ఎస్పీ అలా చేస్తే బీజేపీకి ఒక్కసీటు కూడా రాదు

ABN , First Publish Date - 2021-08-08T22:17:00+05:30 IST

బీజేపీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) అధ్యక్షుడు, యూపీ మాజీ మంత్రి ఓం ప్రకాష్ ..

ఎస్పీ అలా చేస్తే బీజేపీకి ఒక్కసీటు కూడా రాదు

లక్నో: బీజేపీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) అధ్యక్షుడు, యూపీ మాజీ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ అన్నారు. వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఎన్నికల ఫలితాల్లో మార్పు వస్తుందని, ఈస్ట్రన్ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీతో ఎస్పీ పొత్తు పెట్టుకుంటే మవు, బల్లియా, ఘజియాపూర్, అజంగఢ్, జౌన్‌పూర్, అంబేడ్కర్ నగర్, ఇతర జిల్లాల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని చెప్పారు. వారణాసిలో రెండు సీట్లలో మాత్రమే బీజేపీతో పోటీ ఉంటుందని పేర్కొన్నారు.


యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ సీట్లలో ఈస్ట్రన్ యూపీలో 150 సీట్లు ఉన్నాయని రాజ్‌భర్ చెప్పారు. బీజేపీని ఏ పార్టీ ఓడించగలదనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమిచ్చారు. యూపీలో బీజేపీని సవాలు చేయగలిగేది సమాజ్‌ వాది పార్టీ మాత్రమేనని చెప్పారు. బీఎస్‌పీ కూడా పావులు కదపడం మొదలుపెట్టినప్పటికీ, ఆ పార్టీ క్రేజ్ సమాజ్‌వాదీ పార్టీ అంత కాదని పేర్కొన్నారు. 2002లోఎస్‌బీఎస్‌పీ ఏర్పాటు చేసినప్పుడు పలు పార్టీలతో ఒప్పందం కుదుర్చున్న విషయంపై అడిగినప్పుడు, స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వెళ్లిపోతుంటారని, చిన్న పార్టీలకు ఆర్థిక స్థోమత ఉండదని, ఆ కారణంగానే పెద్ద పార్టీలు అలాంటి వారికి ఆశలు చూపిస్తుంటాయని, సంకీర్ణాలు విచ్ఛిన్నమవుతుంటాయని అన్నారు. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ నిర్ణయిస్తే బీజేపీతో తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని రాజ్‌భర్ ఇటీవల పేర్కొన్నారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్‌భర్ పార్టీ నాలుగు సీట్లు గెలుచుకుంది. కేబినెట్ మంత్రిగా పనిచేసిన రాజ్‌భర్ లోక్‌సభ ఎన్నికల ముందుకు మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Updated Date - 2021-08-08T22:17:00+05:30 IST