థర్డ్ వేవ్ లేకపోతే జీడీపీ దూకుడు : ప్రిన్సిపల్ ఎకనమిక్ అడ్వయిజర్

ABN , First Publish Date - 2021-09-19T00:18:20+05:30 IST

భారత దేశ ద్రవ్య స్థితి బలంగా ఉందని, వృద్ధిని పెంచేందుకు

థర్డ్ వేవ్ లేకపోతే జీడీపీ దూకుడు : ప్రిన్సిపల్ ఎకనమిక్ అడ్వయిజర్

న్యూఢిల్లీ : భారత దేశ ద్రవ్య స్థితి బలంగా ఉందని, వృద్ధిని పెంచేందుకు తగినట్లుగా ఉందని ప్రిన్సిపల్ ఎకనమిక్ అడ్వయిజర్ సంజీవ్ సన్యాల్ చెప్పారు. ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వృద్ధిని వేగవంతం చేయడానికి తగిన ద్రవ్య పరిస్థితులు మన దేశంలో ఉన్నాయన్నారు. కోవిడ్-19 సంబంధిత ఆంక్షలు క్రమంగా సడలుతున్నందువల్ల వినియోగదారుల డిమాండ్ పుంజుకుందని చెప్పారు. సరఫరా రంగంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు.


గడచిన 18 నెలలు చాలా గంభీరంగా గడిచిందన్నారు. ప్రతి ఫండమెంటల్ వేవ్‌లోనూ మనపై గట్టి దెబ్బ పడిందన్నారు. దీని వల్ల ముఖ్యంగా చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయని చెప్పారు. 2020లో దేశవ్యాప్తంగా విధించిన అష్ట దిగ్బంధనం ఆంక్షల వల్ల ఆర్థిక వ్యవస్థపైనా, వ్యాపారాలపైనా పెను ప్రభావం పడిందని తెలిపారు. అయితే కరోనా వైరస్‌తో పోరాడటం కోసం క్వారంటైన్ ఫెసిలిటీస్, టెస్టింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటుకు ప్రభుత్వానికి సమయం దొరికిందని చెప్పారు. క్రమంగా ఈ వైరస్‌ను ఎదుర్కొనడంపై భారత దేశానికి విశ్వాసం పెరిగిందని, పరిస్థితులు నెమ్మదిగా చక్కబడుతున్నాయని తెలిపారు. 


అక్టోబరు నుంచి మార్చి మధ్యలో ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుందని చెప్పారు. ఆ తర్వాత కోవిడ్-19 సెకండ్ వేవ్ దెబ్బతీసిందన్నారు. ఏప్రిల్-జూన్ మధ్యలో ఆరోగ్య రంగంపై భారీగా ఖర్చు చేయవలసి వచ్చిందని తెలిపారు. అయితే ఆర్థిక వ్యయం తక్కువేనని, క్వారంటైన్ ఫెసిలిటీస్‌ను వికేంద్రీకరించారని, దేశవ్యాప్త లాక్‌డౌన్లు లేవని తెలిపారు. 


ప్రజలకు అనుమతి ఇచ్చిన రంగాల్లో వినియోగదారుల డిమాండ్ బలంగా పుంజుకోవడం శుభవార్త అని తెలిపారు. అవసరమైతే అందుబాటులోకి తేవడానికి తగిన ఆర్థిక వనరులు భారత దేశానికి ఉన్నాయన్నారు. ఎగుమతులు చాలా బాగున్నాయని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బలంగా ఉన్నాయని, విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఆల్‌టైం హైలో ఉన్నాయని చెప్పారు. ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ, నియంత్రణలోనే ఉందని వివరించారు. థర్డ్ వేవ్ రాకపోతే, ఈ ఏడాది జీడీపీ వృద్ధి రెండు అంకెల్లో ఉండటం మాత్రమే కాకుండా, వచ్చే సంవత్సరం కూడా అదేవిధంగా రెండంకెల వృద్ధి కొనసాగుతుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. 


Updated Date - 2021-09-19T00:18:20+05:30 IST