తగ్గుతున్న బాలికల సంఖ్య

ABN , First Publish Date - 2022-01-19T05:23:56+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లాలో బాలికల సంఖ్య తగ్గిపోతోంది. తమ వంశానికి, ఆస్తికి వారసుడు కావాలన్న ఆకాంక్షతో ఎక్కువ మంది మగ పిల్లలపైనే మక్కువ చూపుతున్నారు.

తగ్గుతున్న బాలికల సంఖ్య
గద్వాలలోని ఓ స్కానింగ్‌ కేంద్రంలో వివరాలను పరిశీలిస్తున్న వైద్యసిబ్బంది (ఫైల్‌)

- వెయ్యి మంది బాలురు ఉంటే 930 మంది బాలికలు 

- గుట్టుగా కొనసాగుతున్న లింగనిర్ధారణ పరీక్షలు

గద్వాల క్రైం, జనవరి 18 : జోగుళాంబ గద్వాల జిల్లాలో బాలికల సంఖ్య తగ్గిపోతోంది. తమ వంశానికి, ఆస్తికి వారసుడు కావాలన్న ఆకాంక్షతో ఎక్కువ మంది మగ పిల్లలపైనే మక్కువ చూపుతున్నారు. ఆడపిల్లలపై వివక్ష చూపుతున్నారు. ఇదే అదనుగా జిల్లాలోని కొన్ని స్కానింగ్‌ కేంద్రాల్లో రహస్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని పుట్టబోయేది అడో, మగో చెప్తున్నారు. ఒక వేళ ఆడ పిల్ల అయితే అబార్షన్‌ చేయించుకుంటున్నారు. దీంతో జిల్లాలో బాలికల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 2019, ఏప్రిల్‌ నుంచి 2020, మార్చి వరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రవేట్‌ ఆసుపత్రిలో 4,831 మంది మగ పిల్లలు జన్మించగా, 4,597 మంది ఆడపిల్లలు పుట్టారు. బాలబాలికల నిష్పత్తి 1000కి 952 ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి వరకు 4,926 మంది మగ, 4,622 ఆడపిల్లలు పుట్టారు. వీరి నిష్పత్తి 1000కి 938గా ఉంది. 2021, ఏప్రిల్‌ నుంచి 2022 జనవరి 13 వరకు 3,743 మంది మగ, 3,481 ఆడ పిల్లలు జన్మించగా, నిష్పత్తి 1000కి 930 ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలో ఆడ పిల్లల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు స్పష్టమవు తోంది. ఇటీవల మంత్రి హరీశ్‌రావు జిల్లాలో పర్యటిం చిన సందర్భంగా వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించా రు. అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.


స్కానింగ్‌ కేంద్రాల్లో అక్రమాలు

జిల్లాలో జిల్లాలో 25 ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్లు న్నాయి. అందులో జిల్లా కేంద్రంలో మూడు కేంద్రాలు, అలంపూర్‌లో ఒక కేంద్రం పని చేయడం లేదు. మరో రెండు స్కానింగ్‌ సెంటర్లు మూడపడ్డాయి. ప్రస్తుతం 19 స్కానింగ్‌ కేంద్రాలు కొనసాగుతున్నాయని వైద్యులు తెలిపారు. వీటితో పాటు గద్వాల పట్టణంలో అనుమతి లేకుండా రెండు స్కానింగ్‌ సెంటర్లు కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే కొందరు స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు కాసులకు కక్కుర్తి పడి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. పుట్టబోయేది ఆడో, మగో చెప్పినందుకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకుంటున్నట్లు తెలి సింది. ఒక వేళ ఆడపిల్ల అయితే అబార్షన్‌ చేయించు కుంటున్నట్లు ఆరోపణలున్నాయి. కొన్ని ప్రవేట్‌ ఆసుపత్రులతో పాటు కొందరు ఆర్‌ఎంపీ వైద్యులు ఇలా అబార్షన్లు చేస్తున్నట్లు సమాచారం. కొందరు కమీషన్‌ తీసుకొని గర్భిణులను కర్నూల్‌కు తీసుకెళ్లి అక్కడి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అబార్షన్లు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని గట్టు, ధరూర్‌, కేటీదొడ్డి, శాంతినగర్‌, ఉండవెల్లి, అయిజ తదితర ప్రాంతాలలో ఇలా అబార్షన్లు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసింది. 


గతంతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నది

డాక్టర్‌ చందూనాయక్‌, డీఎంహెచ్‌వో : గతంలో కంటే ఇప్పుడు బాలికల సంఖ్య పెరుగుతోంది. ఐదారేళ్ల క్రితం 1000 మంది బాలురకు, 866 మంది బాలికలు ఉండేవారు. ఎవరైనా లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్య లు తీసుకుంటాం. అబార్షన్లు చేయకుండా ఎప్పటికప్పుడు నిఘాను పెంచాం. ప్రతీ నెల స్కానింగ్‌ సెంటర్లను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నాం. అనుమతి లేని స్కానింగ్‌ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఒక స్కానింగ్‌ సెంటర్‌కు షోకాజ్‌ నోటీసులు అందించాం. 

Updated Date - 2022-01-19T05:23:56+05:30 IST