

శాఖల నిధులివ్వడం కోడ్‌ విరుద్ధమే.. కాదని చెబితే ఉండనిస్తారా?

ఆర్థికమే కాదు అన్ని శాఖలదీ దివాలా బాటే

ఐఏఎస్‌ల ప్రైవేటు సంభాషణల్లో ఇదే చర్చ


గతంలో ఏ ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు ప్రైవేటుగా కలుసుకున్నా.. ఆరోగ్యాలు, వీకెండ్‌ ట్రిప్పుల చుట్టూ సంభాషణలు సాగేవి. ఇప్పుడు వారి చర్చల్లో...

వచ్చే నెల జీతాలొస్తాయా లేదా అన్న అంశమే కామన్‌ టాపిక్‌. ఆ మాటకొస్తే, ఐఏఎస్‌లనే కాదు.. పైస్థాయి నుంచి దిగువస్థాయి వరకు ఏ ఇద్దరు ఉద్యోగులు కలుసుకున్నా పతనమైపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చుట్టే చర్చలు సాగుతున్నాయి. చివరిగా.. ‘ఏం చేస్తాం! గవర్నర్‌నే బుక్‌ చేశారు. మనమో లెక్కా? తప్పని తెలిసినా మా శాఖల నిధులు ప్రభుత్వానికి ఇవ్వకతప్పడం లేదు’ అని నిట్టూరుస్తున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీయకతప్పదు.. అయితే, అది ఇప్పుడా.. ఇంకా నాలుగు రోజులకా అనేదే తేలాలి’ అని ఒకరు భయసందేహాలు వ్యక్తం చేస్తే.. ‘ఇప్పటికే దివాలా తీసింది. అరచేతులు అడ్డంపెట్టి ఆ వాస్తవాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ మరొకరు అసహనం ప్రకటిస్తారు.. ఇలా రాష్ట్రంలోని ఐఏఎస్‌ల వీకెండ్‌ పార్టీల్లో ఈ అంశమే తరచూ చర్చనీయాంశమవుతోంది. కొన్ని రోజులుగా ఆర్థిక శాఖ సంక్షోభంగా ఉన్న సమస్య ఇప్పుడు ఎలా అన్ని శాఖల సంక్షోభంగా మారిందనే దానిపై అధికారులు ఒకరితో ఒకరు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ‘మా శాఖలో ఉన్న కొద్దో గొప్పో డబ్బులను ప్రభుత్వం లాగేసుకుంది. ఇన్ని రోజుల నుంచి ఆ డబ్బులపై వచ్చే వడ్డీతోనే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఆఫీసుల నిర్వహణ నడిచిపోతోంది. ప్రభుత్వం తిరిగి మా డబ్బులు ఇస్తుందనే గ్యారంటీ లేదు.. ఉద్యోగులకు వేతనాలుఇవ్వలేని రోజు దగ్గర్లోనే కనిపిస్తోంది’ అంటూ ఓ అధికారి డబ్బుల కోసం తనపై ప్రభుత్వం ఎలా ఒత్తిడి చేసిందన్న అంశాలు సహచర ఐఏఎస్‌లతో పంచుకుంటే..  ‘ఈ నిధుల గోల్‌మాల్‌పై వచ్చే ప్రభుత్వాలు విచారణ చేస్తే మన పరిస్థితి ఏంటీ?’ అని కొందరు సెక్రటరీలు కలవరపడుతున్నట్టు తెలిసింది. ‘మా శాఖలో రెండేళ్ల నుంచి పేమెంట్లే లేవు. చిన్న చిన్న మెయింటెనెన్సు బిల్లులూ పెండింగ్‌లోనే... ఇలా అయితే ఇంకెన్నాళ్లు ఆఫీసులు నడపగలం. సెలవులు పెట్టి వెళ్లాలనిపిస్తుంది’ అని కొందరు ఐఏఎస్‌ అధికారులు వాపోతున్నట్టు తెలిసింది. 


కాదంటే ఖాళీ చేయాల్సిందే..

బడ్జెట్‌లో కేటాయించిన డబ్బులను అన్ని శాఖలకు ఇవ్వాల్సిన ప్రభుత్వం... రివర్స్‌లో అన్ని శాఖల వద్ద ఉన్న డబ్బులను లాక్కుంటోంది. ‘ఇవ్వను’ అన్న అధికారులను బదిలీ చేసి మరీ గుంజుకుంటోంది. స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ ఫీజులు లాక్కోవడంతో ఈ ధోరణి మొదలైంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి సహకరించి విద్యార్థులు కట్టిన ఫీజులను, పరీక్షల నిర్వహణ కోసం వచ్చిన డబ్బులను ముట్టజెప్పారు. ఆ సమయంలో ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ రామకృష్ణ మాత్రం తమ వద్ద ఉన్న రూ.500 కోట్లను ప్రభుత్వానికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత అనూహ్యంగా ఆ అధికారి స్టాంపు లు, రిజిస్ర్టేషన్ల శాఖకు బదిలీ అయ్యారు. విద్యాశాఖలో మొదలైన ఈ నిధుల వేట ను ప్రభుత్వం ట్రాఫిక్‌ చలాన్లు, మైనింగ్‌ ఫీజులకు విస్తరించింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీపై కన్ను పడింది. అక్కడి అధికారులు ప్రభుత్వానికి డబ్బులిచ్చేందుకు ససేమిరా అన్నారు.


ఇప్పటికే ప్రభుత్వానికి డబ్బులిచ్చిన శాఖల సెక్రటరీలు మాత్రం....తిరిగి వాటిని తమకు ఇవ్వబోదని తెలిసినా, అ లా ఇవ్వడం ఫైనాన్షియల్‌ కోడ్‌ విరుద్ధమని తెలిసినా ఇవ్వకతప్పలేదని సమర్థించుకుంటున్నారు. అప్పుల కోసం రాజ్యాంగం గవర్నర్‌కు కల్పించిన సావరిన్‌ ఇమ్యూనిటీని లెక్కచేయకుండా నేరుగా ఆయన పేరు రాసి బుక్‌ చేసిన ప్రభుత్వం, నిధులు ఇవ్వకపోతే తమను వదులుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇ లా ప్రభుత్వం ఇతర శాఖల నుంచి ఇప్పటి వరకు రూ.6,000 కోట్లు లాగేసిందని సమాచారం. కనీసం ఆఫీసుల మెయింటెనెన్సు బిల్లులూ చెల్లించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం తిరిగి ఈ డబ్బులను ఆయా శాఖలకు ఇవ్వడం అసాధ్యం. ఇప్పుడు ఒక్క ఆర్థిక శాఖే కాదు అన్ని శాఖలూ రోడ్డున పడ్డాయి. రాష్ట్ర ఖజానాలోనే కాదు ఏ శాఖ గల్లాపెట్టెలోనూ అణాపైసా లేదు.


కారు అద్దెకూ దిక్కు లేదు

ఐఏఎస్‌లకు, ప్రభుత్వ సలహాదారులకు వాడే ఒక్కో కారుకి నెల అద్దె దాదాపు రూ.60,000. ఈ బిల్లులు 6 నెలల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి.. ఏక్షణమైనా అద్దె కట్టని కార్లను దాని యజమాని వెనక్కి తీసుకునే అవకాశాలున్నాయి. ‘రాష్ట్రం ఆర్థికంగా కూలిపోయింది. అధికారిక ప్రకటన రావడమే లేటు’ అని ఆర్థిక అంశాలపై బాగా పట్టున్న ఒక అధికారి తన సన్నిహితుల వద్ద మాట్లాడుతున్నారు.

Updated Date - 2021-11-16T16:10:45+05:30 IST