బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు వారికే..

ABN , First Publish Date - 2021-05-17T05:15:53+05:30 IST

’మొదటి వేవ్‌తో పోలిస్తే..

బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు వారికే..

భయం వీడితేనే... జయం!

80 శాతం మందికి హోం ఐసోలేషన్‌లోనే చికిత్స  

బలం పుంజుకున్న వైరస్‌తో పెరుగుతున్న కేసులు 

గ్రామీణ జిల్లాలో వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారణమిదే

కర్ఫ్యూతో కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం

ఆందోళనతో వ్యాధి నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం

ఉత్తరాంధ్ర జిల్లాల కొవిడ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): ’మొదటి వేవ్‌తో పోలిస్తే.. సెకండ్‌ వేవ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల భారీగా పెరిగాయి. వైరస్‌ బలం పుంజుకోవడమే దీనికి కారణం. అయినా వైరస్‌ సోకిన వంద మందిలో 80 మంది ఇళ్లల్లోనే ఉండి కోలుకుంటున్నారు. పాజిటివ్‌ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. భయం, ఆందోళనతో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందని  అంటున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల కొవిడ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందడానికి గల కారణాలు, తగ్గు ముఖం పట్టేందుకు ఎన్ని రోజులు పట్టవచ్చు వంటి అనేక విషయాలపై ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 


మొదటి దశతో పోలిస్తే రెండో దశలో వైరస్‌ మ్యూటేషన్‌  బలంగా ఉంది. వైరస్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.  గతంతో పోలిస్తే ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ తగ్గింది. గతంలో వైరస్‌ సోకిన వ్యక్తిలో వారం రోజుల వరకు లక్షణాలు కనిపించేవి కావు. ప్రస్తుతం రెండు రోజుల్లోనే  కనిపిస్తున్నా యి. కండ్లకలక, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలతో వచ్చిన వారూ పాజిటివ్‌గా తేలుతున్నారు. అదే సమయంలో కొందరిలో వైరస్‌ సోకిన రెండు, మూడు రోజులలోనే ఆయా సం పెరిగిపోవడం, ఆక్సిజన్‌ తగ్గిపోవడం కనిపిస్తోంది. 


నెలాఖరుకు తగ్గుముఖం..

జిల్లాలో కొద్దిరోజుల నుంచి నిలకడగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కర్ఫ్యూ ప్రభావం కనిపిస్తోంది. ఈ నెలఖరుకి పాజిటివ్‌ కేసుల తగ్గుదల కనిపిస్తుంది.  జనం గుంపులుగా చేరడం వైరస్‌ వ్యాప్తికి దోహదపడింది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కాబట్టి, కేసులు తగ్గుతాయని భావిస్తున్నాం. మరో పది రోజులు జాగ్రత్తగా ఉంటే పరిస్థితి అదుపులోకి వస్తుంది. 


వ్యాధి నిరోధక శక్తిపై ప్రభావం 

కరోనా పాజిటివ్‌ వచ్చినంత మాత్రాన ఆందోళన చెందాల్సి న పని లేదు. వైరస్‌ సోకిన వంద మందిలో 80 ఇళ్లల్లోనే ఉం డి కోలుకుంటున్నారు. మిగిలిన 20 మందిలో పది శాతం మంది భయంతోనే ఆస్పత్రులకు పరుగుతీస్తున్నారు.  పాజిటివ్‌ వచ్చిందన్న భయాందోళనతో శరీరంలో వ్యాధి నిరోధకశక్తి తగ్గి  నష్టాన్ని కలిగించే ప్రమాదముంది. ఒత్తిడిని చిత్తు చేస్తూ మానసికంగా ఉల్లాసాన్ని కలిగి ఉండడం వల్ల వేగంగా కోలుకునే అవకాశముంది. 


బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు వారికే.. 

వైరస్‌ సోకి కోలుకున్న ప్రతి ఒక్కరిలో బ్లాక్‌ ఫంగస్‌ ముప్పుండదు. దీర్ఘకాలం స్టెరాయిడ్స్‌, మందులువాడిన వారిలో ఈ సమస్య కనిపించే అవకాశముంది. ముఖ్యంగా షుగర్‌ వంటి సమస్యలకు మందులు వాడుతూ, వైరస్‌ సోకిన వారిలో ఈ సమస్య ఎక్కువ. దీర్ఘకాలంగా వాడే మందులు వల్ల వ్యాధి నిరోధకశక్తి  తక్కువగా ఉంటుంది. అటువంటి వారికి ఈ బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు ఉండవచ్చు. ఇప్పటివరకు జిల్లాలో అటువంటి కేసులు నమోదైన దాఖలాలు లేవు. 


ఆస్పత్రుల్లో వారే చేరాలి.. 

సాధారణంగా పాజిటివ్‌ వచ్చినా ఎక్కువ మంది ఇళ్లల్లోనే ఉంటూ కోలుకుంటారు. ఐదు రోజులు కంటే ఎక్కువ రోజులు తీవ్రమైన జ్వరం, విపరీతమైన దగ్గు, ఆయాసం, ఆక్సిజన్‌ లెవెల్స్‌ 90 కంటే తగ్గిపోతున్నా ఆస్పత్రుల్లో చేరాలి. ఈ సమస్యలేమీ లేని వారు  ఇంట్లోనే వైద్యుల సలహా మేరకు మందులు వాడి కోలుకోవచ్చు. 


ప్లాస్మా థెరఫీ వద్దు

గత కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా ప్లాస్మా కావాలంటూ విన్నపాలు వస్తున్నాయి. ప్లాస్మా థెరఫీ వల్ల ఉపయోగమే లేదని పరిశోధనలు తేల్చాయి.  ఈ విధానాన్ని అమెరికా వంటి దేశాల్లో పూర్తిగా వద్దని చెబుతున్నారు. పూర్తిస్థాయిలో యాంటీబాడీస్‌ అభివృద్ధి చెందని వ్యక్తి ఇచ్చే ప్లాస్మా వల్ల మ్యుటేషన్ల ముప్పున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.  ప్లాస్మా కోసం అనవసరంగా వెంపర్లాడవద్దు. 


జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలి

పాజిటివ్‌ కేసులు తగ్గినా, తగ్గకపోయినా ముఖానికి మాస్క్‌, చేతులను పరిశుభ్రం చేసుకోవడం, భౌతికదూరం పాటించడం  తప్పనిసరి. దేశంలో కరోనా వైరస్‌ ముప్పు లేదని ప్రభుత్వాలు ప్రకటించే వరకు అప్రమత్తంగా ఉండాలి. టీకా విషయంలో నిర్లక్ష్య ధోరణిని విడనాడాలి. అవకాశం ఉన్న వారంతా  వ్యాక్సిన్‌ తీసుకోవడం మంచిది.  


Updated Date - 2021-05-17T05:15:53+05:30 IST