ఇలాగైతే కష్టమే

ABN , First Publish Date - 2021-05-18T07:21:52+05:30 IST

ముంచుకొస్తున్న కరోనా రెండో వేవ్‌ ముప్పు గురించి ఈ ఏడాది మార్చిలోనే హెచ్చరించినా.. ప్రభుత్వం పట్టించుకోలేదంటూ సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ) మాజీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా ఆవేదన వ్యక్తం

ఇలాగైతే కష్టమే

వ్యాక్సినేషన్‌ వేగం పెరిగితేనే కొవిడ్‌ మహమ్మారికి అడ్డుకట్ట

మూడో వేవ్‌ వస్తే పతాకస్థాయిలో..

కేసుల సంఖ్య అంచనా వేయడమూ కష్టమే

రోజుకు దాదాపు కోటి మందికి టీకా వేయాలి

దేశంలో టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలి

పాజిటివ్‌లను గుర్తించి ఐసొలేషన్‌లో ఉంచాలి

ఆరోగ్య సంరక్షణ వసతులను పెంచుకోవాలి

రిటైర్డ్‌ వైద్యులు, నర్సులను రంగంలోకి దింపాలి

ఇన్సాకాగ్‌ మాజీ ప్రధాన సలహాదారు సూచనలు

ప్రభుత్వ నిష్ర్కియతో మనస్తాపం.. రాజీనామా!


సైన్స్‌ అనేది.. రుజువుల ఆధారిత విధానాల రూపకల్పనను కోరుకుంటుంది. అంతే తప్ప.. విధానాల ఆధారిత రుజువుల తయారీని కాదు. దీన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రస్తుతం పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. ఇక చెప్పడానికి ఏమీ లేదు. ఇది పూర్తిగా వ్యవస్థ వైఫల్యమే.

- షాహిద్‌ జమీల్‌, ఇన్సాకాగ్‌ మాజీ ప్రధాన సలహాదారు


న్యూఢిల్లీ, మే 17: ముంచుకొస్తున్న కరోనా రెండో వేవ్‌ ముప్పు గురించి ఈ ఏడాది మార్చిలోనే హెచ్చరించినా.. ప్రభుత్వం పట్టించుకోలేదంటూ సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ) మాజీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు గుర్తుందా! దేశంలో వైరస్‌ కొత్త మ్యుటేషన్లపై అధ్యయనం చేసే ఇన్సాకాగ్‌ (ఇండియన్‌ సార్స్‌ కొవ్‌ 2 కన్సార్షియం ఆన్‌ జీనోమిక్స్‌) నిపుణుల బృందంలో ఆయన సభ్యుడు కూడా. అలాంటి ఇన్సాకాగ్‌కు సలహాలు ఇచ్చే అడ్వయిజరీ గ్రూప్‌లో ప్రధాన సలహాదారు షాహిద్‌ జమీల్‌ కూడా.. తమ పరిశోధనల ఫలితాలను పట్టించుకోని ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజీనామా చేశారు! అది కూడా.. గత శుక్రవారంనాడు ఇన్సాకాగ్‌ సమావేశం జరుగుతుండగా.. ఉన్నట్టుండి తాను ప్రధాన సలహాదారు పదవి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు! ఈ విషయాన్ని ఆ భేటీలో పాల్గొన్న ఆయన సహచర శాస్త్రవేత్త తెలిపారు. కరోనా సెకండ్‌ వేవ్‌ను నిరోధించే విషయంలో ప్రభుత్వ ఉదాసీనత.. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా విధానాల రూపకల్పనకు రాజకీయ నాయకుల నుంచి వ్యక్తమైన మొండి వ్యతిరేకతతో విసిగిపోయినందువల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం తోటి శాస్త్రజ్ఞుల్లో వినిపిస్తోంది. నాయకుల మొండి వ్యతిరేకతపై.. కొద్దిరోజుల క్రితమే ఆయన ఒక వార్తాసంస్థకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.


మహమ్మారి నియంత్రణలో విఫలమైన ప్రభుత్వ వ్యవహారశైలిపై ఆ వ్యాసంలో ఆయన పలు పరోక్ష విమర్శలు చేశారు. అంతేకాదు.. ఏం చేస్తే భారతదేశం ఈ ముప్పు నుంచి బయటపడుతుందో తెలిపే అమూల్యమైన సూచనలు కూడా చేశారాయన. వ్యాక్సినేషన్‌ ఇలాగే కొనసాగితే.. అందునా, ఇప్పుడున్నంత భారీస్థాయిలో వైరస్‌ వ్యాప్తి చెందుతున్న దశలో ఇంత నెమ్మదిగా టీకాలు వేస్తే వైర్‌సను అడ్డుకోవడం కష్టమని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. రోజుకు 75 లక్షల నుంచి కోటి మందికి టీకాలు ఇస్తే తప్ప ఈ ముప్పు నుంచి తప్పించుకోలేమని తేల్చిచెప్పారు. ‘‘నా పరిశీలన ప్రకారం.. ప్రస్తుతం దేశంలో తీవ్ర ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే వేరియంట్లు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. 


ఈ ముప్పును ఎదుర్కోవడంతో పాటు భవిష్యత్తులో వచ్చే మరిన్ని వేవ్‌లను తట్టుకోవాలంటే.. వ్యాక్సినేషన్‌ ఇప్పుడున్న వేగంతో (రోజుకు 20 లక్షల డోసులు) చేస్తే సరిపోదు. మనదేశంలో వైరస్‌ ఈ ఏడాది మొదటి నుంచి మ్యుటేట్‌ అవుతూ వస్తోంది. మరింత తీవ్ర ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలను, వ్యాక్సిన్‌ ద్వారా గానీసహజ ఇన్ఫెక్షన్‌ ద్వారా గానీ కరోనా వైర్‌సపై పోరాడగల ఇమ్యూనిటీని తప్పించుకునే సామర్థ్యాన్ని సంతరించుకోవడమే ఈ మ్యుటేషన్ల లక్ష్యం.’’ అని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్నవారికి వైరస్‌ సోకితే దాన్ని బ్రేక్‌ త్రూ ఇన్ఫెక్షన్‌ అంటారు. ప్రస్తుతం దేశంలో బి.1.617.2 వేరియంట్‌కు ఆ లక్షణం ఉన్నట్టుగా శాస్త్రజ్ఞులు అనుమానిస్తున్నారు. కాగా.. దేశంలో మూడో వేవ్‌ అంటూ వస్తే పతాకస్థాయిలో ఎన్నికేసులు వస్తాయో అంచనా వేయడం కూడా కష్టమేనని, అదే తనకు ఆందోళన కలిగిస్తోందని జమీల్‌ పేర్కొన్నారు. 


ఇలా చేస్తే చెక్‌

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను కాపాడే ప్రధాన ఉపకరణాలు.. టీకాలేనని జమీల్‌ తేల్చిచెప్పారు. వ్యాక్సినేషన్‌ ఎంత వేగంగా చేస్తే కరోనా వ్యాప్తి అంత గణనీయంగా తగ్గుతుందని ఆయన పేర్కొంటున్నారు. అయితే.. వ్యాక్సిన్లు ఇన్ఫెక్షన్ల తీవ్రతను తగ్గిస్తాయే తప్ప ఇన్ఫెక్షన్‌ రాకుండా అడ్డుకోలేవని గుర్తుంచుకోవాలి. మరీ ముఖ్యంగా.. వైరస్‌ వ్యాప్తి అత్యధికస్థాయిలో ఉన్న ప్రస్తుత దశలో ఇన్ఫెక్షన్లను నిరోధించడం కష్టమే. నిర్దిష్టమైన సమాచారం లేనప్పటికీ.. వ్యాక్సిన్‌ రక్షణను సైతం తప్పించుకోగల సామర్థ్యం కొత్త వేరియంట్లకు ఉంటోంది. టీకాలు వేయించుకున్నవారిలోనూ బ్రేక్‌ త్రూ ఇన్ఫెక్షన్లు రావడంలో అవే కీలకపాత్ర పోషిస్తున్నాయని జమీల్‌ స్పష్టం చేశారు.  ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఏమేం చేయాలో కూడా ఆయన సూచించారిలా..

  • దేశవ్యాప్తంగా పరీక్షల సంఖ్య భారీగా పెంచాలి. పాజిటివ్‌గా తేలినవారిని త్వరగా ఐసోలేట్‌ చేయాలి. 
  • దేశంలో చాలా రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌లో ఉన్నాయి. దీనివల్ల వైరస్‌ వ్యాప్తి నిలకడగా ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ విభాగాలు, టీకా, ఔషధాల సరఫరా విభాగాలు మళ్లీ శక్తిని ప్రోది చేసుకోవడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. 
  • ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచుకోవడం వల్ల కూడా ప్రాణాలను కాపాడవచ్చు. 
  • దేశంలో పెద్ద ఎత్తున తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేయడం ద్వారాపడకలను అందుబాటులోకి తేవాలి. 
  • పదవీవిరమణ చేసిన వైద్యులను, నర్సులను మళ్లీ రంగంలోకి దింపాలి. కీలకమైన ఔషధాలు, ఆక్సి.జన్‌కు సంబంధించిన సరఫరా చెయిన్‌ను బలోపేతం చేయాలి.
  • ఇవన్నీ ఒక పక్కన చేస్తూనే.. వ్యాక్సినేషన్‌ వేగాన్ని పెంచాలి. ఇప్పుడున్న వేగంతో టీకా కార్యక్రమాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించరాదు. ఎట్టిపరిస్థితుల్లోనూ.. రోజుకు 75 లక్షల నుంచి కోటి మందికి వ్యాక్సిన్‌ వేసి తీరాలి. ఇందుకోసం టీకాల సరఫరాను పెంచుకోవాల్సి ఉంటుంది. డెలివరీ పాయింట్లను రెట్టింపు చేసుకోవాలి. అంతేకాదు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 50 వేల వ్యాక్సిన్‌ కేంద్రాలే ఉన్నాయి. వాటి సంఖ్యను బాగా పెంచాల్సిన అవసరం ఉంది. వీటిలోనూ ప్రైవేటు కేంద్రాలు కేవలం 3 శాతమే ఉన్నాయి. వాటి సంఖ్యను కూడా పెంచాలి.


అదో సమస్య..

దేశంలో వైరస్‌ ఉధృతికి అడ్డుకట్ట వేయడానికి తాను చేసిన ఈ సూచనలన్నింటికీ తన తోటి శాస్త్రజ్ఞులందరి మద్దతూ ఉందని జమీల్‌ పేర్కొన్నారు. వైర్‌సకు సంబంధించిన సమాచారాన్ని తమకు అందుబాటులో ఉంచాలని.. తద్వారా మరింత అధ్యయనం చేసి, రాబోయే ప్రభంజనాలను అంచనా వేసి, వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చంటూ 800 మంది భారత శాస్త్రజ్ఞులు ప్రధాని మోదీకి ఏప్రిల్‌ 30న లేఖ రాసిన విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. కానీ.. అందుబాటులో ఉన్న రుజువుల ఆధారంగా విధానాలు రూపొందించడానికి (రాజకీయ నాయకత్వం నుంచి) మొండి వ్యతిరేకతను వారు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. అంతేకాదు.. సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న మరో అతి పెద్ద సమస్య అని కూడా జమీల్‌ పేర్కొన్నారు. కాగా..  ఈ ప్రభుత్వ హయాంలో వృత్తినిపుణులకు చోటు లేదంటూ మోదీ సర్కారుపై కాంగ్రెస్‌ పార్టీ నిప్పులు చెరిగింది.


‘‘దేశంలోనే అత్యుత్తమ వైరాలజిస్టుల్లో ఒకరైన డాక్టర్‌ షాహిద్‌ జమీల్‌ రాజీనామా దురదృష్టకరం. ఎలాంటి బెరుకూ లేకుండా, ఎవరిపట్లా పక్షపాత ధోరణితో వ్యవహరించకుండా స్వేచ్ఛగా మాట్లాడే వృత్తినిపుణులకు మోదీ ప్రభుత్వంలో చోటు లేదు’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ట్వీట్‌ చేశారు. ‘ఈ అజ్ఞానం వల్ల భారత దేశం ఇంకా ఎన్నాళ్లు బాధపడాలి?’’ అని కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా కేంద్రాన్ని నిలదీసింది. కాగా.. రాబోయే విపత్తుపై ఇన్సాకాగ్‌ మార్చిలోనే ప్రధానిని హెచ్చరించినా పట్టించుకోలేదని, ప్రభుత్వం సైన్స్‌ను పరిగణనలోకి తీసుకోవట్లేదని జమీల్‌ స్పష్టంగా చెప్పారని.. మోదీ సైంటిఫిక్‌ నిరక్షరాస్యతకు మనం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ధ్వజమెత్తారు.

Updated Date - 2021-05-18T07:21:52+05:30 IST