ప్రపంచ వాణిజ్య నాడి ‘సూయజ్‌’!

ABN , First Publish Date - 2021-03-28T07:56:36+05:30 IST

సూయజ్‌ను ప్రపంచ వాణిజ్య నాడిగా వర్ణించడం సరైనదే. తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ఈ కాలువ అంత కీలకంగా మారింది మరి! దీన్ని తవ్వక ముందు ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి దక్షిణాఫ్రికా వద్ద కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ సమీపం నుంచి నౌకలు

ప్రపంచ వాణిజ్య నాడి ‘సూయజ్‌’!

భారత్‌ వాణిజ్యం రూ.14 లక్షల కోట్లు 

పలు వస్తువుల ధరలు పెరిగే చాన్స్‌ 

పరిష్కారానికి భారత్‌ 4 సూచనలు

ప్రపంచ వాణిజ్య నాడి ‘సూయజ్‌’!

12శాతం సరుకు ఈ కాలువ మీదుగానే!.. ఒకరోజు రవాణా నిలిస్తే.. రూ. 75వేల కోట్ల సరుకుపై ప్రభావం


సూయజ్‌ కెనాల్‌. ప్రపంచ వాణిజ్యానికి ఇది ఆయువు పట్టు. ఈనెల 23న నౌక అడ్డుపడటంతో ఈ మార్గంలో ప్రయాణించాల్సిన అనేక నౌకలు నిలిచిపోయాయి. మొత్తం ప్రపంచ వాణిజ్యంలో 12ు సరకు రవాణా దీని ద్వారానే జరుగుతుండటం గమనార్హం. ప్రస్తుత అడ్డంకి కారణంగా రోజుకు రూ. 75వేల కోట్ల విలువైన సరుకు నిలిచిపోతోందని అంచనా. అగ్రరాజ్యాలుగా భావించే అమెరికా, ఐరోపా దేశాలతో పాటు ఇటు తూర్పు దేశాలకు కూడా ఎగుమతులు, దిగుమతుల్లోనూ, ఇంధన సరఫరాలోనూ సూయజ్‌ కెనాల్‌ది కీలక పాత్ర. అందుకే.. ఈ కాలువలో నౌక అడ్డం తిరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.


సెంట్రల్‌ డెస్క్‌:

సూయజ్‌ను ప్రపంచ వాణిజ్య నాడిగా వర్ణించడం సరైనదే. తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ఈ కాలువ అంత కీలకంగా మారింది మరి! దీన్ని తవ్వక ముందు ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి దక్షిణాఫ్రికా వద్ద కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ సమీపం నుంచి నౌకలు ప్రయాణించేవి. అయితే.. మధ్యధరా సముద్రం నుంచి అరేబియా సముద్రం వరకూ ఈజిప్టు మీదుగా ఒక కాలువను తవ్వితే రవాణాకు చాలా లాభదాయకంగా ఉంటుందన్న ఆలోచనతో 1859లో సూయజ్‌ కాలువ నిర్మాణాన్ని చేపట్టారు. పదేళ్ల అనంతరం 1869లో దీన్ని ప్రారంభించారు. కేవలం 194 కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువ, ఆసియా, ఐరోపా ఖండాల మధ్య అతి దగ్గరి సముద్ర మార్గం. దీని వలన ఐరోపా దేశాలకు 8900 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గింది. సుమారు 10రోజుల సమయం, ఆ ప్రయాణానికి తగ్గ ఇంధనం నౌకలకు ఆదా అవుతోంది. ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్తే నౌకకు అదనంగా 800 టన్నుల ఇంధనం ఖర్చు అవుతుంది. ఒక నౌకకు అయ్యే మొత్తం ఖర్చులో 60శాతం ఇంధనానిదే. దీంతో ఆ భారం వస్తువుల ధరపైనే పడుతుంది. తద్వారా సరుకుల ధరలూ పెరుగుతాయి. ప్రయాణ సమయం సైతం 3వారాలు అదనంగా పెరుగుతుంది. ఇలాంటి కష్టాలన్నింటినీ సూయజ్‌ కాలువ తీర్చింది. చరిత్రలోనూ సూయజ్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. కాలువ తెరిచే నాటికే భారత్‌పై బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ ఆధిపత్యం సాధించినప్పటికీ.. భారత్‌ నుంచి దోచుకున్న సంపద, సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసేందుకు, యూకే నుంచి సైన్యాన్ని సులువుగా భారత్‌కు తీసుకురావడానికి సూయజ్‌ కాలువ బ్రిటిషర్లకు ఉపయోగపడింది.


నౌక ఎలా నిలిచిపోయింది?

జపాన్‌కు చెందిన ‘ఎవర్‌ గివెన్‌’ అనే నౌక ఈ నెల 23న సూయజ్‌ కాలువకు అడ్డం పడింది. దీని పొడవు 400 మీటర్లు. దాదాపు ఒక ఆకాశ హర్మ్యం అంత ఎత్తు ఉంటుంది. కాలువకు దగ్గరిలో ఎడారి ఉండటంతో నిరంతరం ఇసుకు తుఫాన్లు దాడి చేస్తుంటాయి. అలాంటి ఓ భారీ తుఫాను ధాటికి ఇంతటి భారీ నౌక కూడా ఓ వైపునకు తిరిగిపోయింది. ఒడ్డున ఉన్న ఇసుకలో కూరుకుపోయి, కాలువ మార్గానికి అడ్డుగా నిలిచిపోయింది. అసలే భారీ నౌక, దానికి తోడు అంతకు అంతా బరువైన సరుకు. దీంతో.. దీన్ని కదల్చడం తలకు మించిన పనిగా మారింది. సమస్య పరిష్కారమయ్యేందుకు సుమారు 3 నుంచి 4వారాలు పట్టొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఒడ్డున నౌక కింది భాగంలో ఉన్న ఇసుకను తవ్వి, తిరిగి కాలువలోకి పంపించాలని యత్నిస్తున్నారు. మరోవైపు ఇతర నౌకలతో దీన్ని బయటికి లాగేందుకూ కృషి చేస్తున్నారు. ఇవేవీ ఫలించకపోతే.. నౌకలోని సరుకు మొత్తాన్ని దించేసి, నౌక బరువు తగ్గించిన తర్వాత మళ్లీ బయటికి లాగే యోచన కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నౌకలో ఉన్న 25మంది సిబ్బంది భారతీయులే కావడం గమనార్హం. ఇక ఇక్కడ పూర్తిగా నిలిచిపోయిన పలు దేశాలకు చెందిన సుమారు 350 నౌకల సరుకు వాటి గమ్యస్థానాలకు చేరక, ఆయా వస్తువులకు డిమాండ్‌ విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. 


గతంలోనూ పలుమార్లు నిలిచిన రవాణా

సూయజ్‌ కెనాల్‌లో నౌకల రద్దీ నిలిచిపోవడం ఇదే తొలిసారి కాదు. 1967లో ఈజిప్టు, ఇజ్రాయెల్‌కు మధ్య యుద్ధ సమయంలో ఈజిప్టు రవాణాను నిలిపివేసింది. అప్పటికే కాలువలో ప్రవేశించిన 14నౌకలు ఎక్కడివి అక్కడే ఏకంగా 8ఏళ్ల పాటు ఆగిపోయాయి. ఎట్టకేలకు 1975లో తిరిగి కాలువను ఈజిప్టు తెరిచింది. గడచిన 20 ఏళ్లలో చూస్తే.. 2004లో ట్రాపిక్‌ బ్రిలియన్స్‌ అనే నౌక కాలువలో చిక్కుకోవడంతో 3రోజుల పాటు, 2017లో ఓ జపాన్‌ నౌక చిక్కుకోవడంతో కొన్ని గంటలపాటు రవాణా నిలిచిపోయింది. 



సూయజ్‌ వివరాలు

  • సూయజ్‌ కెనాల్‌ పొడవు: 193.3 కి.మీ.
  • లోతు: 78 అడుగులు
  • వెడల్పు: నీటి అడుగున 21 మీటర్లు, 
  • ఉపరితలంపై 60 నుంచి 90 అడుగులు
  • నిర్మాణం ప్రారంభించిన రోజు: 25-09-1859
  • కెనాల్‌ను ప్రారంభించిన రోజు: 17-11-1869
  • రోజూ ప్రయాణించే నౌకలు: సగటున 51


భారత్‌పైనా ప్రభావం

ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భారత్‌పైనా సూయజ్‌ ప్రభావం తప్పదు. ముఖ్యంగా.. భారత్‌ నుంచి అనేక ఎగుమతులు, దిగుమతులు కాలువ ద్వారా వెళ్తుంటాయి. అవన్నీ నిలిచిపోవడం భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికర పరిణామమే. నూనె, గృహోపకరణాలు, పత్తి, ఆటో పరిశ్రమ ఉత్పత్తులు, యంత్రాల విడిభాగాలు వంటివి ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలకు ఎగుమతి అవుతుంటాయి. ఉక్కు ఉత్పత్తులు, తుక్కు, పలు యంత్రాల విడిభాగాలు, రసాయనాలు వంటివి దిగుమతి అవుతుంటాయి. ఏటా సూయజ్‌ కెనాల్‌ ద్వారా భారత్‌ దాదాపు రూ. 14 లక్షల కోట్ల మేర వాణిజ్యం సాగిస్తోంది. ప్రస్తుత సమస్య కారణంగా 5 నుంచి 15శాతం మేర పలు ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్స్‌, ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పత్తుల ధరలు పెరగవచ్చు. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు నాలుగు పాయింట్ల ప్రణాళికను భారత్‌ రచించింది. ఎక్కువ కాలం నిల్వ ఉండని సరుకు ఉన్న నౌకల్ని అంచనా వేసి తొలుత వాటిని తరలించడం, తొలుత మాట్లాడుకున్న ధరలకే సరుకు ధరలు ఉండేలా రవాణాలో భాగస్వాములందరితో చర్చలు జరపడం, ధరల విషయంలో నిలకడను ప్రదర్శించాలని షిప్పింగ్‌ సంస్థలకు విజ్ఞప్తి చేయడం, 15రోజుల అదనపు సమయం తీసుకున్నప్పటికీ.. ఆఫ్రికా చుట్టూ నౌకల్ని తీసుకురావడం. ఇలా ఈ నాలుగు పాయింట్ల ప్రణాళికను అమలు చేసి, పరిస్థితిని సాధారణ స్థితిలోనే ఉంచాలని భారత్‌ భావిస్తోంది. 

Updated Date - 2021-03-28T07:56:36+05:30 IST