Abn logo
Jun 16 2021 @ 04:03AM

రైతుబంధు ప్రపంచానికే ఆదర్శం

తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారు: కేటీఆర్‌

నకిరేకల్‌, కేతేపల్లి, జూన్‌ 15: రైతు బంధు పథకం ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్‌ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యసభ సభ్యత్వాలను వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులకు అమ్ముకుంటుంటే.. టీఆర్‌ఎస్‌ మాత్రం బలహీనవర్గాలకు చెందిన బండా ప్రకాశ్‌, బడుగుల లింగయ్య యాదవ్‌ను పెద్దల సభకు పంపించిందని చెప్పా రు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. మంత్రి జగదీశ్‌ రెడ్డితో కలిసి నల్లగొండ జిల్లా నకిరేకల్‌, కేతేపల్లిల్లో వైకుంఠధామం, రైతు వేదికలను మంగళవారం ఆయన ప్రారంభించారు.


గత 60 సంవత్సరాల్లో ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు చేయని అభివృద్ధి పనులను రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేసి చూపిస్తున్నారన్నారు. కరోనా సంక్షోభంలోనూ పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని, రాష్ట్రంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రైతు వేదికలు దేశానికే ఆదర్శంగా నిలిచి రైతులకు దేవాలయాలుగా మారాయని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. కాగా, లాక్‌డౌన్‌ సమయం దాటిన తర్వాత అంటే, సాయంత్రం ఆరు గంటల తర్వాత మంత్రులు నకిరేకల్‌లో సభ నిర్వహించడం చర్చనీయాంశమైంది.