మాపై దాడి జరిగితే.. మేమే ఆధారాలివ్వాలా?

ABN , First Publish Date - 2021-04-17T06:57:23+05:30 IST

‘మాపై దాడి జరిగితే.. దాడిచేసినవారి వివరాలు, ఆధారాలు మేమే పోలీసులకు ఇవ్వాలా? ఇదేం తీరు’ అని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

మాపై దాడి జరిగితే.. మేమే ఆధారాలివ్వాలా?
టీడీపీ నాయకులతో కలిసి వెస్ట్‌ పోలీస్‌స్టేషన్‌కొచ్చిన నరసింహయాదవ్‌

రాళ్లదాడిపై పోలీసులతో టీడీపీ నేత  నరసింహయాదవ్‌  


తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్‌ 16: ‘మాపై దాడి జరిగితే.. దాడిచేసినవారి వివరాలు, ఆధారాలు మేమే పోలీసులకు ఇవ్వాలా? ఇదేం తీరు’ అని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని కృష్ణాపురం ఠాణా వద్ద ఈనెల 12వ తేదీన నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు సభపై రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిపై నరసింహయాదవ్‌ అదేరోజు రాత్రి చంద్రబాబు సమక్షంలో అర్బన్‌జిల్లా అదనపు ఎస్పీ సుప్రజకు ఫిర్యాదు చేశారు. వెస్ట్‌ పోలీసులు కేసు నమోదు చేశాక, దాడిపై ఆధారాలు ఇవ్వాలని నరసింహ యాదవ్‌కు నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆయన వెస్ట్‌ పోలీసు స్టేషన్‌కొచ్చారు. దాడికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని సీఐ శివప్రసాద్‌ సూచించగా, రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా స్టేషన్‌ వెలుపల నరసింహయాదవ్‌ మీడియాతో మాట్లాడారు. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రిపూట చీకట్లో టీడీపీ సభపై రాళ్లతో దాడి చేయగా, ముగ్గురు కార్యకర్తలకు గాయాలయ్యాయని చెప్పారు. కార్యకర్తలపై పడిన రాళ్లు, గాయపడిన కార్యకర్తలను 12వ తేదీ రాత్రే పోలీసులకు అప్పగించామన్నారు. గాయపడ్డ కార్యకర్తలకు ఎం.ఎల్‌.సీ కూడా చేయించార న్నారు. కానీ ఆ తర్వాత రెండ్రోజుల్లోపు ఆధారాలు సమర్పించాలని పోలీసులు తనకు నోటీసులు జారీ చేశారన్నారు. తాను స్థానికంగా లేని కారణంగా, నోటీసుకు బదులు ఇవ్వక పోవడంతో సెక్షన్‌ 90, 91 కింద ఆధారాలు ఇవ్వాలని పోలీసులు మరో నోటీసు ఇచ్చారన్నారు. దీనికి సంబంధించిన వివరణను లాయర్ల సమక్షంలో పోలీసులకు సమర్పించానన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలే దాడికి పాల్పడి ఉంటారని తాము పదేపదే చెప్తున్నా.. పోలీసులు వారిలో ఏ ఒక్కరినీ విచాకుండానే, తమకు మాత్రం నోటీసులు జారీ చేస్తున్నారని వాపోయారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల అసంబద్ద పనితీరుకు అద్దం పడుతోందన్నారు. దర్యాప్తుచేసి పోలీసులే నిందితులను గుర్తించాలని స్పష్టం చేసినటు పేర్కొన్నారు. బాధితులు మరికొందరు ఉన్నారని, పోలీసుల తీరుతో వారు ముందుకు రావడానికి భయపడు తున్నారన్నారు. ఒత్తిడి ఉన్నా.. పోలీసులు ఇకనైనా తమ పనితీరు మార్చు కుని, నిందితులకు తగిన శిక్ష పడేలా చేయాలని కోరారు. ఆయనవెంట టీడీపీ నాయకుడు రవినాయుడు తదితరులున్నారు. 

Updated Date - 2021-04-17T06:57:23+05:30 IST