Abn logo
Sep 6 2020 @ 00:00AM

సరదాగా మొదలెడితే... సీరియస్‌ ప్రాజెక్టు అయ్యింది!

కరోనా సమయంలో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. కానీ హీరోహీరోయిన్లు, దర్శకులు, సాంకేతిక నిపుణులు మాత్రం ఇంటి నుంచే చాలా పనులు చక్కదిద్దారు. లాక్‌డౌన్‌లో ప్రముఖ ఆర్ట్‌ ఫిల్మ్‌మేకర్‌ బి.నరసింగరావు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన ఐదు నెలల క్రితం తన వాట్సాప్‌ గ్రూపులోని సభ్యులంతా వీక్షించే విధంగా బాలీవుడ్‌ సినిమా లింకులు (యూట్యూబ్‌) పెట్టడం మొదలెట్టారు. సినిమా థియేటర్‌లో ప్రదర్శించినట్టే టైమ్‌ ప్రకారం రోజుకు నాలుగు ఆటలుగా ‘హిందీ కమర్షియల్‌ క్లాసిక్స్‌’ను ‘పోస్ట్‌’ చేస్తున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటిదాకా నిరంతరాయంగా 750 సినిమాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన ఇంకా రెండు నెలలు కొనసాగుతుంది. అంటే సుమారు వెయ్యి సినిమాలన్నమాట. ఒక పద్ధతి ప్రకారం... అనేక విభాగాలను స్పృశిస్తూ, సుమారు వందేళ్ల హిందీ సినిమాల్లోని ‘బెస్ట్‌ మూవీస్‌ లిస్టింగ్‌’ ప్రాజెక్ట్‌ గురించి ఆయన మాటల్లోనే...


నా వర్క్స్‌కు సంబంధించి ‘బి నరసింగరావ్స్‌ ఆర్ట్‌ పోస్ట్‌’ అనే వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసుకున్నా. ఒకరోజు నా మిత్రుడొకరు రాజ్‌కపూర్‌ క్లాసిక్‌ ‘శ్రీ 420’ సినిమా యూట్యూబ్‌ లింక్‌ను నాకు పోస్ట్‌ చేశారు. దాన్ని నేను చూసిన తర్వాత ఈ గ్రూపులోకి ఫార్వర్డ్‌ చేస్తే  సభ్యులందరూ ఎంకరేజ్‌ చేస్తూ కామెంట్స్‌ పెట్టారు. ఆ కామెంట్స్‌ చదివి మంచి సినిమాల లింకులు పెడితే అందరూ సరదాగా చూసి ఆనందిస్తారు కదా అనిపించింది.


కరోనా అనేది సృజనాత్మకంగా ఆలోచించేవారికి పెద్ద ఆటంకం కాదనేది నా అభిప్రాయం. ఇంట్లో ఉన్నా ఆలోచన పరంపర కొనసాగుతూనే ఉంటుంది. లాక్‌డౌన్‌ మొదలైన తర్వాత నేను ఇంట్లోనే పెయింటింగ్స్‌ వేసుకుంటూ... కవిత్వం రాసుకుంటూ, సినిమాలు చూస్తూ నా ప్రపంచంలో నేనున్నా. నా వర్క్స్‌కు సంబంధించి ‘బి నరసింగరావ్స్‌ ఆర్ట్‌ పోస్ట్‌’ అనే వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసుకున్నా. ఒకరోజు నా మిత్రుడొకరు రాజ్‌కపూర్‌ క్లాసిక్‌ ‘శ్రీ 420’ సినిమా యూట్యూబ్‌ లింక్‌ను నాకు పోస్ట్‌ చేశారు. దాన్ని నేను చూసిన తర్వాత ఈ గ్రూపులోకి ఫార్వర్డ్‌ చేస్తే మంచి రెస్పాన్స్‌ వచ్చింది. గ్రూపులోని సభ్యులందరూ ఎంకరేజ్‌ చేస్తూ కామెంట్స్‌ పెట్టారు. ఆ కామెంట్స్‌ చదివి మంచి సినిమాల లింకులు పెడితే అందరూ సరదాగా చూసి ఆనందిస్తారు కదా అనిపించింది. ఏప్రిల్‌ 1న ‘శ్రీ 420’ పెడితే, మరుసటి రోజు 1964లో విడుదలైన సునీల్‌దత్‌ ‘యాదే’ సినిమా లింక్‌ పోస్ట్‌ చేశా. ఇది ప్రపంచంలోనే ఒకే ఒక్క నటుడితో తీసిన తొలి సినిమా. ఆ విషయం సినిమా టైటిల్స్‌లో కూడా ఉంటుంది. ఈ సినిమాకు కూడా మంచి ఆదరణ దక్కడంతో ‘బాలీవుడ్‌ కమర్షియల్‌ క్లాసిక్స్‌’పై నా దృష్టి పడింది.


స్కీమ్‌ ప్రకారం సినిమాలు...

వందేళ్లకు పైబడిన భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటిదాకా సుమారు 13 వేల నుంచి 15 వేల దాకా హిందీ సినిమాలు వచ్చి ఉంటాయి. సినిమా రంగంలో నేను 40 ఏళ్లకు పైగా ఉన్నాను కాబట్టి నా ముందు తరం హిందీ సినిమాల గురించి కూడా నాకు కొంత తెలుసు. భారతీయ సినిమా 1913లో మొదలైతే 1919 దాకా రూపొందించిన సినిమాలు నెట్‌లో దొరకలేదు. కేవలం దాదాసాహెబ్‌ ఫాల్కే తీసిన ‘రాజా హరిశ్చంద్ర’ మాత్రమే అందుబాటులో ఉంది.  నెట్‌లో లభించిన సినిమాలను పోస్ట్‌ చేసేప్పుడు ఒక స్కీమ్‌ ప్రకారం వెళ్లాలనుకున్నా. సినిమాల సెలెక్షన్‌లో కూడా కొన్ని నియమాలు పెట్టుకున్నా. ఒక దర్శకుడు తీసిన సినిమాల్లో కనీసం మూడు సినిమాలు నాకు నచ్చితేనే ‘లిస్టు’లోకి తీసుకున్నా. ఈ ప్రాజెక్టులో మొత్తంగా వెయ్యి నుంచి 1200 సినిమాల లిస్టు పెడితే, అవి 107 ఏళ్ల హిందీ సినిమాను ప్రతిబింబించాలనుకున్నా. ఆ ప్రకారమే ఇంటర్‌నెట్‌లో ఆయా సినిమాల గురించిన సమాచారాన్ని సేకరించడం మొదలెట్టా. దర్శకులు, హీరోలు, ఇతర సాంకేతిక నిపుణులు, నిర్మాణసంస్థల గురించి తెలుసుకుంటూ, నాకున్న సినిమా పరిజ్ఞానంతో ‘హిందీ కమర్షియల్‌ క్లాసిక్స్‌’ను లిస్టింగ్‌ చేశా. 


రోజుకు నాలుగు ఆటలు...

ఒకవైపు సినిమాలపై నా పరిశోధన కొనసాగిస్తూనే ఏప్రిల్‌ 1నుంచి ఇప్పటిదాకా ప్రతీరోజూ క్రమం తప్పకుండా సినిమాలు పోస్ట్‌ చేస్తూనే ఉన్నా. థియేటర్‌ టైమింగ్స్‌లాగానే వాట్సాప్‌ గ్రూపులో ఉదయం 9.30 గంటలకు ఒక పోస్ట్‌, 11.30కి, 2.30కి, 5.30కి... ఇలా రోజుకు నాలుగు సినిమాలు (ఆటలు) పోస్ట్‌ చేస్తున్నా. కొన్నాళ్లుగా రాత్రి 8.30 గంటలకు ‘నాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌’ కూడా పెడుతున్నా. వాటిలో ప్రపంచసినిమా, పిల్లల సినిమా... ఇలా అన్నిరకాల సినిమాలుంటాయి. ఆ విధంగా ఈ ఐదు నెలల్లో సుమారు 750 సినిమాల లింకులు పోస్ట్‌ చేశా. ఒక సినిమా గురించి చదివి, కొంత భాగం చూసిన తర్వాత అది మంచి సినిమా అనే (ప్రింట్‌ కూడా బాగుంటేనే) అభిప్రాయానికొస్తేనే పోస్ట్‌ చేస్తా. వీటిలో 70 శాతం వరకు యూట్యూబ్‌లో దొరికాయి. మిగతావి వివిధ సినిమా సెర్చ్‌ల ద్వారా సేకరించా. సినిమాలను డౌన్‌లోడ్‌ చేసే ప్రక్రియలో నాకు నా మనవడు సాయిప్రణీత్‌తో పాటు, చిత్రకారుడు అన్నవరం శ్రీనివాస్‌ సహకరించారు. ముందుగా వికీపీడియాలో ఉన్న సినిమాల లిస్టులో నుంచి నా ఛాయిస్‌ సినిమాలను ఎంపిక చేయడం కష్టమైంది. వాటిని ఆయా కేటగిరీలుగా విభజిస్తున్నప్పుడు చాలా అంశాలు కనిపించాయి. సినిమాలను హిస్టారికల్‌, మైథలాజికల్‌, డివోషనల్‌, కల్చరల్‌, లిటరేచర్‌, వార్‌ ఫిల్మ్స్‌... ఇలా విభజిస్తుంటే హిందీ సినిమాకు సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు నాకు తెలిశాయి. ఒక ఫిల్మ్‌మేకర్‌గా, సినీ గోయర్‌గా ఆ విశేషాలు ఆలోచింపజేశాయి. 


సినిమాల్లో ప్రముఖులు...

పాత తరం సినిమాలను చూస్తుంటే వివిధ రంగాల్లో ప్రసిద్ధి చెందిన వాళ్లు కూడా తెరపై అప్పుడప్పుడు కనిపించి మనల్ని ఆశ్చర్యపరుస్తారు. ప్రసిద్ధ గాయకుడు తలాత్‌ మహమూద్‌ మూడు నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. బాల గంధర్వ (గాయకుడు), పన్నాలాల్‌ ఘోష్‌ (ఫ్లూట్‌ ప్లేయర్‌), ఎస్‌.ఎన్‌. త్రిపాఠి (సంగీత దర్శకుడు), హరీంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ, బిషిమ్‌ సహానీ (కవి), కైఫీ అజ్మీ (కవి), చేతన్‌ ఆనంద్‌, మోహన్‌ సైగల్‌, విజయ్‌ ఆనంద్‌, గౌతంఘోష్‌ (దర్శకులు) వంటి ప్రముఖులంతా సినిమాల్లో నటించినవారే. ఇలా నటించిన ప్రసిద్ధ వ్యక్తుల ఫుటేజీని తీసుకుని డాక్యుమెంట్‌ చేయాల్సిన అవసరం ఉంది.


చిరు ప్రయత్నమే కానీ...

మనకు ఇంతకుముందు ‘టైమ్‌ బెస్ట్‌ 100 మూవీస్‌’, ప్రసిద్ధ సినీ విశ్లేషకుడు ఆశిష్‌ రాజాధ్యక్ష, పౌల్‌ విల్లెమన్‌తో కలిసి రాసిన ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ఇండియన్‌ సినిమా’ వంటి కొన్ని పుస్తకాలున్నాయి. అయితే నా ప్రయత్నం వాటికి భిన్నమైనది. నేను ఎంపిక చేసిన వెయ్యి సినిమాలు తప్పకుండా సినీ అభిమానులు, పరిశోధకులకు ఒక ‘విండో’లాగా ఉంటుందని చెప్పొచ్చు. నేను మిస్సయిన సినిమాలు (దొరకనివి కూడా ఉన్నాయి), ఈ లిస్టులో తీసేయాల్సిన సినిమాలు కూడా ఉండొచ్చు. అయితే భారతీయ హిందీ సినిమా చరిత్రపై ఈ లిస్టు ద్వారా ఒక అవగాహన వచ్చేందుకు అవకాశం ఉంటుంది. నా ప్రయత్నాన్ని ఆనంద్‌ పట్వర్ధన్‌, గౌతంఘోష్‌, బుద్ధ దేవ్‌ దాస్‌ గుప్తా, గిరీశ్‌ కాసరవల్లి, ఏ.కె.బిర్‌ (వీరంతా కూడా గ్రూపులో ఉన్నారు)లాంటి ప్రముఖులు  మెచ్చుకున్నారు. ప్రయత్నాన్ని కొనసాగించమని ప్రోత్సహిస్తున్నారు. మన సినిమాను ‘హిందీ కమర్షియల్‌ సినిమా’, ‘ప్రాంతీయ సినిమా’, ‘ఆర్ట్‌ సినిమా’, ‘డాక్యుమెంటరీలు’ అనే నాలుగు విభాగాలుగా వర్గీకరిస్తే అందులో నేను ఎంచుకున్నది ఒక్క విభాగాన్నే. దానిలో కూడా ఆయా అంశాలుగా వర్గీకరిస్తే ఎంతో పరిశోధన చేయొచ్చు. అయితే ఆ ప్రయత్నం నా ఒక్కరితోనో, ఇద్దరితోనో అయ్యేది కాదు. ఇనిస్టిట్యూషన్లు, స్కాలర్లు ఏళ్ల తరబడి ఆ పని చేయాల్సి ఉంటుంది. మొత్తానికి లాక్‌డౌన్‌ సమయంలో సరదాగా మొదలెట్టిన ఒక చిన్న ప్రయత్నం రాను రాను సీరియస్‌ ప్రాజెక్టు అవుతుందని నేను అస్సలు ఊహించలేదు.

చల్లా శ్రీనివాస్‌


ఇవి కొన్ని...

వాట్సాప్‌ గ్రూపులో ఇప్పటిదాకా ఇచ్చిన సినిమాల లింకుల్లో శాంతారామ్‌, కె.అబ్బాస్‌, బి.ఆర్‌.చోప్రా, కేదార్‌ శర్మ, మీరానాయర్‌ వంటి ఎంతోమంది దర్శకుల సినిమాలున్నాయి. అలాగే రాజ్‌కపూర్‌ ‘శ్రీ 420’, ‘సంగం’, ‘ఆవారా’, బిమల్‌రాయ్‌ ‘బందినీ’, ‘సుజాత’, ‘మధుమతి’, ‘దేవదాస్‌’, శాంతారామ్‌ ‘జనక్‌ జనక్‌ పాయల్‌ బాజే’, ‘దో ఆంఖే బారా హాత్‌’, ‘నౌరంగ్‌’, గురుదత్‌ ‘ప్యాసా’, ‘కాగజ్‌ కే పూల్‌’, ‘సాహెబ్‌ బీవీ ఔర్‌ గులామ్‌’, హృషికేశ్‌ ‘అనుపమ’, ‘ఆశీర్వాద్‌’, బాసూ చటర్జీ ‘సారా ఆకాశ్‌’, ‘చిత్‌చోర్‌’, ‘చోటీ సీ బాత్‌’, బాసూ భట్టాచార్య ‘తీస్రీ కసమ్‌’, ‘ఆస్తా’, ‘అనుభవ్‌’, మహేశ్‌భట్‌ ‘సారాంశ్‌’, దేవానంద్‌ ‘గైడ్‌’, ‘హమ్‌దోనో’, బి.ఆర్‌.చోప్రా ‘నిఖా’, ‘వక్త్‌’, ‘హమ్‌రాజ్‌’, దిలీప్‌ కుమార్‌ ‘నయాదౌర్‌’, ‘మొఘల్‌ ఏ ఆజమ్‌’, ‘గంగాజల్‌’, గుల్జార్‌ ‘ఆంధీ’, ‘మాచీస్‌’లతో పాటు ‘పాకీజా’, ‘రజియా సుల్తానా’, ‘మహల్‌’, ‘షోలే’, ‘సాగర్‌’ లాంటి సినిమాలున్నాయి.Advertisement
Advertisement
Advertisement