కొంపముంచుతున్న కరోనా.. చిన్నపాటి జ్వరం వచ్చినా పరిస్థితి ఎలా తయారైందంటే..

ABN , First Publish Date - 2020-07-18T17:23:05+05:30 IST

కరోనా పేదల కొంపముంచుతోంది. చిన్నపాటి జ్వరం వచ్చినా ఆసుపత్రుల్లోకి అనుమతించకపోవడం, ఒకవేళ వెళ్లినా కరోనా టెస్ట్‌ చేయించుకోవాలంటూ బలవంతం

కొంపముంచుతున్న కరోనా.. చిన్నపాటి జ్వరం వచ్చినా పరిస్థితి ఎలా తయారైందంటే..

వేల్పూరు (కంకిపాడు): కరోనా పేదల కొంపముంచుతోంది. చిన్నపాటి జ్వరం వచ్చినా ఆసుపత్రుల్లోకి అనుమతించకపోవడం, ఒకవేళ వెళ్లినా కరోనా టెస్ట్‌ చేయించుకోవాలంటూ బలవంతం చేయడంతో పేదలు భయపడిపోతున్నారు. మండలంలోని వేల్పూరు గ్రామంలో కొవిడ్‌ అనుమానంతో సీనియర్‌ టీడీపీ నాయకుడు, వేల్పూరు మాజీ సర్పంచ్‌ చీలి సురేంద్ర శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. వివరాల ప్రకారం.. రెండు మూడు నెలల క్రితం వేల్పూరు గ్రామంలోని తన స్థలాన్ని సురేంద్ర విక్రయించారు. కొనుగోలు చేసిన సదరు వ్యక్తులు సుమారు రూ.10 లక్షలు బకాయి ఉండగా, సురేంద్ర పది రోజులుగా డబ్బు కోసం తిరుగుతున్నారు. సదరు వ్యక్తులు డబ్బులు ఇచ్చేలా కనిపించకపోవడంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. రెండు, మూడు రోజుల నుంచి చిన్నపాటి జ్వరంతో బాధపడుతున్నారు. ఏ ఆసుపత్రికి వెళ్లినా కొవిడ్‌ టెస్టు చేయించుకోవాలని చెప్పడంతో పరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడి సిబ్బంది కూడా పట్టించుకోకపోవడంతో ఆయన మరింత ఆవేదన చెందారు. దీంతో శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌.. సురేంద్ర కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అనంతరం మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. 


కరోనా రిపోర్టు రాకుండానే..

కంకిపాడులో ఓ చికెన్‌ షాపు వ్యాపారికి తీవ్ర అస్వస్థతగా ఉండటంతో రెండు రోజుల కిందట కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నాడు. గురువారం రాత్రి నుంచి 108, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లకు సదరు వ్యాపారి గురించి చెబుతున్నా పట్టించుకోలేదు. ఆశ వర్కర్లు వచ్చి పరిస్థితి పరిశీలించినా.. కొవిడ్‌ రిపోర్ట్‌ వస్తే గానీ ఆసుపత్రిలో చేర్పించుకోవడం సాధ్యం కాదన్నారు. వ్యాపారి పరిస్థితి మరింత క్షీణిస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కాగా, శుక్రవారం రాత్రి ఆయన మరణించారు. 

Updated Date - 2020-07-18T17:23:05+05:30 IST