కరోనా వ్యాప్తిపై ఐసీఎంఆర్‌ మరో సర్వే?

ABN , First Publish Date - 2020-07-10T07:07:09+05:30 IST

దేశంలో కరోనా వైరస్‌ ఏ స్థాయిలో వ్యాప్తి చెందిందో గుర్తించేందుకు మరోసారి సీరో సర్వే నిర్వహించాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) నిర్ణయించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది...

కరోనా వ్యాప్తిపై ఐసీఎంఆర్‌ మరో సర్వే?

న్యూఢిల్లీ, జూలై 9: దేశంలో కరోనా వైరస్‌ ఏ స్థాయిలో వ్యాప్తి చెందిందో గుర్తించేందుకు మరోసారి సీరో సర్వే నిర్వహించాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) నిర్ణయించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.. దేశవ్యాప్తంగా 60 జిల్లాల్లో ఐసీఎంఆర్‌ గతంలో నిర్వహించిన సర్వే వివరాలను ఇంకా పూర్తిగా విడుదల చేయలేదు. ఆ సర్వేలో పాల్గొన్నవారిలో 0.73శాతం మంది వైరస్‌ బారిన పడినట్టు అప్పట్లో ఐసీఎంఆర్‌ వెల్లడించింది. ఆ సర్వేకు సంబంధించిన పీర్‌ రివ్యూ జరుగుతోందని, అది పూర్తయ్యాక మొత్తం డేటాను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. దానికి కొనసాగింపుగా దేశవ్యాప్తంగా మరో సర్వేను నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.


జూన్‌ 27 నుంచి జూలై 5 నడుమ ఢిల్లీలోని 11 జిల్లాల్లో 22 వేల  రక్త నమూనాలు సేకరించి వాటికి 15కు పైగా ల్యాబుల్లో పరీక్షలు చేయిస్తున్నారు. ఇదే కోవలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రప్రభుత్వాలతో సర్వే నిర్వహింపజేస్తామని ఐసీఎంఆర్‌ తెలిపింది. ఈసర్వేల్లో భాగంగా వ్యక్తుల శరీరాల్లో ఇమ్యూనోగ్లోబ్యులిన్‌ యాంటీబాడీలను గుర్తిస్తారు. వైరస్‌ సోకి నయమైన రెండువారాల తర్వాత.. వారి శరీరాల్లో ఈ యాంటీబాడీలు కనపడతాయి. అవి కొన్ని నెలలపాటు అలాగే ఉంటాయి. ఈ యాంటీబాడీస్‌ ఉన్నాయంటే వారు వైరస్‌ బారిన పడినట్టు లెక్క. దేశంలో ఎసింప్టమాటిక్‌ (వైరస్‌ సోకినా ఎలాంటి లక్షణాలూ బయటకు కనపడని) కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో.. వైరస్‌ నిజంగా ఏ స్థాయిలో వ్యాప్తి చెందిందో తెలుసుకోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ పరీక్షల వల్ల వైరస్‌ వ్యాప్తి గురించి మరింత సమాచారం తెలుస్తుంది. తద్వారా సరైన విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుంటుంది. గతంలో నిర్వహించిన సర్వేలో తేలిన వివరాలను ఆ జిల్లాల్లో ఉన్న ప్రజలందరికీ వర్తింపజేస్తే.. వాస్తవంగా 7 లక్షల మంది అప్పటికే వైర్‌సకు ఎక్స్‌పోజ్‌ అయినట్టు వైద్యనిపుణుల అంచనా. కానీ, అప్పటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 35 వేలు. వాస్తవంగా అందరికీ పరీక్షలు చేస్తే ఆ సంఖ్య 20 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని ఆందోళన వ్యక్తమైంది. 


Updated Date - 2020-07-10T07:07:09+05:30 IST