Abn logo
Jul 22 2021 @ 01:45AM

రేపైతే ఇది దొరకదు ఈరోజే చంపి జైలుకెళ్తా

  • నల్గొండ జిల్లా కొప్పోలులో బాలిక హత్య వెనుక.. కొత్త కోణం 
  • స్నేహితుల ఫోన్‌ సంభాషణ వైరల్‌
  • ఎస్సైను వీఆర్‌కు అటాచ్‌ చేసిన ఉన్నతాధికారులు


నల్లగొండ క్రైం, జూలై 21: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొప్పోలులో ఈ నెల 13న చోటుచేసుకున్న బాలిక హత్య కేసు మరో మలుపు తీసుకుంది. నిందితుల సంభాషణలు తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అనుమానాస్పద మృతిగా ఉన్న కేసులో అత్యాచార, హత్య సెక్షన్లు చేర్చారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో స్థానిక ఎస్సై రామకృష్ణ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ప్రజాసంఘాలు ఆందోళన చేయడంతో ఆయన్ను వీఆర్‌కు అటాచ్‌ చేశారు. ఎస్పీ సతీ్‌షను విచారణాధికారిగా నియమించారు.


ఈ నెల 17న కొప్పోలుకు వెళ్లిన అధికారులు, బాలిక మృతదేహానికి మరోమారు శవపరీక్ష నిర్వహించారు. బాలికపై అత్యాచారం జరిపి, హత్య చేశారని ఫోరెన్సిక్‌ నివేదికలో తేలినట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు పవన్‌ను, అతడి స్నేహితులు రాజు, శ్రీకాంత్‌, సుజన్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 


కొప్పోలుకు చెందిన బాలిక, నల్లగొండలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన పవన్‌ ఇంటర్‌ పూర్తిచేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. నాలుగేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని బాలిక ఒత్తిడి తెస్తుండటంతో ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. ఈ నెల 13న రాత్రి ఆమెకు ఫోన్‌ చేసి ఇంటి నుంచి బయటకు పిలిచాడు. అనంతరం.. ఇంటికి కొద్దిదూరంలో ఉన్న ఎస్సీ కాలనీకి తీసుకువెళ్లి ఆమెపై దౌర్జన్యం చేశాడు. అదే సమయంలో అతని మిత్రుడైన రాజుకు ఫోన్‌చేసి బాలికతో ఫోన్‌ మాట్లాడించాడు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను పవన్‌ ఫోన్‌లో పోలీసులు గుర్తించారు. 


ఫోన్‌ సంభాషణ సాగిందిలా.. 


పవన్‌ తన స్నేహితుడైన రాజుకు ఫోన్‌ చేశాడు.

రాజుతో బాలిక: అన్నా.. ఏమైనా చెప్పన్నా

పవన్‌: అన్నయ్య అని మాట్లాడుడేందే? ఏమనుకుంటున్నవే నా గురించి?

బాలిక: (ఏడుస్తూ పవన్‌ను ఉద్దేశించి) నేనెప్పుడన్నా ఏమైనా అన్ననా నిన్ను

పవన్‌: (బాలికను కొడుతూ): ఏడవకు, మాట్లాడు.. నువ్వు చచ్చే పది నిమిషాలైనా ఫోన్‌ మాట్లాడు

ఏడుస్తున్న బాలికతో.. ఫోన్‌ పవన్‌కు ఇవ్వు అంటూ రాజు సూచించాడు.

పవన్‌: ఏడవకుండా మాట్లాడు..ఏడిస్తే పొడుస్తా


పవన్‌ రాజుతో మాట్లాడుతూ..

పవన్‌: ఈ.... మొత్తం ఇజ్జత్‌ తీస్తుంది. నేను పొద్దుగాల మాట్లాడతా. పొద్దుగాల పోతే జైలుకు పోతా

రాజు: జైలుకు పోయేదేందిరా

పవన్‌: హే లేదన్నా.. దీన్ని చంపే పోత ఇప్పుడు..

రాజు: నేను వచ్చి మాట్లాడతా ఆగు

దీంతో.. ఎస్సీ కాలనీకి వచ్చి ఫోన్‌ చేయమని పవన్‌ చెప్పడంతో తన దగ్గర బండి లేదని రాజు చెప్పాడు. అదే సమయంలో బిగ్గరగా ఏడుస్తున్న బాలికను ‘ఏడవకు పొడుస్త.. ఇప్పుడు చెట్లలోకి తీసుకపోత.. ఈడ తంతే పొద్దుగాల చూస్తురు కానీ ఆడ తంతే ఎవ్వరు చూడరు’ అంటూ బాలికను పవన్‌ బెదిరించాడు. 

రాజు: నా మాట మీద గౌరవం ఉంచి ఈ ఒక్క రాత్రి వదిలిపెట్టు. నేను మాట్లాడిన తర్వాత రేపు సంపు.

పవన్‌: రేపైతే ఇది దొరకదు

రాజు: అరే పవన్‌.. నేను చెప్తే కూడా వినకపోతే నీ లైఫ్‌ నువ్వు.. నా లైఫ్‌ నేను... సంపితే సంపు.