టీకా వేసుకున్న యువతకు బీర్ ఫ్రీ.. అధికారుల ఏర్పాట్లు!

ABN , First Publish Date - 2021-05-07T08:31:47+05:30 IST

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ వేసుకునేందుకు యువత ముందుకు రావడం లేదు. వ్యాక్సినేషన్‌పై ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. టీకా తీసుకోవాలంటూ యువ

టీకా వేసుకున్న యువతకు బీర్ ఫ్రీ.. అధికారుల ఏర్పాట్లు!

ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ వేసుకునేందుకు యువత ముందుకు రావడం లేదు. వ్యాక్సినేషన్‌పై ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. టీకా తీసుకోవాలంటూ యువతను బలవంతపెట్టకుండా వారంతంట వారే వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వచ్చేలా అదిరిపోయే ప్లాన్‌ను సిద్ధం చేసింది. యువతను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త మార్గలను అన్వేషిస్తూ అందులో భాగంగానే వ్యాక్సిన్ వేసుకున్న యువతకు ఫ్రీగా బీరు బాటిల్‌ను అందించాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే ఇది మన రాష్ట్రంలోనో లేక దేశంలోనో అనుకుంటే మాత్రం మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. కొవిడ్ టీకా తీసుకున్న యువతకు ఫ్రీగా బీరు బాటిల్ సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందింది అమెరికాలో కనుక. విషయంలోకి వెళితే.. 


అగ్రరాజ్య అధినేత జో బైడెన్ తాజాగా మరో కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. జూలై 4 నాటికి 70 శాతం మంది యువతకు (18ఏళ్లు పైబడినవారు) వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని బైడెన్ నిర్ణయించుకున్నారు. 18 కోట్ల మందికి కనీసం ఒక డోసు, 16 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. అయితే వ్యాక్సిన్ తీసుకునేందుకు యువత అంతగా ఆసక్తి చూపడం లేదన్న విషయాన్ని గుర్తించిన బైడెన్.. యువతను ఆకట్టుకునేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించాలని దిశానిర్దేశం చేశారు. 



ఈ నేపథ్యంలో ఫెడరల్, రాష్ట్ర మరియు స్థానిక అధికారులు ఫార్మసీలు, రెస్టారెంట్లు, బీర్ల ఉత్పత్తిదారులు, సూపర్ మార్కెట్లు, క్రీడా బృందాలతో కలిసి యువత వద్దకు వెళ్తున్నారు. టీకా తీసుకున్న యువతకు బీర్ బాటిల్‌ను డోనట్స్‌ను ఆఫర్ చేస్తూ టీకా తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే న్యూజెర్సీ గవర్నర్ ‘షాట్ అండ్ ఏ బీర్’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. అంతేకాకుండా ‘మే నెలలో టీకా మొదటి డోసు తీసుకున్న యువత తమ వ్యాక్సినేషన్ కార్డు ద్వారా ఫ్రీగా బీర్‌ను పొందొచ్చు’ అని పేర్కొన్నారు. 21ఏళ్లు పైడిన యువత మద్యం సేవించడాన్ని న్యూజెర్సీ రాష్ట్రం చట్టబద్ధం చేసింది. దీంతో ఈ 21ఏళ్లుపైడిన యువత మాత్రమే ‘షాట్ అండ్ ఏ బీర్’ ప్రోగ్రామ్‌కు అర్హులు.  


ఇకపోతే వెస్ట్ వర్జీనియా రాష్ట్రం సేవింగ్స్ బాండ్స్ ద్వారా యువతను టీకా తీసుకోవడానికి ప్రోత్సహిస్తోంది. 16-35ఏళ్ల వయసు కలిగి వారు టీకా తీసుకుంటే.. వారికి 100 డాలర్ల సేవింగ్ బాండ్‌ను అందజేయనున్నట్టు వెస్ట్ వర్జీనియా రాష్ట్ర గవర్నర్ ప్రకటించారు. మేరీలాండ్ గవర్నర్ కూడా దాదాపు ఇటువంటి ఆఫర్నే ఆ రాష్ట్ర యువతకు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. క్రిస్పీ క్రీమీ అనే రెస్టారెంట్ కూడా వ్యాక్సిన్ తీసుకునే విధంగా యువతను పోత్రహిస్తోంది. వ్యాక్సినేషన్ కార్డుతో తమ స్టోర్‌కు వచ్చిన యువతకు ఫ్రీగా డోనట్‌ను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. 


Updated Date - 2021-05-07T08:31:47+05:30 IST