ఎన్నికలు నిలిపివేస్తే..ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుంది

ABN , First Publish Date - 2021-01-13T07:49:31+05:30 IST

ఎన్నికలు నిలిపివేస్తే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆందోళన వ్యక్తంచేసింది.

ఎన్నికలు నిలిపివేస్తే..ప్రజాస్వామ్యంపై  నమ్మకం పోతుంది

  • సింగిల్‌ జడ్జి ఉత్తర్వులతో గందరగోళం
  • సందేహాలతో 4 వేల మెయిల్స్‌ వచ్చాయి
  • ఓటర్ల జాబితా ప్రక్రియ నిలిచిపోయింది
  • నోటిఫికేషన్‌ జారీచేశాక కోడ్‌ ఆపలేరు
  • హైకోర్టుకు విన్నవించిన ఎస్‌ఈసీ
  • కొత్త పథకాలకు అనుమతి తీసుకుంటాం
  • ఓటర్ల జాబితా తయారీకి ఆటంకం కలగదు
  • ఎన్నికల నిర్వహణకు సహకరిస్తాం: ఏజీ
  • వాదనను నమోదుచేసిన హైకోర్టు
  • ఎస్‌ఈసీ అప్పీల్‌పై విచారణ 18కి వాయిదా
  • పంచాయతీ పోరుపై హైకోర్టులో వాదనలు


అమరావతి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు నిలిపివేస్తే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆందోళన వ్యక్తంచేసింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్‌ చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు చట్ట సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఈ నెల 8వ తేదీన ఎస్‌ఈసీ ఇచ్చిన షెడ్యూల్‌ను సస్పెండ్‌ చేస్తూ సోమవారం సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఎన్నికల సంఘం డివిజన్‌ బెంచ్‌ ముందు అప్పీల్‌ దాఖలు చేసింది. అత్యవసర విచారణ చేపట్టాలని కోరింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఆరంభంలోనే.. ఈ వ్యాజ్యంపై సంక్రాంతి సెలవుల తర్వాత ఈ నెల 18న విచారణ చేపడతామని పేర్కొంది.


పిటిషన్‌ను అత్యవసరంగా ఎందుకు విచారించాలో కారణాలను వివరించాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌కు సూచించింది. ఆయన తన వాదనలు వినిపించారు. ‘సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు ఈ నెల 18 వరకు అమల్లో ఉంటే ఎన్నికల్లో పోటీచేసే ఆశావహులు, ఓటర్లలో గందరగోళం తలెత్తుతుంది. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల విషయంలో కొంత పురోగతి ఉంది. నోటిఫికేషన్‌ అమలు నిలుపుదల చేయడం వల్ల ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ నిలిచిపోతుంది. సింగిల్‌ జడ్జి నోటిఫికేషన్‌ను సస్పెండ్‌ చేసిన తర్వాత.. సందేహాలు వ్యక్తం చేస్తూ 4 వేల మెయిల్స్‌ వచ్చాయి. ఈ నెల 23న మొదటి విడత ఎన్నికల షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. విచారణను 18వ తేదీకి వాయిదా వేయడం వల్ల షెడ్యూల్‌ తేదీ మరింత దగ్గరవుతుంది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు చట్టం నిరే ్దశించిన సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఎన్నికల నిర్వహణను ధర్మాసనమే ప్రారంభించింది. రాజ్యాంగంలోని 243 అధికరణ మేరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎస్‌ఈసీపై ఉంది. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశాక నియమావళిని రద్దు చేయజాలరు’ అని పేర్కొన్నారు.


మరింత గడువు కోరం: ఏజీ

ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌ శ్రీరాం కలుగజేసుకుంటూ.. ఓటర్ల జాబితా తయారీ గత ఏడాది మార్చిలో ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌లో భాగమని తెలిపారు. అప్పటి ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా ప్రచురితమైందన్నారు. ‘కేంద్ర ఎన్నికల సంఘం 2021 జనవరి 1 నాటికి ఉన్న ఓటర్ల జాబితాను జనవరి 15 నాటికి రాష్ట్రప్రభుత్వానికి అందజేస్తుంది. ఈ నెల 22న ఆ జాబితాను ఎస్‌ఈసీకి అందజేయాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉంది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులతో ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగదు. ఈ నెల 18కి వాయిదా వేయడం వల్ల ప్రక్రియకు ఆటంకం ఏర్పడదు. ఒకవేళ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం రద్దుచేస్తే.. ఓటర్ల జాబితా సిద్ధం కాలేదనే కారణంతో  ప్రభుత్వం మరింత సమయం కోరదు. కొత్త పథకం ప్రవేశపెట్టాలంటే ఎస్‌ఈసీ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నాకే చర్యలు తీసుకుంటుంది. సుప్రీంకోర్టు ఈ విషయానికి సంబంధించి గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్నందున ప్రవర్తనా నియమావళిపై ఎలాంటి ప్రభావం పడదు.


ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ మేరకు ఎన్నికల  నిర్వహణకు ప్రభుత్వం సహకరిస్తుంది’ అని హామీ ఇచ్చారు. ఎస్‌ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలు, అడ్వకేట్‌ జనరల్‌ ఇచ్చిన హామీలను పరిగణనలోకి తీసుకుని.. వారి వాదనలను నమోదు చేసిన ధర్మాసనం.. ఓటర్లను ప్రభావితం చేసేలా కొత్త పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే 18న జరిగే విచారణలో కోర్టు దృష్టికి తీసుకురావచ్చని ఎస్‌ఈసీకి సూచించింది. విచారణను వాయిదా వేయడం వల్ల ఎస్‌ఈసీకి న్యాయపరంగా ఎలాంటి అవరోధం కలుగదని అభిప్రాయపడింది. ఈ వ్యాజాన్ని రెగ్యులర్‌ బెంచ్‌ విచారణ జరిపేందుకు 18వ తేదీకి వాయిదా వేసింది.


23న మొదటి విడత ఎన్నికల షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. విచారణను 18వ తేదీకి వాయిదా వేస్తే షెడ్యూల్‌ తేదీ మరింత దగ్గరవుతుంది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు చట్టం నిరే ్దశించిన సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి. 

- ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది


సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం రద్దు చేస్తే.. ఓటర్ల జాబితా సిద్ధం కాలేదనే కారణంతో ప్రభుత్వం మరింత సమయం కోరదు. షెడ్యూల్‌ మేరకు ఎన్నికల  నిర్వహణకు సహకరిస్తుంది. 

                                                                                                                           - ఏజీ శ్రీరాం


విచారణను వాయిదా వేయడం వల్ల ఎస్‌ఈసీకి న్యాయపరంగా ఎలాంటి అవరోధం కలగదు. ఓటర్లను ప్రభావితం చేసేలా కొత్త పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే 18వ తేదీన కోర్టు దృష్టికి తీసుకురావచ్చు.

                                                                                                                         -ధర్మాసనం

Updated Date - 2021-01-13T07:49:31+05:30 IST