ఈకేవైసీ చేస్తేనే.. రేషన్‌!

ABN , First Publish Date - 2021-08-13T05:30:00+05:30 IST

రేషన్‌ కార్డుదారులకు కొత్త చిక్కొచ్చి పడింది. రేషన్‌కార్డులో ఉన్న ప్రతి సభ్యుడు తమ ఆధార్‌తో పాటు ఈ-కేవైసీ (ఎలక్ర్టానిక్‌ నో యువర్‌ కస్టమర్‌) తప్పనిసరిగా నమోదు చేయించుకోవాల్సిందేనని .ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నెలాఖరు వరకు గడువు విధించింది. గడువులోగా ఈకేవైసీ నమోదు చేసుకోకపోతే.. సెప్టెంబరు నుంచి రేషన్‌ సరుకులు నిలిపివేస్తామని స్పష్టం చేసింది. దీంతో రేషన్‌ కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈకేవైసీ నమోదు కోసం ఆధార్‌ కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు.

ఈకేవైసీ చేస్తేనే.. రేషన్‌!
సోంపేటలో ఆధార్‌ కేంద్రం వద్ద ఈకేవైసీ కోసం బారులుదీరిన ప్రజలు

నెలాఖరు వరకు గడువు

ఆధార్‌ కేంద్రాలకు కార్డుదారుల పరుగులు

(ఇచ్ఛాపురం రూరల్‌/సోంపేట)

రేషన్‌ కార్డుదారులకు కొత్త చిక్కొచ్చి పడింది. రేషన్‌కార్డులో ఉన్న ప్రతి సభ్యుడు తమ ఆధార్‌తో పాటు ఈ-కేవైసీ (ఎలక్ర్టానిక్‌ నో యువర్‌ కస్టమర్‌) తప్పనిసరిగా నమోదు చేయించుకోవాల్సిందేనని .ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నెలాఖరు వరకు గడువు విధించింది. గడువులోగా ఈకేవైసీ నమోదు చేసుకోకపోతే.. సెప్టెంబరు నుంచి రేషన్‌ సరుకులు నిలిపివేస్తామని స్పష్టం చేసింది. దీంతో రేషన్‌ కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈకేవైసీ నమోదు కోసం ఆధార్‌ కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 8,19,290 రేషన్‌ కార్డులు ఉన్నాయి. అందులో 24,18,028 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 20,13,659 మంది ఈకేవైసీ చేయించుకున్నారు. ఇంకా 4,04,369 మంది ఈకేవైసీ చేసుకోలేదు. ఒక కార్డులో నలుగురు సభ్యులు ఉంటే ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో చాలామంది వివరాలు నమోదు కాలేదు. కొన్నికార్డుల్లో సభ్యులందరూ ఈకేవైసీ చేసుకోలేదు. వారంతా ఈ నెలాఖరులోగా నమోదు చేసుకోకపోతే.. సెప్టెంబరు నుంచి రేషన్‌  సరుకులు అందవు. 


నమోదు కోసం పాట్లు

గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా, చౌక దుకాణ డీలర్ల వద్ద ఉన్న ఈ-పాస్‌ యంత్రాలలోనూ ఈకేవైసీ నమోదు చేసుకోవచ్చు. వేలిముద్రలు నమోదు కాకపోతే ఈ-పాస్‌ యంత్రంలో ఫింగర్‌ ఆప్షన్‌ వినియోగించాలి. అందులోనూ కాకపోతే సమీపంలోని ఆధార్‌ కేంద్రంలో వేలిముద్రల నమోదు ప్రక్రియను మళ్లీ చేయించుకోవాలి. చిన్నపిల్లలకు సంబంధించి గతంలో వారి తల్లిదండ్రుల వేలిముద్రలు తీసుకొని ఆధార్‌కార్డులు జారీ చేశారు. ప్రస్తుతం వారు పెద్దయ్యారు. కనుక వారి వేలిముద్రలను నవీకరణ చేసి, ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. వీరికి సెప్టెంబరు నెలాఖరు వరకు అవకాశం కల్పించారు. ఆధార్‌ సంఖ్య తప్పుగా నమోదైన వారు సరి చేసుకునేందుకు ఈ నెల 15 నుంచి అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో కార్డుదారులు ఈకేవైసీ నమోదుకు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో అరకొరగా ఆధార్‌ కేంద్రాలు ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కొన్ని స్టేట్‌బ్యాంక్‌లలో మాత్రమే ‘ఆధార్‌’ సేవలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది ఉదయం లేవగానే.. ఆధార్‌ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఉదాహరణకు సోంపేటలో శుక్రవారం ఉదయం ఆరు గంటలకే ఆధార్‌ కేంద్రం వద్దకు కొంతమంది చేరుకున్నారు. నిర్వాహకులు ఉదయం 10 గంటలకు కేంద్రం తెరవడంతో అప్పటివరకూ నిరీక్షించారు. గంటల తరబడి నిరీక్షించినా.. కొందరికే ఈకేవైసీ నమోదవుతుండడంతో మిగిలిన వారంతా నిరాశతో వెనుదిరుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. 


తప్పనిసరి

బియ్యం కార్డుల్లో ఆధార్‌ ఈకేవైసీ నమోదు చేసుకోనివ ారిని గుర్తించాం. వారందరూ తప్పనిసరిగా నెలాఖరులోగా ఈకేవైసీ చేయించుకోవాలి. వలంటీర్లు, చౌకదుకాణల డీలర్ల వద్ద ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశం కల్పించాం. ఈకేవైసీ చేయించుకోకపోతే బోగస్‌ సభ్యులుగా గుర్తించి వీరి పేర్లు బియ్యం కార్డుల నుంచి తొలగిస్తారు.  

- డి.వెంకటరమణ, డీఎస్‌వో, శ్రీకాకుళం.

Updated Date - 2021-08-13T05:30:00+05:30 IST