ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం విత్‌డ్రాయల్, ట్రాన్సాక్షన్ ఛార్జీల పెంపు

ABN , First Publish Date - 2021-07-30T01:50:45+05:30 IST

వివిధ రకాల లావాదేవీలపై ఛార్జీలను వచ్చే నెల 1 నుంచి

ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం విత్‌డ్రాయల్, ట్రాన్సాక్షన్ ఛార్జీల పెంపు

న్యూఢిల్లీ : వివిధ రకాల లావాదేవీలపై ఛార్జీలను వచ్చే నెల 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంకు పెంచుతోంది. ఈ బ్యాంకు వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, డొమెస్టిక్ సేవింగ్స్ అకౌంట్లకు ఈ పెంపు వర్తిస్తుంది. నెలలో మొదటి మూడు లావాదేవీల తర్వాత నాన్-బ్యాంక్ ఏటీఎంల నుంచి నగదును తీసుకుంటే పెరిగిన ఛార్జీలను ఖాతాదారు చెల్లించవలసి ఉంటుంది. 


ఓ సంవత్సరంలో మొదటి 25 లీఫ్‌ల చెక్కు బుక్‌కు ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించనక్కర్లేదు. 10 చెక్ లీవ్స్ ఉండే అదనపు చెక్ బుక్‌కు రూ.20 చొప్పున చెల్లించాలి. 


కేలండర్ నెలలో మొదటి నగదు ఉపసంహరణకు ఎటువంటి ఛార్జీలు ఉండవు, ఉచితమే. రెండోసారి ఉపసంహరించుకునే ప్రతి రూ.1,000కి రూ.5 చొప్పున ఛార్జీ చెల్లించవలసి ఉంటుంది. ఒక నెలలో ఉచిత నగదు లావాదేవీ పరిమితి రూ.1 లక్ష అని ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటించింది. ఈ మార్పులు హోం బ్రాంచ్ అకౌంట్లకు వర్తిస్తాయి. నాన్ హోం బ్రాంచ్ ఖాతాదారులు రోజుకు రూ.25 వేలు లావాదేవీలను ఛార్జీలు లేకుండా జరపవచ్చు. ఈ పరిమితి మించితే రూ.1,000కు రూ.5 చొప్పున ఛార్జీలు చెల్లించాలి. 


ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో నాన్ బ్యాంక్ ఏటీఎంల నుంచి ఒక నెలలో మూడుసార్లు నగదు లావాదేవీలను ఎటువంటి ఛార్జీలు లేకుండా జరపవచ్చు. నాలుగోసారి నుంచి ప్రతి లావాదేవీకి రూ.20 చొప్పున ఛార్జీ చెల్లించవలసి ఉంటుంది. సిల్వర్, గోల్డ్, మాగ్నమ్, టైటానియం కార్డ్‌హోల్డర్లపై ప్రభావం ఈ పడుతుంది. 


ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు నగరాలు మినహా దేశంలోని ఇతర ప్రాంతాలవారు నెలలో ఐదు ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలను ఉచితంగా జరపవచ్చు. కేలండర్ నెలలో ఈ పరిమితికి మించి నిర్వహించే ప్రతి లావాదేవీకి రూ.8.50 చొప్పున ఛార్జీ చెల్లించాలి. 


Updated Date - 2021-07-30T01:50:45+05:30 IST