ఐసీడీఎస్‌ అక్రమాలపై మళ్లీ కదలిక

ABN , First Publish Date - 2021-10-14T06:26:39+05:30 IST

ఐసీడీఎస్‌ అక్రమాల వ్యవహారంపై మళ్లీ కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. కొన్ని నెలలుగా దీనిపై అధికారులు మౌనంగా ఉంటుండటంపై పలు అనుమానాలు తలెత్తాయి.

ఐసీడీఎస్‌ అక్రమాలపై మళ్లీ కదలిక

ఎనిమిది మంది సీడీపీఓలకు చార్జ్‌ మెమోలు

పది రోజుల క్రితమే కడప ఆర్జేడీ జారీ

బయటకు పొక్కుకుండా వ్యవహారాలు

సిబ్బందిలో గుబులు

అనంతపురం వైద్యం, అక్టోబరు 13: ఐసీడీఎస్‌ అక్రమాల వ్యవహారంపై మళ్లీ కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. కొన్ని నెలలుగా దీనిపై అధికారులు మౌనంగా ఉంటుండటంపై పలు అనుమానాలు తలెత్తాయి. ఈ పరిస్థితిలో రాష్ట్ర ఐసీడీఎస్‌ కమిషనర్‌ మళ్లీ అనంత ఐసీడీఎస్‌ అక్రమాలపై చర్యలకు ఉపక్రమించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది సీడీపీఓలకు చార్జ్‌ మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. దీంతో కడప ఆర్జేడీ.. హిందూపురం, మడకశిర, తాడిపత్రి, గుత్తి, పెనుకొండ, కంబదూరు, కదిరి తూర్పు, కదిరి పశ్చిమ ప్రాజెక్టుల సీడీపీఓలకు చార్జ్‌ మెమోలు జారీ చేశారు. ఇవి పది రోజుల క్రితమే ఇచ్చినా.. గుట్టుగా ఉంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

గతేడాది ఈ అక్రమాల వ్యవహారంపై అప్పటి జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు, ప్రస్తుత జేసీ డాక్టర్‌ సిరి సీరియ్‌సగా స్పందించారు. అప్పటి అటవీ శాఖాధికారి నిశాంతరెడ్డితో ప్రత్యేక విచారణ చేయించారు. ఆయన రెండు నెలలకుపైగా విచారణ సాగించారు. తొలుత అంగనవాడీ స్థాయిలో సచివాలయానికి చెందిన మహిళా సంక్షేమ కేర్‌టేకర్ల ద్వారా రికార్డులు తెప్పించుకుని, కంప్యూటర్లలో నమోదు చేసుకున్నారు. తర్వాత సూపర్‌వైజర్‌, సీడీపీఓ స్థాయిలో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పీడీ కార్యాలయంలోని రికార్డులను వీటికి జత చేశారు. అన్నీ ఒకే రకంగా ఉన్నాయా, తేడాలున్నాయా అని పరిశీలించారు. తవ్వినకొద్దీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయని విచారణాధికారి చెబుతూ వచ్చారు. గతేడాది మార్చి 23 నుంచి కరోనా లాక్‌డౌన మొదలైంది. పౌష్టికాహారం, పాలు, గుడ్లు సరఫరాకు బ్రేక్‌ పడింది. మార్చి, ఏప్రిల్‌, మే నెలలో కూడా సరఫరా చేసినట్లు ట్రాన్సపోర్ట్‌ అలవెన్స బిల్లులను సీడీపీఓలు పెట్టినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. పౌష్టికాహార పంపిణీకి సంబంధించి ఒరిజినల్‌ అక్విడెన్సీలు.. సీడీపీఓల వద్దగానీ, పీడీ కార్యాలయంలోగానీ ఉండాలి. కొన్ని ప్రాజెక్టుల అక్విడెన్సీలు సరఫరా చేసే కాంట్రాక్టర్ల వద్ద ఉన్నట్లు విచారణలో బయటపడింది. కొందరు సీడీపీఓలు గతేడాది మార్చిలో పెట్టిన బిల్లులనే తర్వాత వరుసగా మరో రెండుమూడు నెలలు పెట్టి, డబ్బు డ్రా చేసుకున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చిందని అధికారులు అప్పట్లో చెప్పుకొచ్చారు. ఒక నెలలో పౌష్టికాహారం, పాలు, గుడ్లు పంపిణీ చేస్తే తర్వాత మిగులు చూపించి, తర్వాత ఎంత కావాలో పెట్టుకోవాలి. ఇక్కడ అలా చేయకుండా వరుసగా ఒకే రకమైన బిల్లులు పెట్టి, అడ్డంగా దొరికిపోయారు. సీడీపీఓలు, కాంట్రాక్టర్‌, ఐసీడీఎస్‌ జిల్లా కార్యాలయ రికార్డులకు చాలా వ్యత్యాసాలున్నట్లు విచారణలో తేలింది. జిల్లావ్యాప్తంగా సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగనవాడీలు రూ.కోట్లలో అక్రమాలకు పాల్పడ్డారని విచారణ సమయంలో పెద్దఎత్తున ప్రచారం సాగింది. పలువురు సీడీపీఓలపై వేటు పడుతుందని ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంటే కొందరి ఉద్యోగాలకే ఎసరు వస్తుందని పెద్దఎత్తున ప్రచారం సాగింది. ఈ ఏడాది మార్చిలో ఐసీడీఎస్‌ కార్యాలయంలో పనిచేసే ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్లను ఒకేసారి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఆ శాఖలో పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత సీడీపీఓలపైవేటు తప్పదన్న వాదనలు వినిపించాయి. అనంతరం ఈ  అక్రమ వ్యవహారం కొంత స్తబ్దుగా మారిపోయింది. సస్పెండైన సీనియర్‌ అసిస్టెంట్లు, సీడీపీఓలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటూ వస్తున్నారు. అయినా ఉన్నతాధికారుల నుంచి నెలలుగా స్పందన రాకపోవడంతో అంతా సర్దుకు పోయారన్న ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎనిమిది మంది సీడీపీఓలకు చార్జ్‌ మెమోలు జారీ చేయడం మళ్లీ కలకలం రేపుతోంది. ముందుగా ఇచ్చిన షోకాజ్‌ నోటీసులకు ఈ సీడీపీఓలు ఇచ్చిన సమాధానంపై ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేసి, చార్జ్‌ మెమోలు ఇచ్చినట్లు ఆ శాఖలో చర్చించుకుంటున్నారు. పదిరోజుల క్రితమే కడప ఆర్జేడీ.. సీడీపీఓలకు చార్జ్‌ మెమోలు జారీ చేశారు. సీడీపీఓలు, ఐసీడీఎస్‌ అధికారులు సైతం ఈ మెమోల వ్యవహారం బయటకు పొక్కుకుండా గుట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. జేసీ సిరి గుత్తి ప్రాజెక్టు పరిధిలోని అంగనవాడీ కేంద్రాల తనిఖీకి వెళ్లినపుడు సీడీపీఓ అందుబాటులో లేకుండా పోయారు. జేసీ.. ఎక్కడున్నారో సెల్‌కు లోకేషన షేర్‌ చేయాలని సీడీపీఓని ఆదేశించారు. అప్పుడు చార్జ్‌మెమో తీసుకోవడానికి కడపకు వచ్చినట్లు గుత్తి సీడీపీఓ లొకేషన షేర్‌ చేయగా ఈ వ్యవహారం బయటకు వచ్చిందని చెబుతున్నారు. ఐసీడీఎస్‌ పీడీ సుజన సైతం మెమోల వ్యవహారంతో తమకు సంబంధం లేదనీ, ఆర్జేడీ జారీ చేశారని చెప్పి, తప్పించుకుంటున్నారు. చార్జ్‌ మెమోలు జారీ చేయడంతో సీడీపీఓల్లో గుబులు మొదలైంది. వాటికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మేరకు ఉన్నతాధికారులు సంతృప్తి చెందకపోతే సస్పెన్షనతో పాటు ఇంక్రిమెంట్లు కట్‌ చేస్తారనీ, అవినీతి ఆరోపణలు బలంగా ఉంటే ఉద్యోగాలకు కూడా ఎసరు వచ్చే అవకాశాలు లేకపోలేదని ఆ శాఖలో చర్చించుకుంటున్నారు. మొత్తమ్మీద ఐసీడీఎస్‌ అవినీతి కథపై అధికారులు మళ్లీ దృష్టి పెట్టడంతో సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగనవాడీ కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది.


Updated Date - 2021-10-14T06:26:39+05:30 IST