క్లెయిమ్‌ కాదంటే కారణం చెప్పాల్సిందే

ABN , First Publish Date - 2021-03-22T06:07:46+05:30 IST

ఆరోగ్య బీమా క్లెయిమ్‌లపై బీమా కంపెనీల ఆగడాలకు చెక్‌ పడనుంది. ఈ క్లెయిమ్‌లకు సంబంధిచి బీమా నియంత్రణ

క్లెయిమ్‌ కాదంటే కారణం చెప్పాల్సిందే

ఆరోగ్య బీమాపై ఐఆర్‌డీఏఐ ఆదేశం


న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా క్లెయిమ్‌లపై బీమా కంపెనీల ఆగడాలకు చెక్‌ పడనుంది. ఈ క్లెయిమ్‌లకు సంబంధిచి బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. క్లెయిమ్‌ పరిష్కార ప్రక్రియ మొత్తం ఇక పూర్తి పారదర్శకంగా ఉండాలని కోరింది. ఏ కారణంగా అయినా  క్లెయిమ్‌ను తిరస్కరిస్తే బీమా కంపెనీ అందుకు స్పష్టమైన కారణాలు చెప్పాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. బీమా కంపెనీల తరఫున పని చేసే థర్డ్‌ పార్టీ సంస్థలకూ (టీపీఏ) ఇవే నియమాలు వర్తిస్తాయని  తెలిపింది. 


ఎందుకంటే ?

కొవిడ్‌ నేపథ్యంలో ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు బీమా కంపెనీలు ఎడాపెడా ఆరోగ్య బీమా పథకాలు తీసుకొచ్చాయి. ఈ పాలసీలు తీసుకున్న వారిలో ఎవరైనా జబ్బుపడి క్లెయిమ్‌ చేసుకోబోతే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని బీమా కంపెనీలు సరైన కారణం చెప్పకుండానే క్లెయిమ్‌లను తిరస్కరిస్తున్నాయి. దాంతో ఆరోగ్యబీమా ఉన్నా హాస్పిటల్‌  ఖర్చుల భారం పాలసీదారులపైనే పడుతోంది. దీనిపై ఐఆర్‌డీఏఐరి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఐఆర్‌డీఏ ఈ సర్క్యులర్‌ జారీ చేసిందని భావిస్తున్నారు. 


ఎప్పటికపుడు అప్‌డేట్‌ 

క్యాష్‌లెస్‌ క్లెయిమ్‌ల విజ్ఞప్తుల ప్రస్తుత స్టేట్‌సతో పాటు సెటిల్‌మెంట్‌ వరకు జరిగే ప్రక్రియ మొత్తాన్ని బీమా కంపెనీలు అందుబాటులో  ఉంచాలని కోరింది. బీమా కంపెనీలు  ఇందుకోసం తమ వెబ్‌సైట్లు, పోర్టల్స్‌, యాప్స్‌ లేదా ఇతర ఎలకా్ట్రనిక్స్‌ మాధ్యమాలు ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.




సర్క్యులర్‌ ఇతర ముఖ్యాంశాలు


ఫిర్యాదు ఎవరికి, ఎలా చేయాలో తెలియజేయాలి.

 ఫిర్యాదు అధికారులు/అంబుడ్స్‌మన్‌ పేరు, చిరునామా కూడా పాలసీదారులకు తెలియజేయాలి.

 ఆరోగ్య బీమా పథకాలు అందించే అన్ని బీమా కంపెనీలకు ఈ సర్క్యులర్‌ వర్తిస్తుంది. 

 ప్రభుత్వ రంగంలోని వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ), ఎగుమతి పరపతి హామీ సంస్థ (ఈసీజీసీ)లకు మాత్రం ఈ సర్క్యులర్‌ వర్తించదు.


Updated Date - 2021-03-22T06:07:46+05:30 IST