పక్కింటి పిల్లోడే కదా అని నమ్మితే..

ABN , First Publish Date - 2021-04-08T07:37:00+05:30 IST

ఆమె.. ఎంబీబీఎస్‌ చదువుతోంది! ఆ పిల్లాడు 9వ తరగతి విద్యార్థి. హైదరాబాద్‌లోని ఒక కాలనీలో ఇద్దరూ పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నారు.

పక్కింటి పిల్లోడే కదా అని నమ్మితే..

  • ఎంబీబీఎస్‌ యువతికి 9వ క్లాస్‌ బాలుడి ఝలక్‌
  • ఫోన్‌ తీసుకుని ఈమెయిల్‌ పాస్‌వర్డ్‌ మార్పు
  • ఆమె ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో అశ్లీల చిత్రాలు
  • ఆధారాలతో ఆట కట్టించిన పోలీసులు
  • నేరం అంగీకరించిన బాలుడు.. జువెనైల్‌ హోమ్‌కు తరలింపు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): ఆమె.. ఎంబీబీఎస్‌ చదువుతోంది! ఆ పిల్లాడు 9వ తరగతి విద్యార్థి. హైదరాబాద్‌లోని ఒక కాలనీలో ఇద్దరూ పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నారు. తమ్ముడి వయసున్నవాడు, పైగా పక్కింటి పిల్లోడే కదా అనుకుని అమాయకంగా తన ఫోన్‌ను అతడికి ఇచ్చేదామె. ఒకానొక ఫైన్‌ మార్నింగ్‌.. ఫోన్‌లో ఆమె మెయిల్‌ ఐడీ పాస్‌వర్డ్‌ను మార్చేశాడా అబ్బాయి. అక్కణ్నుంచీ ఆమె పేరుతో ఆన్‌లైన్‌ క్లాసుల్లో అసభ్య సందేశాలు పెట్టడం.. ఆమె ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో అశ్లీలచిత్రాలు పోస్ట్‌చేయడం వంటి చర్యలతో ఆమెను మానసికంగా చిత్రహింసకు గురిచేశాడు. ఈ విషయం తెలియని ఆ యువతి.. తన ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు హ్యాక్‌ అయ్యాయంటూ అతడి దగ్గరే తన గోడు వెళ్లబోసుకునేది. ఆమె అలా బాధపడినప్పుడల్లా అతడు కూడా.. తన అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పేవాడు. ఈ మానసిక వేదనను చాలా రోజులపాటు భరించిన ఆ యువతి ఇక తట్టుకోలేక సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది.


రంగంలోకి దిగిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల సాయంతో ఆ బాలుడి గుట్టు రట్టు చేశారు. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించాడు. ఇతరుల ఫోన్‌లు తీసుకొని వారి మెయిల్స్‌ ఓపెన్‌ చేయడం, పాస్‌వర్డులు మార్చడం, తర్వాత వేరే సిస్టంలో మెయిల్‌ ఓపెన్‌ చేసి అసభ్యకర మెసేజ్‌లు పంపడం తనకు అలవాటు అని చెప్పాడు. దీంతో బాలుణ్ని పోలీసులు జువెనైల్‌ హోమ్‌కు తరలించారు. కాగా.. తనతో స్నేహంగా ఉన్న పక్కింటి బాలుడే ఇలాంటి నీచమైన పనికి పాల్పడ్డాడని తెలియడంతో ఆ యువతి తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది.

Updated Date - 2021-04-08T07:37:00+05:30 IST