బ్యాలెట్ పెట్టండి, లేదంటే నా చావుకు అనుమతి ఇవ్వండి: సీఎం తండ్రి

ABN , First Publish Date - 2022-01-12T03:05:18+05:30 IST

ఓటు వేయడం రాజ్యాంగం కల్పించిన ప్రధానమైన హక్కు. అయితే ఓటు హక్కును కొందరు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు. దీని వల్ల ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి..

బ్యాలెట్ పెట్టండి, లేదంటే నా చావుకు అనుమతి ఇవ్వండి: సీఎం తండ్రి

రాయ్‌పూర్: దేశంలో ఎన్నికల్లో ఈవీఎంలను తొలగించి మళ్లీ బ్యాలెట్ పేపర్లను తీసుకురావాలని, లేదంటే తన కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ తండ్రి నంద్ కుమార్ బాఘేల్ లేఖ రాశారు. ‘‘ఓటు వేయడం రాజ్యాంగం కల్పించిన ప్రధానమైన హక్కు. అయితే ఓటు హక్కును కొందరు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు. దీని వల్ల ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. నాలుగో మూల స్థంభమైనా మీడియా కూడా ధ్వంసమైంది. దేశ ప్రజల కోసం ఎవరూ ఆలోచించడం లేదు. ప్రజల్లో తీవ్ర భయాందోళనలు ఉన్నాయి’’ అని రాష్ట్రపతికి రాసిన లేఖలో నంద్ కుమార్ బాఘేల్ పేర్కొన్నారు.


ఓటర్లలో చైతన్యాన్ని తీసుకువచ్చే రాష్ట్రీయ మత్‌దాతా జాగృతికి అధినేత అయిన నంద్ కుమార్ బాఘేల్ చేసిన ఈ ప్రతిపాదన సంచలనాన్ని రేకిత్తిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా నేటికీ బ్యాలెట్ విధానమే కొనసాగుతోందని ఆయన గుర్తు చేశారు. ‘‘ఇలాంటి తీవ్ర పరిణామాల వల్ల నా హక్కులన్నీ హరించబడుతున్నాయి. నా దేశ పౌర హక్కును కూడా క్రమంగా కోల్పోతున్నాను. గౌరవనీయమైన రాష్ట్రపతి.. రాజ్యాంగాన్ని కాపాడతానని మీ ప్రమాణ స్వీకారంలో చెప్పారు. కానీ నా రాజ్యాంగ హక్కులు హరించబడుతున్నాయి. ఇక నాకు చావడం తప్ప వేరే మార్గం లేదు. ఎన్నికల విధానంలో బ్యాలెట్ తీసుకురాలేకపోతే జాతీయ ఓటర్ల దినోత్సవమైన జనవరి 25న నా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి’’ అని నంద్ కుమార్ లేఖలో రాసుకొచ్చారు.


చాలా కాలంగా ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్ తీసుకురావాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు తీసుకువచ్చిన ఈ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలే కొందరు ప్రస్తుతం రద్దు చేయమని డిమాండ్ చేయడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను తీసుకువచ్చినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన భారతీయ జనతా పార్టీ.. ప్రస్తుతం అదే విధానాన్ని భుజాలకు ఎత్తుకుంటోంది. విపక్షాల నుంచి వచ్చే విమర్శలను తోసిపుచ్చుతూ ఈవీఎంల్లో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని బీజేపీ చెప్తూ వస్తోంది.

Updated Date - 2022-01-12T03:05:18+05:30 IST