సింహాద్రి, ఆదిలా వస్తారనుకుంటే..

ABN , First Publish Date - 2021-11-26T09:15:03+05:30 IST

సింహాద్రి, ఆదిలా వస్తారనుకుంటే..

సింహాద్రి, ఆదిలా వస్తారనుకుంటే..

ప్రవచనాలు, సుభాషితాలు పలికారు!

భువనేశ్వరి మేనల్లుడిగా ‘జూనియర్‌’ ఫెయిలయ్యారు

బెజవాడలో వర్ల రామయ్య దీక్షలో టీడీపీ నేతలు


విజయవాడ, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘‘శాసనసభలో తన మేనత్త నారా భువనేశ్వరిపై వైసీపీ నాయకులు నీచమైన భాషలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించిన తీరు మమ్మల్ని బాధిస్తోంది. ఆయనకు సన్నిహితులుగా చెప్పుకునే వల్లభనేని వంశీ, కొడాలి నాని తదితరులు తన మేనత్తపై అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తే.. ప్రవచనాలు చెప్పినట్టుగా సుభాషితాలు పలికారు’’ అంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరా ఆవేదన వ్యక్తం చేశారు. భువనేశ్వరిపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నేత వర్ల రామయ్య తన సతీమణి జయప్రదతో కలిసి గురువారం విజయవాడలోని తన నివాసంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వర్ల మాట్లాడారు. ‘‘భువనేశ్వరికి మేనల్లుడుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫెయిలయ్యారు. ఆయన స్పందించిన తీరు టీడీపీ శ్రేణుల మనోభావాలను దెబ్బతీసింది. సినిమాలు అందరికీ ఉంటాయి. కానీ బాలకృష్ణ ఎలా స్పందించారు? జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎలా స్పందించారు? కొడాలి, వల్లభనేని దొంగ బ్యాచ్‌. అవకాశం ఉండి వారు మంత్రులయ్యారు. లేకపోతే జేబులు కొడుతూ ఉండేవారు. ఇవన్నీ నా వ్యక్తిగత వ్యాఖ్యలు మాత్రమే. పార్టీకి సంబంధం లేదు. జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించిన తీరుపై కడుపు మండి మాట్లాడుతున్నా’’ అని వర్ల అన్నారు. వర్ల దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, ఆ పార్టీ అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా... జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనపై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు కరెక్టేనని, జూనియర్‌ విషయంలో టఛ మనసులో ఉన్న అభిప్రాయాలనే వర్ల బయట పెట్టారని చెప్పారు. ‘నాని, వంశీ చేసిన వ్యాఖ్యలకు శ్రీమంతుడులా ఆయుఽధం పట్టుకుని వస్తాడనుకుంటే తుస్సుమనిపించారు. సింహాద్రి, ఆది సినిమాల్లో మాదిరిగా రంగంలోకి దిగి దుయ్యబడతారనుకుంటే నిరాశపరిచారు. స్వయానా మేనత్తను అవమానపరిస్తే ఖండించడం వల్ల కూడా కేరీర్‌ దెబ్బతింటుందా?’’ అని బుద్దా ప్రశ్నించారు. ‘‘కొడాలి నాని పశువుల భాష మాట్లాడుతున్నాడు. తుచ్ఛమైన మంత్రి పదవి కోసం కొడాలి నాని బూట్లు నాకే కార్యక్రమం చేస్తున్నాడు. ఆరోజు అసెంబ్లీ రికార్డులను బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి’’ అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు... ‘‘సాక్షాత్తు శాసనసభలో ముఖ్యమంత్రి సమక్షంలో అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని చూసి మహిళాలోకం అసహ్యించుకుంటోంది’’ అని అన్నారు.  టీడీపీ క్రమశిక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు అర్జునుడు... ‘‘కొడాలి, వల్లభనేనికి ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు. వాళ్లది మానవత్వం లేని రాక్షస జాతి. పదవులు కాపాడుకోవడానికి ఎంతకైనా దిగజారుతారు’’ అని మండిపడ్డారు. మాజీ మంత్రి నెట్టెం రఘురాం, టీడీపీ నేత పట్టాభి తదితరులు వర్ల రామయ్య దీక్షకు సంఘీభావం తెలిపారు. 

Updated Date - 2021-11-26T09:15:03+05:30 IST