పీఎఫ్ ఖాతా నుంచి లక్ష వరకు విత్‌డ్రా చేస్తే... రూ. 11 లక్షలు కోల్పోతారు....

ABN , First Publish Date - 2021-04-06T01:36:27+05:30 IST

అత్యవసరాలకు తప్పి ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేయొద్దని నిపుణులు చెబుతున్నారు.

పీఎఫ్ ఖాతా నుంచి లక్ష వరకు విత్‌డ్రా చేస్తే... రూ. 11 లక్షలు కోల్పోతారు....

న్యూఢిల్లీ : అత్యవసరాలకు తప్పి ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. పదవీవిరమణకు కొన్ని సంవత్సరాల ముందు ఈ డబ్బును ఉపసంహరించుకుంటే... ఖచ్చితంగా నష్టాన్ని చవి చూడాల్సిందే. పీఎఫ్ ఖాతా నుంచి రూ.  లక్ష ఉపసంహరించుకున్నట్లయితే, రూ. 11 లక్షలు కోల్పోతారు. 


ఇదెలా జరుగుతుందంటే... పీఎఫ్ ఖాతా నుంచి చేసే ఉపసంహరణల ప్రభావం రిటైర్మెంట్ ఫండ్‌పై  ప్రతిఫలిస్తుంది. రిటైర్డ్ ఈపీఎఫ్‌ఓ అసిస్టెంట్ కమిషనర్ ఎ.కె. శుక్లా మాట్లాడుతూ... ‘మీ రిటైర్మెంట్ కాలం ఇంకా 30 సంవత్సరాలు మిగిలి ఉంటే, మీరు పిఎఫ్ ఖాతా(ఈపీఎఫ్ ఉపసంహరణ) నుండి రూ. లక్ష  ఉపసంహరించుకుంటే, అప్పుడు మీ రిటైర్మెంట్ ఫండ్ నుంచి రూ. 11.55 లక్షలు కోల్పోయినట్లే. వాస్తవానికి, మీరు రూ. లక్ష జమ చేసి ఉంటే, మీకు దానిపై వడ్డీ వచ్చేది.. చివరికి మొత్తం రూ .11.55 లక్షలవుతుంది. డబ్బు అవసరం లేకపోతే, మీరు ఈపీఎఫ్ నుండి డబ్బును ఉపసంహరించవద్దు’ అని స్పష్టం చేశారు. ఈపీఎఫ్ ఖాతా 58 సంవత్సరాల వరకు యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ ఖాతాపై 8.5 శాతం వడ్డీ లభిస్తోంది. అన్ని రకాల చిన్న పొదుపు పథకాలలో ఇదే అత్యధికం. అందుకే ఈపీఎఫ్ ఖాతాలో ఎంత ఎక్కువ మొత్తం ఉంటే... అంత రాబడి వస్తుంది.


ఒకవేళ పదవీవిరమణకు ఇంకా 20 సంవత్సరాలు ఉండి, రూ. 50 వేలు ఉపసంహరించుకుంటే, రూ. 2.05 లక్షలను కోల్పోతారు. అలాగే... రూ. లక్ష రూ. 5.11 లక్షలు, రూ. 2 లక్షలకు రూ. 10.22, రూ. 3 లక్షలకు రూ. 15.33 లక్షలను కోల్పోతారు.


అదే పదవీవిరమణ సమయం ఇంకా 30 సంవత్సరాలుంటే... పీఎఫ్ ఖాతా నుంచి రూ. 50 వేలు ఉపసంహరించుకుంటే, అప్పుడు రూ. 5.27 లక్షలను నష్టపోతారు. అదే సమయంలో రూ. లక్షకు రూ. 11.55 లక్షలు, రూ. 2 లక్షలకు రూ. 23.11 లక్షల నష్టం వాటిల్లుతుంది. అందుకే పీఎఫ్ విత్‌డ్రాయల్స్ సందర్భాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. 

Updated Date - 2021-04-06T01:36:27+05:30 IST