‘లేటరైట్‌’ తవ్వుకుపోతుంటే.. ప్రశ్నించావా?

ABN , First Publish Date - 2022-01-24T06:30:06+05:30 IST

‘ముఖ్యమంత్రి బాబాయి వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి నాతవరం మండలంలో లేటరైట్‌ తవ్వకాలు జరుపుతుంటే.. స్థానిక ఎమ్మెల్యేగా ఒక్క రోజైనా ఆ చర్యలను ఖండించావా..’ అని మాజీ మంత్రి సిహెచ్‌.అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ను ఉద్దేశించి ప్రశ్నిం చారు.

‘లేటరైట్‌’ తవ్వుకుపోతుంటే.. ప్రశ్నించావా?
మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు

 టీడీపీ హయాంలో తప్ప.. మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపండి

 స్థాయి మరచి విమర్శలు సరి కాదు

వీడియో సందేశం ద్వారా ఎమ్మెల్యే గణేశ్‌ను ప్రశ్నించిన మాజీ మంత్రి అయ్యన్న 

నర్సీపట్నం, జనవరి 23 : ‘ముఖ్యమంత్రి బాబాయి వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి నాతవరం మండలంలో లేటరైట్‌ తవ్వకాలు జరుపుతుంటే.. స్థానిక ఎమ్మెల్యేగా ఒక్క రోజైనా ఆ చర్యలను ఖండించావా..’ అని మాజీ మంత్రి సిహెచ్‌.అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ను ఉద్దేశించి ప్రశ్నిం చారు.  భారీ టిప్పర్లు, వ్యాగన్ల ద్వారా లేటరైట్‌ను భారతి సిమెంటు ఫ్యాక్టరీకి తరలిస్తున్నారని ఆరోపించారు. స్థానిక విలేఖర్లకు ఆదివారం ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. స్థాయి మరచిపోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ విమర్శలు చేయడం మంచిది కాదని ఎమ్మెల్యేకు హితవు పలి కారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో చేసిన  అభివృద్ధి  ఏమైనా ఉంటే చూపించాలన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన పెదబొడ్డేపల్లి వంతెన, జల్లూరి వంతెనలు పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. గంజాయి కేసుల్లో టీడీపీ వర్గీయులు లేరని, ఉన్నా తాము సమర్ధించబోమని స్పష్టం చేశారు. ఇటీవల పెదబొడ్డేపల్లిలో ఎమ్మెల్యే అనుచరుడు గంజాయి కేసులో పట్టుబడ్డాడని ఆరోపించారు. గతంలో చోడవరం ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు గంజాయి కేసులో దొరికిన విషయం అందరికీ తెలిసిందేనని అయ్యన్న పేర్కొన్నారు. తాను లేటరైట్‌ తవ్వకాలకు పాల్పడ్డానని పదే పదే విమర్శలు చేయడం కాదని, మీ ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉంటే కేసులు పెట్టి అరెస్టు చేయించుకోవచ్చని ఎమ్మెల్యేను ఉద్దేశించి అయ్యన్న వ్యాఖ్యానించారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వంపై బురద జల్లుతూ.. అయ్యన్న ఆనందం :  ఎమ్మెల్యే గణేశ్‌

నర్సీపట్నం : రోజుకో వీడియో విడుదల చేస్తూ.. ప్రభుత్వంపై బురద జల్లి అయ్యన్న ఆనందపడుతుంటారని ఎమ్మెల్యే గణేశ్‌ అన్నారు. ఆదివారం స్థానిక విలేఖర్లకు ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు.  అమరావతిని సింగపూర్‌, జపాన్‌ చేస్తామని గ్రాఫిక్స్‌తో మోసం చేశారని విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుల ద్వారా అడ్డుపడింది చంద్రబాబు, అయ్యన్నేనని ఎద్దేవా చేశారు. పాడేరులో మెడికల్‌ కళాశాల నిర్మాణం మొదలైందని, కావాలంటే వెళ్లి చూసి తెలుసుకోవాలన్నారు. ఆర్‌అండ్‌బీ బిల్లుల బకాయిలు చెల్లించలేదని పదేపదే ఆరోపణలు చేస్తున్నారని, 14 వర్కులకు సంబంధించి రూ.3.82 కోట్లు  చెల్లించడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు. 

Updated Date - 2022-01-24T06:30:06+05:30 IST