ఇద్దరూ ఇద్దరే... కలెక్షన్‌ కింగ్‌లు!

ABN , First Publish Date - 2022-01-20T06:09:37+05:30 IST

మహా విశాఖ నగర పాలక సంస్థ జోన్‌-6 (గాజువాక) పరిధిలో గల ఒక వార్డులో ఇద్దరు నేతలు...టౌన్‌ప్లానింగ్‌ విభాగం ఉద్యోగితో కలిసి తెగ దండుకుంటున్నారు.

ఇద్దరూ ఇద్దరే... కలెక్షన్‌ కింగ్‌లు!

ఆ వార్డులో ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ఎవరో ఒకరికి కప్పం కట్టాల్సిందే...

ఒకరు వైసీపీ నేత, మరొకరు అధికార పార్టీ పంచన చేరిన టీడీపీ నేత

జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ ఉద్యోగితో కలిసి దందా

పునాది తీసినట్టు సమాచారం అందితే... పనులు నిలుపుదల చేయించి,

తమను కలిసేలా చేయాలంటూ సదరు ఉద్యోగికి ఆదేశాలు

భవన విస్తీర్ణం బట్టి డబ్బులు డిమాండ్‌

జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదుల వెల్లువ

అయినా చర్యలపై మీనమేషాలు

డెప్యూటేషన్‌పై వచ్చిన ఆ ఉద్యోగిపై గతంలో అనేక కేసులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మహా విశాఖ నగర పాలక సంస్థ జోన్‌-6 (గాజువాక) పరిధిలో గల ఒక వార్డులో ఇద్దరు నేతలు...టౌన్‌ప్లానింగ్‌ విభాగం ఉద్యోగితో కలిసి తెగ దండుకుంటున్నారు. వార్డు పరిధిలో ఎవరు నిర్మాణాలు చేపట్టినా భారీగా డబ్బులు గుంజుతున్నారు. ప్లాన్‌ కోసం జీవీఎంసీకి అన్ని ఫీజులు కట్టినా...తమకు కప్పం కట్టాల్సిందేనంటున్నారు. వాణిజ్య భవనాలు, అపార్టుమెంట్లు, గ్రూప్‌హౌస్‌లు...చివరగా సొంతంగా ఇల్లు నిర్మించుకునే వారిని కూడా వీరు వదలడం లేదు. గాజువాక ప్రాంతంలో జరుగుతున్న ఈ దందాపై జీవీఎంసీ ఉన్నతాధికారులకు సమాచారం వున్నప్పటికీ చర్యలు చేపట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవీఎంసీ జోన్‌-6 (గాజువాక)లోని కొన్ని వార్డుల్లో భవన నిర్మాణాల విషయంలో అధికార పార్టీ కార్పొరేటర్లు, వార్డు ఇన్‌చార్జుల జోక్యం   మితిమీరుతోంది. తమను ప్రసన్నం చేసుకోకుండా నిర్మాణాలు చేపట్టిన వారిని టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారు. ఇక జోన్‌ పరిధిలోని ఒక వార్డు విషయానికి వస్తే ఇద్దరు నేతలు కూడా...నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టినా టౌన్‌ప్లానింగ్‌ ఉద్యోగిని పంపించి పనులు నిలుపుదల చేయిస్తున్నారు. సమస్య పరిష్కారం కావాలంటే ఒకటే మార్గమని...తమకు సమాచారం ఇచ్చిన నేతను కలవాలంటూ సదరు ఉద్యోగి సలహా ఇస్తుంటారు. సదరు నేతను కలిస్తే భవనం విస్తీర్ణాన్ని బట్టి మామూళ్లు డిమాండ్‌ చేస్తున్నారు. అడిగినంత సమర్పించుకుంటే తిరిగి పని చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. గత ఆరు నెలలుగా ఈ దందా నడుస్తున్నా...రెండు నెలల కిందట ఆ జోన్‌కు వచ్చిన ఉద్యోగి   సదరు నేతలతో కుమ్మక్కు కావడంతో మరింత అడ్డగోలుగా  వ్యవహరిస్తున్నారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఆ వార్డులో ఇటీవల ఒకరు తన స్థలంలో భవనం నిర్మాణం చేపట్టారు. ఆయన వద్దకు సదరు టౌన్‌ప్లానింగ్‌ ఉద్యోగి ఈనెల 13న వెళ్లి నిర్మాణపనులు నిలిపివేయాలని ఆదేశించారు. తాను ప్లాన్‌ ప్రకారమే నిర్మాణం చేస్తున్నానని భవన యజమాని చెప్పగా, ఆ వార్డు కార్పొరేటర్‌ను కలసి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. 14న భోగి కావడంతో సెలవు కాబట్టి తర్వాత కలుస్తానని చెప్పినప్పటికీ...భోగి అయినప్పటికీ ఆయన అందుబాటులో ఉంటారని, అదేరోజు కలవాలని టౌన్‌ప్లానింగ్‌ ఉద్యోగి చెప్పారు. దీంతో సదరు నేతను భవన యజమాని కలవగా రూ.రెండు లక్షలు డిమాండ్‌ చేసి మరీ తీసుకున్నారు. అదే ప్రాంతంలో మరొకరు ఇంటి నిర్మాణం చేపట్టారు. ఆ వార్డు వైసీపీ ఇన్‌చార్జి...టౌన్‌ప్లానింగ్‌ ఉద్యోగిని పిలిచి తనను కలవకుండా నిర్మాణం చేస్తున్నారని చెప్పారు. అంతే...నిర్మాణం వద్దకు దిగువ స్థాయి సిబ్బందిని పంపించిన టౌన్‌ప్లానింగ్‌ ఉద్యోగి...భవన యజమానిని జోన్‌ కార్యాలయానికి వచ్చి తనను కలవాలని చెప్పాలంటూ ఆదేశించారు. ఆ భవన యజమాని జోన్‌-6 కార్యాలయానికి వెళ్లి సదరు ఉద్యోగిని కలిసేందుకు యత్నించినా, ఆయన లేరు. ఆ తర్వాత కలవగా...విషయం ఏమిటని అడిగారు. తాను ప్లాన్‌ ప్రకారమే ఇల్లు నిర్మించుకుంటున్నానని చెప్పగా, వార్డు వైసీపీ ఇన్‌చార్జిని కలవాలని సూచించారు. దీంతో వార్డు ఇన్‌చార్జిని కలవగా ‘తాను పిలవలేదే...’ అంటూ అమాయకంగా ముఖం పెట్టారు. టౌన్‌ప్లానింగ్‌ ఉద్యోగి వద్దకు వెళ్లి విషయం చెప్పగా, ఆయన అలాగే అంటారని, డబ్బులు ఇచ్చి సెటిల్‌ చేసుకోవాలని మొహమాటం లేకుండా చెప్పారు. ఇలా పెద్ద పెద్ద నిర్మాణాలే కాదు చిన్న ఇళ్లను కూడా వదలకుండా ఇద్దరు నేతలు...టౌన్‌ప్లానింగ్‌ ఉద్యోగితో కలిసి దోచుకుంటున్నారు. దీనిపై జీవీఎంసీ అధికారులకు కొంతమంది మౌఖికంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఒకరు అధికార పార్టీ నేత, మరొకరు అధికార పార్టీకి అనుకూలంగా వున్న కార్పొరేటర్‌ కావడంతో మౌనం వహిస్తున్నారు. 


నాడు ప్రత్యర్థులు...నేడు ఒకే గూటి పక్షులు

గత ఏడాది మార్చిలో జీవీఎంసీకి జరిగిన ఎన్నికల్లో ఈ వార్డు నుంచి వారిద్దరూ టీడీపీ, వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో, అధికార పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన నేత వార్డు ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. తర్వాత టీడీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్‌ వైసీపీకి దగ్గరవడంతో...వార్డులో వారిద్దరి మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. వార్డులోని ప్రాంతాలను ఇద్దరూ వాటాలుగా పంచుకుని వ్యవహారాలను నడుపుతున్నారు.  తమ ప్రాంతంలో జరిగే నిర్మాణాలకు సంబంధించి యజమానులు, నిర్మాణదారులు కచ్చితంగా తమను కలిసేలా టౌన్‌ప్లానింగ్‌ ఉద్యోగికి ఆదేశాలు జారీచేశారు.  


టౌన్‌ ప్లానింగ్‌ ఉద్యోగిపై గతంలో అనేక కేసులు

జోన్‌-6కు డిప్యుటేషన్‌పై వచ్చిన సదరు ఉద్యోగిపై గతంలో అనేక కేసులు ఉన్నాయి. విజయనగరం జిల్లాలో పనిచేస్తుండగా ఏసీపీ ట్రాప్‌తోపాటు, మరొక కేసు కూడా వున్నట్టు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు. మే నెలలో ఉద్యోగ విరమణ వున్నందున తనకు జీవీఎంసీలో పనిచేసే అవకాశం కల్పించాలంటూ రాజకీయ నేతలతో పైరవీ చేయించుకుని వచ్చినట్టు చెబుతున్నారు. వార్డులోని ఇద్దరు నేతలు చెప్పినట్టు చేస్తే తనకు భారీగా ఆదాయం చేకూరుతుందనే భావనతో భవన నిర్మాణదారులను వేధింపులకు గురిచేస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-01-20T06:09:37+05:30 IST