లెక్కలివ్వకపోతే... అనర్హతే.!

ABN , First Publish Date - 2021-10-25T05:12:38+05:30 IST

పరిషత్‌ ఎన్నికల్లో విజేతలూ, పరాజితులు ఇరువురూ ఎన్నికల సమయంలో వారు చేసిన ఖర్చుల వివరాలను ఈసీకి అందించాల్సిందే. లేనిపక్షంలో వారిపై అనర్హత వేటుపడుతుంది. గతనెల 19న ప్రకటించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలకు సంబంధించి విజేతలతోపాటు, పరాజితులు కూడా వారి ఖర్చు వివరాలను సంబంధిత యంత్రాంగానికి నిర్ణీత గడువులోపు నివేదించాల్సి ఉంటుంది.

లెక్కలివ్వకపోతే...  అనర్హతే.!
జడ్పీ కార్యాలయం (ఫైల్‌)

పరిషత్‌’ అభ్యర్థులు ఖర్చుల వివరాలు ఈసీకి సమర్పించాలి

నిర్ణీత పద్ధతిలో నిబంధనల ప్రకారం అందించాలి

ఇంకా తొమ్మిది రోజులే గడువు

ఒంగోలు (జడ్పీ), అక్టోబరు 24 : పరిషత్‌ ఎన్నికల్లో విజేతలూ, పరాజితులు ఇరువురూ ఎన్నికల సమయంలో వారు చేసిన ఖర్చుల వివరాలను ఈసీకి అందించాల్సిందే. లేనిపక్షంలో వారిపై అనర్హత వేటుపడుతుంది. గతనెల 19న ప్రకటించిన  జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలకు సంబంధించి విజేతలతోపాటు, పరాజితులు కూడా వారి ఖర్చు వివరాలను సంబంధిత యంత్రాంగానికి నిర్ణీత గడువులోపు నివేదించాల్సి ఉంటుంది. ఈ గడువు ఫలితాలు విడుదలైన 45రోజుల వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే ఐదువారాలు గడిచిపోయాయి. ఇంకా తొమ్మిది రోజులు గడువు మాత్రమే మిగిలి ఉంది. ఆ లోపుగానే పరిషత్‌ పోరులో ఉన్న అభ్యర్థులు ఖర్చుల వివరాలు అందించాల్సి ఉంటుంది.

ఎంపీటీసీలు మండల కార్యాలయంలో, జడ్పీటీసీలు సీఈవోకి...

జయాపజయాలతో సంబంధం లేకుండా పరిషత్‌ పోరులో బరిలోకి దిగిన అభ్యర్థులు ఖర్చుల వివరాలు అందించాల్సి ఉంటుంది. ఎంపీటీసీ అభ్యర్థులైతే ఆయా మండల కార్యాలయాల్లో, జడ్పీటీసీ అభ్యర్థులైతే జడ్పీ సీఈవోకి ఖర్చుల వివరాలను పూర్తి ధ్రువీకరణతో సమర్పించాలి. వీటిని కలెక్టర్‌ పరిశీలన, ఆమోదంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తారు. 

అనర్హత వేటు పడే అవకాశం...

ఖర్చుల నివేదికలు అందజేయడానికి గడువును పెంచే అవకాశం కూడా ఉంది. ఇది పూర్తిగా ఎన్నికల కమిషన్‌ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఈసీ గడువు పొడిగించకపోతే నిర్ణీత గడువులోపు అభ్యర్థులందరూ వ్యయనివేదికలను అందించాల్సిందే. లేనిపక్షంలో నిబంధనల ప్రకారం వారు పదవులు కోల్పోవడంతోపాటు, మూడేళ్లపాటు పోటీకి కూడా అనర్హులయ్యే ప్రమాదం పొంచి ఉంది. జిల్లావ్యాప్తంగా 41 జడ్పీటీసీ స్థానాలకు 153 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 368 ఎంపీటీసీ స్థానాలకు 940మంది పోటీపడ్డారు. వీరంతా కూడా వ్యయ నివేదికలను అందించాల్సి ఉంటుంది. ఓడిపోయిన వారితో పోలిస్తే గెలిచిన వారు మాత్రం ఈ ఖర్చుల నివేదిక అందించడంలో ఏమరుపాటు పనికిరాదు. ఇలాంటి విషయాల్లో ఈసీ తీవ్ర నిర్ణయం తీసుకున్న దాఖలాలు కూడా గతంలో ఉన్నాయి. అందుకే విజేతలూ జాగ్రత్త...లేకుంటే మాజీలు అవుతారు..


Updated Date - 2021-10-25T05:12:38+05:30 IST