అంబేడ్కర్‌ బాటలో ఆదర్శ యోధురాలు

ABN , First Publish Date - 2020-12-01T05:48:04+05:30 IST

భారతదేశం కులాల సమూహం. ఉత్పత్తితో మమేకమై ఈ దేశ ఆర్థికవ్యవస్థకు ఆయువు పోసిన భూమిపుత్రులు అంటరానివారై వేల సంవత్సరాల పాటు ఊరికి...

అంబేడ్కర్‌ బాటలో ఆదర్శ యోధురాలు

అనునిత్యం అంటరానివారి కోసం ఆలోచించి పరితపించిన తపస్వి, నిగర్వి, నిస్వార్థ సేవకురాలు, అంబేడ్కర్‌కు నిజమైన వారసురాలు ఈశ్వరిబాయి. ‘నీ జీవితానికి మరెవరో యజమాని కాదు నువ్వే యజమానివి. నువ్వే దానిని తీర్చిదిద్దుకోవా’లన్న గౌతమ బుద్ధుడు బోధించిన దమ్మసూత్రాన్ని పాటించి ఈశ్వరీబాయి స్వయంకృషితో తన జీవితాన్ని మహోన్నతంగా మలుచుకున్న తీరు ఆదర్శప్రాయం.


భారతదేశం కులాల సమూహం. ఉత్పత్తితో మమేకమై ఈ దేశ ఆర్థికవ్యవస్థకు ఆయువు పోసిన భూమిపుత్రులు అంటరానివారై వేల సంవత్సరాల పాటు ఊరికి దూరంగా వెలివేయబడి పశువుల కంటే హీనంగా చూడబడి జీవనం సాగించారు. అలా వేల ఏళ్ళుగా కష్ట జీవులను వెతలకు, వెట్టికి గురి చేసి వేళ్ళూనుకుపోయిన కులవ్యవస్థ కుత్తుక కోసిన మహనీయుడు భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఆశయాలను కొనసాగిస్తూ తుదిశ్వాస విడిచేంత వరకు తాడిత పీడిత ప్రజల అభ్యున్నతే శ్వాసగా సాగిన ఉక్కు మహిళ, అగ్నిశిఖ శ్రీమతి జెట్టి ఈశ్వరీబాయి. అణగారిన ప్రజల హక్కుల గొంతుకగా నిలిచిన ఆమె సామాన్య మాల కులానికి చెందిన బల్లెపు బలరామస్వామి, రాములమ్మ దంపతులకు 1918 డిసెంబర్‌ 1వ తేదీన జన్మించారు. ఈశ్వరీబాయి చిన్నతనం నుంచే ఆత్మాభిమానం, ధైర్యసాహసాలు మెండుగా కలిగిన వ్యక్తి. పదమూడవ ఏట పెళ్లి అయి ఒక కుమార్తె (మాజీ మంత్రి గీతారెడ్డి) జన్మించిన కొన్నాళ్ల తర్వాత భర్తను కోల్పోయింది. అక్కడితో తన జీవితం ముగిసిందని ఒక సాధారణ స్త్రీలాగా ఆలోచించలేదు. ఒక ఇంగ్లీష్‌ తత్వవేత్త చెప్పినట్టు ‘జీవితంలో ఒకదారి మూసుకుపోయినపుడు తప్పకుండా మరోదారి తెరిచే ఉంటుంది. ఆ దారిని గుర్తించడమే జీవితానికి విజయాన్ని చేకూర్చుతుంది’’ అన్న మాటలు అక్షరాల ఆమె జీవితానికి సరిపోతాయి. భర్తను కోల్పోయినా మనోధైర్యం కోల్పోకుండా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసి, తరతరాలుగా స్త్రీని ఇంటిపనులకు వంటగదికి పరిమితం చేసి బానిసగా చూసే సాంఘిక దురాచారాన్ని ఎదిరించి నిలబడ్డ వనిత ఈశ్వరీబాయి. 


ఆత్మగౌరవంతో, స్వతంత్య్ర వ్యక్తిత్వంతో సమాజంలో స్త్రీలకు ప్రత్యేక స్థానం ఉండాలని ఆకాంక్షించి ఉద్యమించారు ఈశ్వరీబాయి. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్‌, మరాఠి వంటి బహుభాషల్లో ప్రావీణ్యం ఉన్న కోవిదురాలు కావడం వల్ల ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయురాలిగా చేరి ట్యూషన్లు చెప్పి తన కాళ్ళమీద తాను నిలబడి స్వతంత్య్ర మహిళగా ఎదిగారు. ఉద్యోగం చేస్తూ జీవితం సాఫీగా సాగుతున్నప్పటికీ, చుట్టూ ఉన్న సమాజాన్ని కమ్మేసిన మూఢవిశ్వాసాలను చూసి, అగ్రవర్ణాలవారు బడుగు బలహీన వర్గాలు, దళితులపై కొనసాగిస్తున్న దౌర్జన్యాలను, అఘాయిత్యాలను, వారి నిస్సహాయ దయనీయ పరిస్థితులను చూసి కలత చెంది చలించిపోయేవారు. ‘నీ కోసం జీవిస్తే నీకు నీవుగానే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిపోతావు’ అన్న అంబేద్కర్‌ మాటలను మదిలో నింపుకున్న ఈశ్వరీబాయి దళిత జనోద్ధరణ, పీడిత వర్గాల విముక్తి కోసం పాటుపడాలని నిర్ణయించుకున్నారు. 


హైదరాబాద్‌ కేంద్రంగా దళితుల విముక్తి కోసం పోరాడుతున్న భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి, బిఎస్‌. వెంకట్రావ్‌, బత్తుల శ్యాంసుందర్‌, జెహెచ్‌. సుబ్బయ్య వంటి పోరాటయోధుల నుంచి స్ఫూర్తి పొంది దళిత జనోద్ధరణకై అడుగులు వేశారు. అనునిత్యం అంబేడ్కర్‌‌ ఉపన్యాసాలను వింటూ, పత్రికల్లో వచ్చే వ్యాసాలను చదువుతూ, ఉద్యమాలను గమనిస్తూ వాటివైపు ఆకర్షితురాలయ్యారు. ‘నేను ఏ జాతిలో జన్మించి పెరిగి పెద్దవాడినై జీవితాన్ని కొనసాగిస్తున్నానో ఆ దళిత ప్రజల సంక్షేమం కోసం, అభ్యున్నతి కోసం, నా జీవితం ధారపోస్తాను’ అన్న అంబేద్కర్ మాటలను తన జీవితానికి అన్వయించుకున్నారు. ‘హరించి వేసిన హక్కులను భిక్షమెత్తిగానీ ప్రాధేయపడిగానీ సాధించలేమని, అలుపెరగని నిరంతర పోరాటాలే శరణ్యమని, అంబేడ్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయాల సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేయాలనే దృఢ నిర్ణయంతో దళిత ఉద్యమాల్లో‍ పాల్గొంటూ సమసమాజ స్థాపన కోసం శాయశక్తుల కృషి చేశారు. 


‘Political power is the master key by which you can open all the doors of progress’ అని అంబేద్కర్‌ చెప్పిన మాటలను బాగా అర్థం చేసుకున్న ఈశ్వరీబాయి రాజ్యాధికారం కోసం దళితుల సమస్యల్ని చట్టసభల్లో వినిపించడానికి రాజకీయరంగ ప్రవేశం చేశారు. 1952లో సికింద్రాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆమెపై అనేకమార్లు రౌడీ మూకలు దాడి చేశాయి. అయినా ఆమె ఎప్పుడూ భయపడలేదు. దూర ప్రాంతాలకు వెళ్ళినా తన కారును ఒంటరిగానే నడుపుకుంటూ వెళ్లే వారు. ఆత్మరక్షణ కోసం కారులో ఎప్పుడూ ఒక కారంపొడి ప్యాకెట్‌, దొడ్డుకర్ర, కొన్ని రాళ్లను తన డ్రైవింగ్‌ సీటు పక్కన పెట్టుకునేవారు. 1962లో రిపబ్లికన్‌‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పిఐ)లో చేరి 1967లో నిజామాబాద్‌ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి, అప్పటికే మంత్రిగా పనిచేస్తున్న టి.ఎన్‌. సదాలక్ష్మిపై విజయం సాధించి సంచలనం సృష్టించారు.


తర్వాత 1972లో అదే నియోజకవర్గం నుంచి రెండో సారి నంది ఎల్లయ్యపై విజయం సాధించారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఆమె అనేక విషయాలపై మాట్లాడారు. ప్రజాసమస్యలను లేవనెత్తడానికి రాష్ట్ర శాసనసభను ఉత్తమ వేదికగా ఉపయోగించుకున్నారు, అనేక సమస్యలకు పరిష్కారం చూపించారు. ప్రస్తుతం మన దేశంలో గాని, తెలంగాణలో గాని ప్రధాన సమస్య విద్యావ్యవస్థ సవ్యంగా లేకపోవడం. ఈ వ్యవస్థ మెరుగుదలకు ఆనాడే ఆమె అనేక సూచనలు చేశారు. ‘విద్యారంగంలో అన్ని స్థాయిల్లో ప్రమాణాలు పతనమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో బోధనస్థాయి దిగజారింది. అందువల్లనే ప్రజలకు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల మీద మోజు పెరుగుతోంది. విద్య వ్యాపార‍మయ్యింది. ధనవంతులు భారీ డొనేషన్లు, ఫీజులు చెల్లించి ప్రైవేటు విద్యాలయాల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. పేదలు, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు డబ్బులు లేక ప్రభుత్వ పాఠశాలకు వెళుతున్నారు. అందువల్ల ప్రభుత్వ విద్యాలయాల్లో వసతులు కల్పించాలి. విద్యావిధానంలో మార్పులు రావాలి. సాంకేతిక విద్యాసంస్థలను ఎక్కువ సంఖ్యలో ప్రవేశపెట్టాలి, వృత్తివిద్యా కోర్సులు ప్రవేశపెట్టాలి. అప్పుడే నిరుద్యోగ సమస్య తీరుతుంద’ని ఈశ్వరీబాయి పేర్కొన్నారు. ఆమె చెప్పిన 50 సంవత్సరాల తర్వాత, అంటే నేటికీ విద్యావ్యవస్థ, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల పరిస్థితి అలాగే ఉంది. ఆ రోజు ఆమె చేసిన సిఫారసులను ప్రభుత్వాలు పాటించి ఉంటే విద్యావ్యవస్థ నేడు పరిఢవిల్లేది. 


నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కూడా చర్చించడమే కాకుండా 1969లో జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈశ్వరీబాయి ప్రత్యక్షంగా పాల్గొని క్రియాశీలకంగా పోరాడారు. కంచికచెర్లలో దళితుల మీద జరిగిన దాడులు, భూస్వాముల చేతుల్లో బలియైున దళిత స్త్రీలు, ఎస్సీ సంక్షేమ హాస్టళ్ళు, రైతులు, చేనేత కార్మికుల సమస్యలు, ఆరోగ్యం, వైద్యం, నిరుద్యోగ సమస్య, ఉపాధికల్పన వంటి అనేక సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడి పాలకపక్షాలకు ముచ్చెమటలు పట్టించారు. ఆమె గొప్ప పోరాటయోధురాలు, ఎవరికీ భయపడని నైజం ఆమెది. ‘తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆమె చెంగులు ఎగదోపి పోలీసుల మీద దాడి చేయడానికి శివంగిలా దూకిన చిరుత. అంటరాని జీవితాల్లో వెలుగు నింపడానికి అంటుకున్న పెనుమంట’ అని ఆమె గురించి వ్యాఖ్యానించారు ప్రజాయుద్ధనౌక గద్దర్‌. 


అనునిత్యం అంటరానివారి కోసం ఆలోచించి పరితపించిన తపస్వి, నిగర్వి, నిస్వార్థ సేవకురాలు, అంబేడ్కర్‌కు నిజమైన వారసురాలు ఈశ్వరిబాయి. సమానత్వం కోసం అహర్నిశలు పోరాడిన ఆమె అనారోగ్యానికి గురై 1991 ఫిబ్రవరి 24న తుదిశ్వాస విడిచారు. 


‘నీ జీవితానికి మరెవరో యజమాని కాదు నువ్వే యజమానివి. నువ్వే దానిని తీర్చిదిద్దుకోవా’లన్న గౌతమ బుద్ధుడు బోధించిన దమ్మసూత్రాన్ని పాటించి ఈశ్వరీబాయి స్వయంకృషితో తన జీవితాన్ని మహోన్నతంగా మలుచుకున్న తీరు ఆదర్శప్రాయం. ‘దళిత కులాలకు చెందిన యువతీ యువకులు ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేయాలి. చదువు పట్ల శ్రద్ధ వహించి క్రమశిక్షణతో మెలగాలి. ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం, అధికారాల కోసం పోరాడా’లని ఆమె తన జీవిత చరమాంకంలో చెప్పిన మాటలను దృష్టిలో ఉంచుకుని సమసమాజ స్థాపన కోసం, అణగారిన ప్రజల రాజ్యాధికారం కోసం పోరాడడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అవుతుంది.

అంగరి ప్రదీప్‌ కుమార్‌, 

మంచాల లింగస్వామి, 

ఆల్‌ మాల స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (అంసా)

(నేడు ఈశ్వరీబాయి జయంతి)



Updated Date - 2020-12-01T05:48:04+05:30 IST