అనుసంధానం అయితేనే..!

ABN , First Publish Date - 2021-04-18T05:14:56+05:30 IST

పంటల బీమాకు సర్వర్‌ సమస్య అడ్డంకిగా మారింది. ఆధార్‌ అనుసంధానం కాకపోతే పరిహారం అందదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

అనుసంధానం అయితేనే..!
జిల్లాలో నీట మునిగిన పంట (ఫైల్‌)

  1. సర్వర్‌ సమస్యతో రైతులకు ఇబ్బందులు
  2. ఇప్పటి వరకు అయినవి 63 శాతమే
  3. పంటల బీమాపై ప్రభుత్వం మెలిక

కర్నూలు-ఆంధ్రజ్యోతి:  పంటల బీమాకు సర్వర్‌ సమస్య అడ్డంకిగా మారింది.  ఆధార్‌ అనుసంధానం కాకపోతే పరిహారం అందదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించే రైతులకు ప్రకృతి సహకారం అంతంత మాత్రమే! అతివృష్ఠి, అనావృష్ఠి, తెగుళ్లు, మార్కెట్‌ మాయాజాలం.. ఇలా అడుగడుగునా విపత్తులు ఎదుర్కొంటూనే పంటలు పండిస్తారు. ప్రకృతి విపత్తుతో నష్టపోయే రైతులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా ప్రవేశపెట్టాయి. కానీ క్షేత్ర స్థాయిలో బీమా కూడా సరిగా అమలు కావడం లేదు. బీమా పొందాలంటే రైతు ఖాతాకు ఆధార్‌ అనుసంధానం చేయాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఆధార్‌ అనుసంధానానికి గత నెలలో యాప్‌ కూడా తెచ్చారు. కానీ సర్వర్‌ సమస్య కారణంగా రైతుల వివరాలు అప్‌లోడ్‌ కావడం లేదు. ఈ నెల చివరి వరకు అప్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కానీ సర్వర్‌ సమస్య ఇలాగే కొనసాగితే బీమా పరిహారం అందదేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


గడువులోగా అయ్యేనా..?

జిల్లా వ్యాప్తంగా 4.70 లక్షల మంది రైతులు ఈ-క్రాప్‌లో నమోదు చేసుకున్నారు. వారిలో కేవలం 2.84 లక్షల మంది ఖాతాలకు మాత్రమే ఆధార్‌ అనుసంధానమైంది. రైతు భరోసా కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండడంతో సర్వర్‌ సమస్య తలెత్తుతోంది. పలు చోట్ల వ్యవసాయ శాఖ సహాయకులు, రైతుల మధ్య సమయం కుదరడం లేదు. సర్వర్‌ సమస్య పరిష్కారం కోసం ఒక్కో జిల్లాలో రెండు మూడు రోజులు మాత్రమే రైతుల వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మే మొదటి వారంలో బీమా నగదును విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరుకల్లా ఆధార్‌ అనుసంధానం చేస్తామని అన్నారు.


ఖరీఫ్‌కు బీమా

గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు పంటల బీమా అమలు చేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దిగుబడులు తగ్గిన వేరుశనగ, పత్తి, టమోట పంటలకు పరిహారం అందజేస్తారు. ఇందుకోసం ఈ-క్రాప్‌ నమోదైన రైతుల ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను ప్రారంభించారు. రైతులు తమ పరిధిలోని రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి, వ్యవసాయ శాఖ సహాయకులను సంప్రదించి ఆధార్‌ అనుసంధానం చేసుకోవాల్సి ఉంది.


సాగు చేయలేదని చెబుతున్నారు

రెండు ఎకరాలలో ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేశాను. అయితే ఈ క్రాప్‌ నమోదుకు ఫొటో దిగకపోవడంతో అధికారులు మీరు పంటే సాగుచే యలేదని చెబుతున్నారు. ఈ క్రాప్‌ నమోదుకు వెళ్తే అవకాశం లేదని అంటున్నారు. -  సుంకన్న, పత్తికొండ


అందరి ఆధార్‌ అప్‌లోడ్‌ చేస్తాం

ఈ-క్రాప్‌ చేసుకున్న ప్రతి ఒక్కరికి బీమా అందించేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఆధార్‌ అప్‌లోడ్‌ చేస్తున్నాం. జిల్లా రైతులకు కేటాయించిన రోజున రైతులు ఆధార్‌ నమోదు చేసుకునేలా చేస్తున్నాం.  - ఉమామహేశ్వరమ్మ, జేడీఏ, కర్నూలు

Updated Date - 2021-04-18T05:14:56+05:30 IST