జేబులు ఖాళీ ఆయెనే...

ABN , First Publish Date - 2021-03-26T05:47:32+05:30 IST

ఈక్విటీమార్కెట్‌ను కరోనా వరుసగా రెండో రోజున కూడా అతలాకుతలం చేసింది. స్థానిక లాక్‌డౌన్లు తప్పకపోవచ్చునన్న భయాలతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలకు తెగబడ్డారు.

జేబులు ఖాళీ ఆయెనే...

మార్కెట్‌ భారీ పతనంతో ఇన్వెస్టర్లు లబోదిబో

2 రోజుల్లో రూ.7 లక్షల కోట్లు ఆవిరి

ముంబై: ఈక్విటీమార్కెట్‌ను కరోనా వరుసగా రెండో రోజున కూడా అతలాకుతలం చేసింది. స్థానిక లాక్‌డౌన్లు తప్పకపోవచ్చునన్న భయాలతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలకు తెగబడ్డారు. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలు, నెలవారీ ఫ్యూచ ర్స్‌ కాంట్రాక్టుల ముగింపు దానికి జోడు కావడంతో మార్కెట్‌ భారీ ఆటుపోట్లకు లోనయింది. సెన్సెక్స్‌ వరుసగా రెండో రోజున కూడా 740.19 పాయింట్ల భారీ నష్టంతో 48,440.12 వద్ద ముగియగా నిఫ్టీ 224.50 పాయింట్ల నష్టంతో 14,324.90 వద్ద క్లోజయింది. అన్ని రంగాల సూచీలు భారీ నష్టాల్లోనే క్లోజయ్యాయి. రెండు వరుస ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 1611.32 పాయింట్లు నష్టపోవడంతో రూ.7,00,591.47 కోట్ల మార్కెట్‌ సంపద ఆవిరైపోయి రూ.198.75 లక్షల కోట్లకు దిగజారింది. ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత సంపద రూ.200 లక్షల కోట్ల కన్నా దిగువకు రావడం ఇదే ప్రథమం.

డాక్టర్‌ రెడ్డీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎ్‌ఫసీ, ఎల్‌ అండ్‌ టీ మినహా సెన్సెక్స్‌లోని అన్ని షేర్లు నష్టపోయాయి.  3.98 శాతం నష్టంతో మారుతి అగ్రస్థానంలో ఉంది.  

రియల్టీ కంపెనీ డీఎల్‌ఎఫ్‌ నాన్‌ కన్వర్టిబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.500 కోట్లు సమీకరించింది.

2020-21 సంవత్సరానికి వాటాదారులకు రూ.6 రెండో మధ్యంతర డివిడెండును బోర్డు ప్రకటించినట్టు శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ తెలిపింది. తొలి మధ్యంతర డివిడెండుగా రూ.6 ఇప్పటికే వాటాదారులకు అందించారు. 

ఆకట్టుకున్న లక్ష్మీ ఆర్గానిక్స్‌ : స్పెషాలిటీ కెమికల్స్‌ విభాగంలోని లక్ష్మీ ఆర్గానిక్‌ ఇండస్ర్టీస్‌ షేరు లిస్టింగ్‌ రోజునే 27 శాతం దూసుకుపోయింది. ఇష్యూ ధర రూ.130 కాగా 20 శాతం ప్రీమియంతో రూ.156.20 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమయింది. ఇంట్రాడేలో 34 శాతం లాభపడి రూ.174.50 వరకు వెళ్లి చివరికి 26.61 శాతం లాభంతో రూ.164.60 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.4339.89 కోట్లుంది. 

క్రాఫ్ట్స్‌మాన్‌ ఆటోమేషన్‌ లిస్టింగ్‌లో నిరాశపరిచింది. ఇష్యూ ధర రూ.1490 కన్నా 3.82 శాతం దిగువన రూ.1433 వద్ద క్లోజయింది.

ఎయిర్‌ రూ.2500 కోట్ల ఐపీఓ: వాడియా గ్రూప్‌ కంపెనీ గో ఎయిర్‌ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.2500 కోట్ల భారీ పబ్లిక్‌ ఇష్యూ జారీకి సన్నాహాలు చేసుకుంటోంది. భారీ విస్తరణ ప్రణాళికలకు ఈ నిధులు ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తోంది. త్వరలోనే ఇందుకు అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేయాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. 

Updated Date - 2021-03-26T05:47:32+05:30 IST