ఉమ్మి పూస్తే.. ‘ఫైవ్‌’ పడుద్ది!

ABN , First Publish Date - 2020-06-10T09:42:08+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా తాత్కాలిక నిబంధనలకు ఐసీసీ ఆమోదముద్ర వేసింది. అనిల్‌ కుంబ్లే నేతృత్వంలోని

ఉమ్మి పూస్తే.. ‘ఫైవ్‌’ పడుద్ది!

ఐసీసీ కొత్త నిబంధనలు

దుబాయ్‌: కరోనా మహమ్మారి కారణంగా తాత్కాలిక నిబంధనలకు ఐసీసీ ఆమోదముద్ర వేసింది. అనిల్‌ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్‌ కమిటీ చేసిన ఐదు సూచనలకు ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ కమిటీ (సీఈసీ) ఆమోదముద్ర వేసింది. అవేంటంటే.. 

అలా చేస్తే.. పరుగుల జరిమానా

బంతిపై మెరుపు తెచ్చేందుకు బౌలర్లు ఉమ్మి పూయరాదు. అయితే చెమటను మాత్రం రుద్దవచ్చు. ఒకవేళ ఆటగాళ్లు అలవాటులో పొరపాటుగా పదేపదే ఉమ్మి పూస్తే అంపైర్‌ రెండు సార్లు హెచ్చరిస్తారు. ఇదే పునరావృతమైతే.. 5 పరుగుల జరి మానా విధిస్తారు. ఈ రన్స్‌ ప్రత్యర్థి జట్టు ఖాతాలో వేస్తారు.  

టెస్టుల్లో కొవిడ్‌ సబ్‌స్టిట్యూట్‌

 టెస్టు మ్యాచ్‌లో ఏ ఆటగాడికైనా వైరస్‌ లక్షణాలు కనబడితే.. అతడి స్థానంలో మరొకరిని తీసుకోవచ్చు. కాంకషన్‌ సబ్‌స్టిట్యూ ట్‌ తరహాలోనే ఇదీ ఉంటుంది. ఇది వన్డేలు, టీ20లకు నో చాన్స్‌. 

రెండు దశాబ్దాల తర్వాత స్థానిక అంపైర్లు..

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ద్వైపాక్షిక సిరీ్‌సల్లో స్థానిక అంపైర్లు మ్యాచ్‌లను పర్యవేక్షించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణాలపై ఆంక్షలు నెలకొనడంతో వస్తువులను తరలించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరు స్థానిక అంపైర్లను వినియోగించుకోవచ్చు. అంటే, వచ్చే ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో భారత్‌ ఆడే సిరీ్‌సలో మ్యాచ్‌ రెఫరీగా జవగళ్‌ శ్రీనాథ్‌, అంపైర్లుగా షంషుద్దీన్‌, అనిల్‌ చౌధురి, నితిన్‌ మీనన్‌ లాంటి వాళ్లను చూసే అవకాశం ఉంది. 

అదనపు డీఆర్‌ఎస్‌

ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవం ఉన్న అంపైర్లు దొరికే అవకాశం లేదు. కొన్ని పొరపాట్లకు ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఇన్నింగ్స్‌లో ఆయా జట్టుకు ఉన్న నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్‌) కోటా పూర్తయినా.. అదనంగా మరో సమీక్షను కోరవచ్చు. దీంతో టెస్టులో 3, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 2కు డీఆర్‌ఎ్‌సల సంఖ్య పెరగనుంది. ఆటగాళ్ల క్రమశిక్షణ కోడ్‌కు సంబంధించి స్థానిక మ్యాచ్‌ రెఫరీకి ఐసీసీ క్రికెట్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ సహకరించనుంది. ఏదైనా వివాదాలను ఎలైట్‌ ప్యానెల్‌ తటస్థ మ్యాచ్‌ రెఫరీ ఆన్‌లైన్‌లో విచారించనున్నారు. 

జెర్సీపై లోగో..

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బోర్డులకు వెసులుబాటుగా టెస్టు మ్యాచ్‌లో ఆటగాళ్ల జెర్సీలపై 32 చదరపు అంగుళాల మేర వాణిజ్యపరమైన లోగోకు అనుమతి లభించింది. ఛాతీ ప్రాంతంలో ఈ లోగోను ముద్రించవచ్చు. ఇప్పటి వరకు వన్డేలు, టీ20ల్లోనే ఇలాంటి అవకాశం ఉంది.  

చెమట రాకపోతే ఏం చేయాలి?

చల్లటి వాతావరణం ఉండే ఇంగ్లండ్‌, కివీస్‌ల్లో ఏం చేయాలి. అక్కడైతే చెమట పట్టదు? అక్కడ ఆడాలంటే థర్మల్‌ లేదా పొడవైన టీషర్ట్‌ వేసుకోవాలి. 1992లో నేను యార్క్‌షైర్‌కు ఆడినప్పుడు ఐదు పొరల దుస్తులు ధరించా. చెమట పట్టని పరిస్థితుల్లో బంతిని మెరిపించాలంటే ఏం చేయాలి. మేం ఆడే రోజుల్లో కొత్త బంతికి ఉమ్మిని పూసేవాళ్లం. రివర్స్‌ స్వింగ్‌ వస్తున్నప్పుడు చెమటను అద్దేవాళ్లం. ఒకవైపు బరువు పెరగడంతో సమతుల్యం లోపించి బంతి అనుకున్న దిశగా వెళ్తుంది. - సచిన్‌ టెండూల్కర్‌

Updated Date - 2020-06-10T09:42:08+05:30 IST