Abn logo
Sep 25 2021 @ 00:19AM

గెలుపంటే...గెలుపు...అంతే...!

జిల్లాలో ‘పరిషత్‌’ ఓటర్ల సంఖ్య 17,41,396, 

అధికారపార్టీకి పోలైనవి 5,95,985

గెలిచిన జడ్పీటీసీ అభ్యర్థులకు పోలైన ఓట్ల శాతం 34.22

పోటీలేని పోరు అయినా ఓట్లు అంతంతమాత్రమే

ఒంగోలు(జడ్పీ), సెప్టెంబరు 24: జిల్లాలో 41 జడ్పీటీసీల పరిధిలో మొత్తం 17,41,396 ఓట్లు ఉన్నాయి. అందులో గెలిచిన అధికారపార్టీ జడ్పీటీసీ అభ్యర్థులకు పడిన ఓట్లు 5,95,985. అంటే 34.22శాతం. ఇంత అత్తెసరు ఓట్ల శాతం అయితే ఏమిటీ 41 సీట్లు గెలిచాం కదా అనేది అధికారపార్టీ వాదన. ఇకపోతే పోలైన ఓట్లు 8,99,939. ప్రధాన ప్రతిపక్షం పోటీ నుంచి బహిష్కరించిన సరే గంపగుత్తగా ఇవన్నీ ఏమి అధికారపార్టీకి దక్కలేదు. పోలైన ఓట్లతో గెలిచిన జడ్పీటీసీ అభ్యర్థుల ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే అది 66.22కే పరిమితమైంది. మూడింట ఒకవంతు మంది ఓటర్లు మాత్రమే ఎన్నుకున్న జడ్పీటీసీలు వీరు. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో సాంకేతికంగా ఎవరికి ఓట్లు ఎక్కువగా వస్తే వారే విజేతలు. కానీ దాదాపు 66 శాతం మంది ఆమోదం లేకుండా ఎన్నికైన జడ్పీటీసీలు వీరంతా.. 

అధికారపార్టీ అభ్యర్థులకు  పోలైన ఓట్లు 5,95,985

జిల్లావ్యాప్తంగా ఎన్నికలు జరిగిన 41 జడ్పీటీసీలకుగాను 5,95,985 ఓట్లు అధికార పార్టీ అభ్యర్థులకు పోలయ్యాయి. మార్టూరు జడ్పీటీసీ చుండి సుగుణమ్మకు అత్యధికంగా 23,109 ఓట్లు పోలయ్యాయి. తర్వాతి స్థానాల్లో పామూరు జడ్పీటీసీ చప్పిడి సుబ్బయ్యకు 22,003 ఓట్లు, టంగుటూరు జడ్పీటీసీ మన్నం అరుణకుమారికి 20,371 ఓట్లు దక్కాయి. అత్యల్పంగా యద్దనపూడి జడ్పీటీసీ చుండి లక్ష్మి నారాయణమ్మకు 8,065 ఓట్లు దక్కగా, పీసీపల్లి జడ్పీటీసీ సభ్యురాలు పెద్దిరెడ్డి లక్ష్మీకాంతకు 9,359 ఓట్లు పడ్డాయి.

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం...

ఓట్ల పండగలో వీలైనంత ఎక్కువమంది ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఆ తీర్పునకు సార్థకత. ప్రజాస్వామ్య స్ఫూర్తి అనే మాటకు కూడా విలువ. స్వేచ్ఛాయిత వాతావరణంలో ఓటరు తనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవడమే నిజమైన ప్రజాస్వామ్యం. అత్యధిక ప్రజల భాగస్వామ్యం లేకుండా ఎన్నికలు జరగడం, ఆ తంతు ద్వారా విజేతలుగా ఆవిర్భవించి పాలన సాగించడం సాంకేతికంగా సరైనదే కావచ్చు కానీ మున్ముందు పొడచూపే పెడధోరణులకు ఇది ఆరంభం కాకూడదు. ఇలాంటి ఎన్నికలను ఇకముందెన్నడూ ప్రజాస్వామ్య భారతం చూడకూడదని మేధావులు, ప్రజాస్వామ్య హితులు ఆశిస్తున్నారు.