Jun 14 2021 @ 01:57AM

ఐఎఎస్‌ రోహిణి బయోపిక్‌...

కన్నడనాట అవినీతి అధికారుల పాలిట సింహస్వప్నంలా వ్యవహరించారని ప్రజల ప్రశంసలు అందుకుంటున్న తెలుగు మహిళ, ఐఎఎస్‌ అధికారి రోహిణి సింధూరి జీవితంపై ఓ సినిమా రానుంది. కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ‘భారత సింధూరి’ అని దర్శకుడు కృష్ణ స్వర్ణసండ్ర ఓ టైటిల్‌ రిజిస్టర్‌ చేశారు. రోహిణి బయోపిక్‌ కోసమే ఆ టైటిల్‌ అని ఆయన వెల్లడించారు. ఇటీవల మైసూరు జిల్లా అధికారి పదవి నుంచి రోహిణి సింధూరిని బదిలీ చేయడంతో ఆమె పేరు పతాక శీర్షికలు ఎక్కింది. అంతకు ముందు మాండ్య జిల్లాలో ఆమె చేసిన సేవలు చూసి స్ఫూర్తి చెందానని, అప్పుడే బయోపిక్‌ చేయాలని నిర్ణయించుకున్నట్టు కృష్ణ స్వర్ణసండ్ర తెలిపారు. తాజా మైసూరు వివాదంతో పాటు రోహిణి సింధూరి బాల్యాన్నీ చిత్రంలో చూపిస్తారట. రోహిణి పాత్రకు అక్షర పాండవపుర పేరు పరిశీలనలో ఉందని సమాచారం. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత నటీనటుల ఎంపిక ప్రారంభిస్తామని దర్శకుడు చెబుతున్నారు.