ఈ ఏడాదిలోగా వాడకుంటే.. వ్యాక్సిన్లు వృథా!

ABN , First Publish Date - 2021-04-01T07:22:50+05:30 IST

ఇప్పటిదాకా అభివృద్ధిచేసిన కరోనా వ్యాక్సిన్లను ఈ ఏడాదిలోగా వాడేయకుంటే.. ఆ తర్వాత పనికి రావని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ కొత్త

ఈ ఏడాదిలోగా వాడకుంటే.. వ్యాక్సిన్లు వృథా!

  • కొత్త స్ట్రెయిన్లు భారీగా పెరిగిపోతే 
  • వ్యాక్సిన్ల ప్రభావశీలత శూన్యం
  • బూస్టర్‌ డోసులు ఇవ్వాల్సి రావచ్చు
  • వ్యాక్సినేషన్‌లో ధనిక దేశాల స్వార్థం
  • టీకాలపై మేధోసంపత్తి హక్కులను రద్దు చేయాలి.. డబ్ల్యూటీవోలో భారత్‌ 
  • అమెరికా, బ్రిటన్‌, ఈయూ తిరస్కరణ
  • ‘పీపుల్స్‌ వ్యాక్సిన్‌ అలయన్స్‌’ సర్వేలో 77 మంది ప్రముఖ శాస్త్రవేత్తల విశ్లేషణ


లండన్‌, మార్చి 31: ఇప్పటిదాకా అభివృద్ధిచేసిన కరోనా వ్యాక్సిన్లను ఈ ఏడాదిలోగా వాడేయకుంటే.. ఆ తర్వాత పనికి రావని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ కొత్త స్ట్రెయిన్లు భారీగా పెరిగిపోతే.. ఇప్పటి కొవిడ్‌ టీకాలు భవిష్యత్తులో ప్రభావవంతంగా పనిచేయకపోవచ్చని, ఆ పరిస్థితుల్లో వ్యాక్సిన్లలో మార్పులు చేసి ప్రజలకు బూస్టర్‌ డోసులు ఇవ్వాల్సి రావచ్చన్నారు. ‘పీపుల్స్‌ వ్యాక్సిన్‌ అలయన్స్‌’ అనేది అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, ఆక్స్‌ఫామ్‌, యూఎన్‌ఏఐడీఎ్‌సల సంయుక్త కూటమి.


దీని ఆధ్వర్యంలో 28 దేశాల్లోని ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన 77 మంది శాస్త్రవేత్తలను సర్వే చేయగా పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. కొత్త స్ట్రెయిన్లు వచ్చే కొద్దీ.. ఇప్పటి టీకాల ప్రభావశీలత తగ్గుందని ధనిక దేశాలు ముందే గ్రహించాయని, అందుకే శరవేగంగా వ్యాక్సినేషన్‌ చేస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.  



ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలైతే మార్పులు సులభం.. 

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉందని, దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్‌లలో ఒక్క శాతం జనాభాకు కూడా కరోనా టీకా అందకపోవడమే అందుకు నిదర్శనమని చెప్పారు. కరోనా టీకాలు, చికిత్సా పద్ధతుల మేధోసంపత్తి హక్కులను తాత్కాలికంగా రద్దు చేయాలని భారత్‌, దక్షిణాఫ్రికా.. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) లో ఇటీవల ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా, బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియన్‌ అడ్డుకున్న విషయాన్ని శాస్త్రవేత్తలు ఈసందర్భంగా గుర్తుచేశారు.


ప్రపంచ ఆరోగ్య సంస్థ, బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌ల సంయుక్త నేతృత్వంలో ‘కొవ్యాక్స్‌’ కార్యక్రమం ద్వారా పేద దేశాలకు టీకాల పంపిణీలోనూ జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. పాత, కొత్త పరిజ్ఞానాలతో తయారైన వివిధ రకాల టీకాలు చాలా దేశాల్లో వినియోగంలోకి వచ్చాయని తెలిపారు. అయితే ఎంఆర్‌ఎన్‌ఏ పరిజ్ఞానంతో తయారైన వ్యాక్సిన్ల (ఫైజర్‌, మోడెర్నా)లో.. కొత్త స్ట్రెయిన్లకు అనుగుణంగా త్వరితగతిన (కొన్ని వారాలు, నెలల్లోనే) మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. నిల్వకు సంబంధించిన పరిమితులు, అధిక ధర కారణంగా అవి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందే పరిస్థితి లేదని చెప్పారు. 


Updated Date - 2021-04-01T07:22:50+05:30 IST