జీవన మంత్రం: సమాజ సేవ చేయడమే మీ ఉద్దేశ్యమైతే.. మీలో ఉండకూడని లక్షణమిదే! అదేంటో తెలుసా?

ABN , First Publish Date - 2021-11-24T13:02:59+05:30 IST

ఇది భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు..

జీవన మంత్రం: సమాజ సేవ చేయడమే మీ ఉద్దేశ్యమైతే.. మీలో ఉండకూడని లక్షణమిదే! అదేంటో తెలుసా?

ఇది భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు సంబంధించిన ఉదంతం. ఒకరోజు ఆయన హోం మంత్రి గోవింద్ వల్లభ్ పంత్‌కు ఫోన్ చేసి.. 'నేను మీకు ఒక లేఖ ఇస్తున్నాను.. మీరు ఈ లేఖను తీసుకొని గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్ వ్యవస్థాపకులు హనుమాన్ ప్రసాద్ పోద్దార్‌కు ఇవ్వండి' అని చెప్పారు. పోద్దార్‌ను‌ భాయీజీ అని కూడా పిలుస్తారు. రాష్ట్రపతి మాటలు విన్న పంత్.. ‘ఈ లేఖలో ఏముంది? ఉన్నత స్థానంలో ఉన్నమీరు.. పోద్దార్‌‌ భాయీజీకి లేఖ ఇవ్వడమేమిటి?' అని అడిగారు. దీనికి సమాధానంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. 'భాయీజీ ఒక అమోఘమైన  కార్యాన్ని నెరవేరుస్తున్నారు. గీతా ప్రెస్ ద్వారా హిందూ ధర్మ విలువలను తెలియజేస్తూ ప్రజలలో నైతిక చైతన్యం తీసుకువస్తున్నారు. ఆయనను భారతరత్నతో గౌరవించాలనుకుంటున్నాం’ అని అన్నారు.  రాష్ట్రపతి ఆదేశాల మేరకు పంత్.. యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఉంటున్న భాయీజీ దగ్గరకు వెళ్లారు. భాయీజీ అతనిని ఎంతో గౌరవించారు. తరువాత పంత్.. రాష్ట్రపతి ఇచ్చిన లేఖ భాయీజీకి అందజేశారు. దీనిని చూశాక భాయీజీ స్పందన ఎలావుంటుందో చూడాలని పంత్ మనసులో అనుకున్నారు.


ఈ లేఖ చదివిన భాయీజీ దానిని తిరిగి అదే కవరులో ఉంచి.. పంత్‌తో ఎంతో వినయంగా.. ' భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ మీద, మీమీద నాకు ఎంతో గౌరవ మర్యాదలున్నాయి. కానీ మీరు నాకు చేయాలనుకుంటున్న సత్కారాన్ని స్వీకరించలేను. ఎందుకంటే నా అభిప్రాయంలో బిరుదు ఒక వ్యాధి లాంటిది. ఇది నేను నడుస్తున్న మార్గానికి, నా లక్ష్యాలకు ఆటంకంగా మారవచ్చు.. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం’ అని అన్నారు. అనంతరం పంత్.. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు ఈ విషయం తెలియజేశారు... కొంతమంది బిరుదుల కంటే ఎంతో ఉన్నతమైనవారని గ్రహించానని పంత్ అన్నారు. నిజానికి ప్రజాసేవ చేయడమే లక్ష్యం అనుకున్నవారు ప్రశంసలు, గౌరవాలు, బిరుదులు, ప్రభుత్వ సౌకర్యాలకు దూరంగా ఉండాలని ఈ ఉదాహరణ ద్వారా గ్రహించవచ్చు.  ఒక్కోసారి ఇవి మనిషి అహంభావాన్ని పెంచి, సేవాకార్యక్రమాల నుంచి తప్పుకునేలా చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. 

Updated Date - 2021-11-24T13:02:59+05:30 IST