తెలుసుకుంటే... కాస్త లాభమే..!

ABN , First Publish Date - 2022-01-19T21:31:13+05:30 IST

అంతర్జాతీయ స్థాయిలో మన మార్కెట్‌ విలువ ఎలా ఉంది ? ఈ క్రమాన్ని తెలుసుకున్నపక్షంలో... మన పెట్టుబడుల ఔట్‌లుక్‌ మారుతుందని నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు.

తెలుసుకుంటే... కాస్త లాభమే..!

హైదరాబాద్/ముంబై : అంతర్జాతీయ స్థాయిలో మన మార్కెట్‌ విలువ ఎలా ఉంది ? ఈ క్రమాన్ని తెలుసుకున్నపక్షంలో... మన పెట్టుబడుల ఔట్‌లుక్‌ మారుతుందని నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా దేశాల లీగ్‌ టేబుల్‌లో భారత్... ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఐదోస్థానంలో ఉన్న బ్రిటన్‌ను అధిగమించి, ఆ స్థానంలోకి వెళ్లేందుకు కొద్దిదూరంలో మాత్రమే ఉంది. ఇక... అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్... మొదటి నాలుగు స్థానాల్లో  ఉన్నాయి. భారత్‌లో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ ప్రస్తుతం 3.67 ట్రిలియన్ డాలర్లు. కాగా... 3.75 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో ఉన్న బ్రిటన్‌కంటే కేవలం రెండు శాతం మాత్రమే తక్కువ. నెల క్రితం సుమారు ఎనిమిది శాతంగా ఉన్న ఈ గ్యాప్‌ తగ్గుతూ వచ్చి, తాజాగా రెండు శాతానికి వచ్చింది. త్వరలోనే ఇది కూడా కవర్‌ కావచ్చన్న అంచనాలున్నాయి. 


నవంబరులో కూడా, రెండు దేశాల మార్కెట్ క్యాపిటలైజేషన్ గ్యాప్ రెండు  శాతం కంటే తగ్గి, బ్రిటన్‌ను అధిగమించే దిశగా భారత్‌ అడుగులేసినప్పటికీ... అదే సమయంలో వచ్చిన ‘షార్ప్‌ కరెక్షన్‌’తో అంతరం పెరిగింది. డిసెంబరు 20 న సెన్సెక్స్ నాలుగు నెలల కనిష్ట స్థాయి(55,822)కి పడిపోవడంతో, ఫ్రాన్స్ కంటే తగ్గిన  ఇండియా ర్యాంక్‌... ఏడో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత డాలర్ పరంగా బలపడి, ఎనిమిది శాతం కంటే ఎక్కువ లాభాలతో మళ్లీ ఆరో స్థానానికి చేరింది. 3. అంతేకాకుండా... 37 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ఉన్న ఫ్రాన్స్‌ను అధిగమించేందుకు ఈ బౌన్స్‌‌బ్యాక్‌ దోహదం చేసింది. 


ఫెడరల్ రిజర్వ్ హాకిష్ స్టాన్స్‌, ఒమిక్రాన్‌ వేరియంట్ వ్యాప్తి, టెక్నాలజీ స్టాక్స్‌లో అమ్మకాల కారణంగా కిందటి నెలలో అమెరికా, చైనా, జపాన్‌ దేశాలు మార్కెట్ క్యాప్‌‌ను కోల్పోవాల్సి వచ్చింది. చమురు ధరల పెరుగుదల, బాండ్ ఈల్డ్స్‌ పెరగడం తదితర ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ... వాల్యుయేషన్‌ ఖరీదుగా మారిందని వాదనలున్నప్పటికీ... భారత మార్కెట్‌ నిరుడు(2021 లో) 24 శాతం లాభపడడం గమనార్హం. 


ఇక... భారత మార్కెట్‌లో బలమైన లిక్విడిటీ ఉన్న విషయం తెలిసిందే. ఎస్‌ఐపీ ఇన్‌ఫ్లోల్లో పురోగమిస్తోన్న మ్యూచువల్ ఫండ్స్‌ భారీగా వృద్ధి చెందాయి. రిటైల్ భాగస్వామ్యం బలంగా ఉంది. ఓవర్సీస్ విక్రయాలు నెమ్మదించడం మరింత మద్దతునిచ్చినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం ఈ క్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలిలా ఉన్నాయి. దేశీయ మార్కెట్ విలువ పెరగడానికి రూపాయి బలపడడం కూడా కారణమైంది. ప్రస్తుత స్థాయి నుంచి ఇంకా పెరగాలంటే కార్పోరేట్ ఆదాయాల వృద్ధి బలంగా ఉండాలి. ఇక... అంచనా ఆదాయాలకు సంబంధించి... నిఫ్టీ50 కంపెనీల ఏకాభిప్రాయం ప్రకారం... వీటి మొత్తం ఆదాయాలు... 2022 ఆర్ధిక సంవత్సరంలో ఒకింత తగ్గనున్నాయి. అయితే... 2023, 2024 ఆర్ధిక సంవత్సరాల్లో మాత్రం స్వల్పంగా పెరుగుతాయి. 

Updated Date - 2022-01-19T21:31:13+05:30 IST