ఐసీఎంఆర్‌ పరిశీలనలో కొవిడ్‌ లాలాజల పరీక్ష : కేంద్రం

ABN , First Publish Date - 2020-09-21T06:54:33+05:30 IST

లాలాజలంతో కరోనా పరీక్ష చేసే పద్ధతిని దేశంలోనూ అందుబాటులోకి తెచ్చే అంశాన్ని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష్‌ వర్ధన్‌ వెల్లడించారు...

ఐసీఎంఆర్‌ పరిశీలనలో కొవిడ్‌ లాలాజల పరీక్ష : కేంద్రం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20 : లాలాజలంతో కరోనా పరీక్ష చేసే పద్ధతిని దేశంలోనూ అందుబాటులోకి తెచ్చే అంశాన్ని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష్‌ వర్ధన్‌ వెల్లడించారు. అయితే ఇప్పటివరకు దాని వినియోగానికి అనుమతులు కోరుతూ కంపెనీలేవీ తమను సంప్రదించలేదని స్పష్టంచేశారు. గత కొన్ని నెలల వ్యవధిలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన కరోనా వైరస్‌ రకాల జన్యుక్రమాలను విశ్ల్లేషించే భారీ అధ్యయన ప్రాజెక్టు ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలో కొనసాగుతోందన్నారు.


వైర్‌సలో జరిగిన జన్యుమార్పులు, దాని పరిణామక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు అక్టోబరు మొదటివారంకల్లా వెల్లడవుతాయని స్పష్టంచేశారు. దేశంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ రకాల్లో చెప్పుకోదగిన స్థాయుల్లో భారీ జన్యుమార్పులేవీ జరగలేదని వెల్లడించారు. సండే సంవాద్‌ శీర్షికన ప్రతి ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా ఆరోగ్యశాఖ నిర్వహించే ఆన్‌లైన్‌ కార్యక్రమంలో పలువురు నెటిజన్లు ప్రశ్నలకు ఆయన ఈ సమాధానాలిచ్చారు.

Updated Date - 2020-09-21T06:54:33+05:30 IST