Abn logo
Jun 29 2021 @ 00:00AM

రక్తంలో గడ్డలు ఏర్పడితే..

కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో తిరిగి సరిదిద్దలేని ఊపిరితిత్తుల డ్యామేజ్‌తో పాటు గుండెపోటుకు గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్టు తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే అవయవాలు కోల్పోవడం, ఊపిరితిత్తులు, గుండె, పేగులు, కాళ్లలో రక్తం గడ్డలు ఏర్పడడం మూలంగా ఆయా అవయవాలకు సంబంధించి తీవ్ర ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత రక్తం గడ్డలు ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించాలి.


రక్తం గడ్డలు ఎందుకు?

రక్తం గడ్డలకు కారణాలు వేర్వేరుగా ఉంటాయి. కొవిడ్‌ వల్ల శరీరంలో విస్తారంగా, తీవ్రంగా ఇన్‌ఫ్లమేషన్‌ మొదలవుతుంది. ఫలితంగా వ్యాధినిరోధకశక్తి స్పందిస్తుంది. ఈ క్రమంలో కొవిడ్‌ దాడికి గురైన శరీరంలోని వేర్వేరు అవయవాల్లో రక్తం గడ్డలు ఏర్పడతాయి. అలాగే కొవిడ్‌ సోకిన వ్యక్తులు ఐసొలేషన్‌లో భాగంగా ఎక్కువ సమయాల పాటు కదలికలు లేకుండా గడపడం కూడా రక్తం గడ్డలు ఏర్పడే అవకాశాలను పెంచుతుంది.


అలాగే ప్రొటీన్‌ ఫ్యాక్టర్‌ వి కొందరు కొవిడ్‌ బాధితుల్లో పెరగడం వల్ల కూడా రక్తం గడ్డలు ఏర్పడతాయి.ఈ రక్తం గడ్డల వల్ల డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌, పల్మనరీ ఎంబాలిజం సమస్యలు తలెత్తుతాయి. మరొక అధ్యయనంలో వైర్‌సతో పోరాడే క్రమంలో విడుదలయ్యే యాంటీబాడీలు కూడా రక్తం గడ్డలు ఏర్పడేలా చేస్తాయని తేలింది. అయితే కారణం ఏదైనప్పటికీ కొవిడ్‌ సోకిన, కోలుకున్న వ్యక్తుల్లో రక్తం గడ్డలు ఏర్పడే అవకాశాలు ఎంతోకొంత ఉంటూనే ఉంటాయి.


ఆరోగ్య సమస్యలు

రక్తం గడ్డలు వెయిన్స్‌, ఆర్టెరీల్లో రెండు చోట్ల ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ రక్తనాళాల మీద దాడి చేసినప్పుడు ప్రధానంగా ఊపిరితిత్తుల్లో థ్రాంబోసిస్‌ లేదా సూక్ష్మ రక్తపు గడ్డలు ఏర్పడతాయి. వీటిని సకాలంలో గుర్తించడం ఎంతో అవసరం. రక్తనాళంలో ఏర్పడిన రక్తపు గడ్డ రక్తప్రవాహంతో పాటు ఊపిరితిత్తుల్లోకి చేరుకుని పల్మనరీ థ్రాంబోఎంబాలిజం సమస్యకు దారి తీస్తుంది. ఆర్టెరీలో చేరుకున్న గడ్డలు వివిధ అవయవాల్లోకి చేరుకుని, వాటి డ్యామేజీకి కారణమవుతాయి. మెదడుకు వెళ్లే రక్తనాళంలో ఏర్పడిన గడ్డ వల్ల బ్రెయిన్‌ స్ర్టోక్‌, గుండెకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డంకుల వల్ల హార్ట్‌ స్ర్టోక్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి.


అలాగే చేతులు, కాళ్లకు వెళ్లే ప్రధాన రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడడం వల్ల ఆయా అవయవాలు కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే మధుమేహం, మూత్రపిండాల ఫెయిల్యూర్‌, హైపర్‌టెన్షన్‌ కలిగిన వాళ్లు, దురలవాట్లు ఉన్నవాళ్లు, మాదకద్రవ్యాల వ్యసనం కలిగి ఉన్నవాళ్లు, ఊబకాయుల్లో రక్తపు గడ్డలు ఏర్పడే అవకాశాలు మరింత ఎక్కువ. 


అప్రమత్తత అవసరం

కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత కూడా డి-డైమర్‌, ప్లేట్‌లెట్‌ మరియు ఫిబ్రినోజెన్‌ మొదలైన పరీక్షలతో రక్తంలో గడ్డలు ఏర్పడే అవకాశాలను కనిపెట్టే వీలుంది. ఫలితాలను బట్టి హెపారిన్‌, లో మాలిక్యులర్‌ హెపారిన్‌ మొదలైన యాంటీకాగ్యులెంట్లు వాడుకోవలసి ఉంటుంది. అలాగే ఎంబోలెక్టమీ అనే సర్జరీ సహాయంతో రక్తపు గడ్డలను తొలగించుకునే అవకాశాలూ ఉన్నాయి. థ్రాంబోలైసిస్‌ అనే పద్ధతి ద్వారా కూడా వీటిని తొలగించవచ్చు. అయితే సమస్యను ప్రారంభంలోనే గుర్తించి అప్రమత్తం కావడం ఎంతో అవసరం.


ఈ లక్షణాలు గమనించాలి

శరీర భాగాల్లో హఠాత్తుగా నొప్పి తలెత్తడం, మొద్దుబారడం, వాపు తలెత్తడం, చల్లబడడం, చర్మపు రంగు మారడం లాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి ఆయా ప్రదేశాల్లో రక్తపు గడ్డలు ఏర్పడ్డాయి అనడానికి సూచనలు. కాబట్టి కొవిడ్‌ చికిత్స తీసుకుంటున్న వారు, కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు ఈ లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచి, అనుమానం తలెత్తినప్పుడు వెంటనే వైద్యులు కలవడం అవసరం. ప్రారంభంలోనే గుర్తించి, సరైన సమయంలో చికిత్స అందిస్తే రక్తపు గడ్డలు కలిగించే శాశ్వత నష్టాల నుంచి తప్పించుకోవచ్చు.


రక్తపు గడ్డల కారణంగా అవయవ జరిగే అవయవ నష్టాన్ని నివారించడం కోసం ప్రపంచవ్యాప్తంగా పలు అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొవిడ్‌ చికిత్స ముగిసి, ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లే మోడరేట్‌ నుంచి సివియర్‌ కోవకు చెందిన కొవిడ్‌ బాధితులకు వైద్యులు రక్తాన్ని పలుచన చేసే మందులు సూచించడం జరుగుతోంది. 


కొత్త వేరియెంట్లు

రక్తపు గడ్డలు ఏర్పడే పరిస్థితులు తలెత్తడానికి కారణం సెకండ్‌ వేవ్‌లో భాగంగా వేర్వేరు వేరియెంట్లు వ్యాపించడమే! కాబట్టి సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌ బారిన పడి కోలుకున్నవారు వైద్యుల సూచనలు తప్పక పాటిస్తూ, సూచించినంత కాలం యాంటీకాగ్యులెంట్‌ మందులు వాడుకుంటూ ఉండాలి. శరీర భాగాల్లో హఠాత్తుగా నొప్పి తలెత్తడం, మొద్దుబారడం, వాపు తలెత్తడం, చల్లబడడం, చర్మపు రంగు మారడం లాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి ఆయా ప్రదేశాల్లో రక్తపు గడ్డలు ఏర్పడ్డాయి అనడానికి సూచనలు.


డాక్టర్‌ దేవేందర్‌ సింగ్‌,

సీనియర్‌ వాస్క్యులర్‌ అండ్‌ 

ఎండోవాస్క్యులర్‌ సర్జన్‌,

యశోద హాస్పిటల్స్‌,

సోమాజిగూడ, హైదరాబాద్‌.