ఆ విషయంలో అట్టడుగుకు దగ్గరలో భారత్.. చైనా, అమెరికాల కంటే కింద..

ABN , First Publish Date - 2021-09-13T02:53:35+05:30 IST

మీరు ట్రైన్‌లో కిటికీ పక్కన కూర్చుని ప్రయాణిస్తున్నారు. ఇంతలో మీపై ఎక్కడి నుంచో నీటి తుంపరలు వచ్చి పడ్డాయి. తొంగి చూస్తే మీ ముందు కిటికీలో కూర్చున్న వ్యక్తి ఎంచక్కా..

ఆ విషయంలో అట్టడుగుకు దగ్గరలో భారత్.. చైనా, అమెరికాల కంటే కింద..

ఇంటర్నెట్ డెస్క్: మీరు ట్రైన్‌లో కిటికీ పక్కన కూర్చుని ప్రయాణిస్తున్నారు. ఇంతలో మీపై ఎక్కడి నుంచో నీటి తుంపరలు వచ్చి పడ్డాయి. తొంగి చూస్తే మీ ముందు కిటికీలో కూర్చున్న వ్యక్తి ఎంచక్కా బయటకు చేతులు పెట్టి నీటితో శుభ్రం చేసుకుంటుంటారు. ఆ నీళ్ళే మీ మీద పడుతున్నాయి. అయితే ట్రైన్‌లో చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ ఉండదా అంటే కచ్చితంగా ఉంటుంది. అయితే సీట్లో నుంచి లేచి అక్కడివరకు వెళ్లి చేతులు ఎవరు శుభ్రం చేసుకుంటారనేదే సమస్య. ఇది మాత్రమే కాదు కారులో నుంచి కాగితాలు, తినుబండారాల వ్యర్థాలు ఇలాంటివి రోడ్లపై పారేయడానికి కూడా ఏ మాత్రం భారతీయులు ఆలోచించరు. ఇలాంటి విషయాల్లో భారతీయులంతా యథేచ్ఛగా ఇలాంటి తప్పులను చేస్తుంటారు. ఇతరులు మనవల్ల ఇబ్బంది పడుతున్నా.. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తాము చేస్తున్న పనిని కానిచ్చేస్తారు. కానీ అలా ఎవరైనా చేయడం వల్ల వారికి ఏమైనా నష్టం కలిగితే మాత్రం తెగ ఇబ్బంది పడిపోతారు. అలాగే లాభాపేక్ష ఉన్నప్పుడు కూడా అలాంటి తప్పులు చేయరు. ఈ విధానాన్నే ఒక్క ముక్కలో చెప్పాలంటే సోషల్ మైండ్‌ఫుల్ నెస్ అనవచ్చు.


సోషల్ మైండ్ ఫుల్ నెస్‌కు సంబంధించి తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో భారత్‌కు లభించిన స్కోరు కేవలం 50 శాతం. సోషల్ బిహేవియర్(ప్రజల మనస్తత్వాలు, ప్రవర్తన) అమెరికన్ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 31 దేశాలు పాల్గొనగా అందులో భారత్‌కు ఈ స్కోరు దక్కింది.


ఇక గత వారం నేషనల్ అకాడెమీ ఆప్ సైన్సెస్‌ ప్రచురించిన ఓ వ్యాసంలో కూడా దీని గురించి ప్రస్తావించడం జరిగింది. అందులో సోషల్ మైండ్ ఫుల్‌నెస్ సూచీలో 72 శాతం స్కోరింగ్‌తో జపాన్ టాప్‌లో ఉంది. రెండో స్థానంలో 69 శాతం స్కోరింగ్‌తో ఆస్ట్రేలియా నిలిచింది. మూడో స్థానంలో 68 శాతం స్కోరుతో మెక్సికో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మరికొన్ని దేశాలతో కలిసి బ్రిటన్ 64 శాతం, చైనా 62 శాతం, అమెరికా 58 శాతం నిలిచాయి. వీటి తరువాత భారత్‌ 50 శాతంతో ఉండగా.. అంత్యంత తక్కువగా ఇండోనేషియా 46 శాతం సోషల్ మైండ్‌ ఫుల్‌నెస్ స్కోరింగ్‌ సాధించింది. దానికంటే కొంత పైన 47 శాతంతో టర్కీ నిలిచింది.


మొత్తం 65 మంది అంతర్జాతీయ పరిశోధకులతో ఏర్పడిన బృందం వివిధ దేశాల్లోని 8,354 మందిపై ఈ సర్వే నిర్వహించింది. ఈ క్రమంలోనే సోషల్ మైండ్‌నెస్‌లో వివిధ దేశాలకు చెందిన ప్రజలు భిన్నంగా ప్రవర్తించినట్లు వెల్లడైంది. దీనిపై నెదర్లాండ్స్‌లోని లెయ్‌డెన్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నీల్స్ వ్యాన్ డుస్సమ్ ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. ‘రోజువారీ జీవితంలో  అనేక సార్లు ఇతరులకు సాయం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. దానికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం బాధ్యతగా వ్యవహరిస్తే మనకు తెలియకుండానే ఇతరులను సమస్యల బారిన పడకుండా చేయగలం. అందరూ దీని గురించి ఆలోచించడం మొదలు పెడితే సమాజం అద్భుతంగా అభ్యున్నతి సాధిస్తుంది’ అని పేర్కొన్నారు.

Updated Date - 2021-09-13T02:53:35+05:30 IST