Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒక్కడే వెళ్తే.. వాడేయడమే!

  • చిరంజీవి తమ వైపేనని వైసీపీ ప్రచారం?
  • రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు అనుకూల పత్రికలో కథనం.. సోషల్‌ మీడియాలోనూ వైరల్‌
  • కాపుల్లో జగన్‌పై పూర్తి వ్యతిరేకత.. మతలబు చేయాలనే పై ఎత్తుగడ!
  • పవన్‌ అటున్నా.. మెగాస్టార్‌ తమవైపే ఉన్నట్లు చెప్పేందుకే ఈ వ్యూహం
  • చిరంజీవి తమ వైపేనని  వైసీపీ ప్రచారం?
  • రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు అనుకూల పత్రికలో కథనం
  • సోషల్‌ మీడియాలోనూ వైరల్‌
  • కాపుల్లో జగన్‌పై పూర్తి వ్యతిరేకత
  • మతలబు చేయాలనే పై ఎత్తుగడ!
  • చివరకు ఆయనే ఖండించినా.. ఉలుకూపలుకూ లేని వైసీపీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సినిమా పరిశ్రమ తరఫున అంటూనే ఆయన ఒంటరిగా వచ్చి కలిశారు. ఒంటరిగానే వచ్చారు కదా అని వైసీపీ వాడేసుకుంది. కాపు సామాజిక వర్గంలో తమపై పెల్లుబుకుతున్న వ్యతిరేకతను కొంతమేరకైనా తగ్గించేందుకు.. పవన్‌ కల్యాణ్‌ అటున్నా, చిరంజీవి ఇటున్నారనే సంకేతాలు పంపించేందుకు వచ్చిన అవకాశాన్ని అందుకోవాలని చూసింది. చిరంజీవికి రాజ్యసభ టికెట్‌ ఇవ్వనున్నట్లు తన అనుకూల మీడియాకు లీక్‌ చేసి కథనం రాయించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఒంటరిగా వస్తే ఎలా వాడేసుకుంటారో తత్వం బోధపడి.. చివరకు చిరంజీవే.. తాను రాజకీయాలకు దూరమని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. జగన్‌ ప్రభుత్వం ప్రకటించిన సినిమా టికెట్ల ధరలపై సినీ పరిశ్రమలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొందరు పెద్ద నిర్మాతలు తమ సినిమాలు వాయిదా వేసుకుంటున్నా.. ఇంకొందరు తప్పనిసరి పరిస్థితుల్లో విడుదల చేస్తున్నారు.


ఇటీవలే సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మకు, మంత్రి పేర్నికి మధ్య సోషల్‌ మీడియాలో చిన్నపాటి ప్రశ్నల యుద్ధం జరిగింది. అనంతరం వర్మ వచ్చి మంత్రిని కలిసి మాట్లాడి వెళ్లిపోయారు. ఇవన్నీ కొంత ఆసక్తి రేకెత్తించాయి. ఇంతలో చిరంజీవి ఆకస్మికంగా తాడేపల్లి వచ్చి సీఎం జగన్‌ను కలిశారు. సినిమా పరిశ్రమ తరఫునే వచ్చినట్లు ఆయన ప్రకటించారు. అయితే ఎందుకు కలిసినా దానిని వైసీపీ తనకు ప్రయోజనకరమైన రీతిలో మలచుకునేందుకు ఎత్తుగడ వేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు రాజ్యసభ టికెట్‌ ఇస్తారంటూ ప్రచారం జరిగేలా చేసింది. తనకు అనుకూలంగా ఉండే ఒక పత్రికలో ‘చిరంజీవికి రాజ్యసభ టికెట్‌.. మారనున్న ఏపీ రాజకీయాలు’ అనే అర్థం వచ్చేలా ఒక వార్తను వండి వార్చారు. దీనిని సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ చేశారు. వాస్తవానికి జగన్‌ ప్రభుత్వంపై కాపు సామాజిక వర్గం పూర్తి వ్యతిరేకతతో ఉందని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొంత వ్యతిరేకతను తగ్గించేందుకు, పవన్‌కు వ్యతిరేకంగా చిరంజీవి తమతో ఉన్నారని చెప్పడానికి రాజ్యసభ టికెట్‌ను తెరపైకి తెచ్చారని అంటున్నారు. 


తత్వం బోధపడిందా!

ఈ వ్యవహారంలో చిరంజీవికి కూడా తత్వం బోధపడినట్లే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి సినిమా పరిశ్రమ తరఫున మాట్లాడేందుకు వెళ్లడంలో తప్పు లేకపోయినా.. మాట్లాడడం మంచిదే అయినా.. మరికొందరు పెద్దలతో కలిసి వెళ్తే బాగుండేదేమోనని అంటున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తన ఒక్కడికే ఆహ్వానం పంపడంలోని ఆంతర్యాన్ని చిరంజీవి లోతుగా గ్రహించలేదేమోనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. చివరకు జరగని వ్యవహారాన్ని జరిగినట్లు చూపించేందుకు లీకులిచ్చిన వైనంపై చిరంజీవే స్పందించి.. తాను రాజకీయాలకు దూరమని ప్రకటించాల్సి వచ్చిందని.. సీఎంకు, తనకు మధ్య రాజకీయ చర్చ జరగనే లేదని, రాజ్యసభ అంశం అసలు రానేలేదని వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. వైసీపీ నేతలెవరూ దీనిపై స్పందించలేదు.


Advertisement
Advertisement