చాంపియన్‌కు షాక్‌!

ABN , First Publish Date - 2021-06-10T10:21:14+05:30 IST

అలవోక విజయాలతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ హాట్‌ ఫేవరెట్‌గా దూసుకెళ్తున్న మహిళల డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియటెక్‌కు షాక్‌ తగిలింది. క్వార్టర్స్‌లో గ్రీస్‌ భామ మరియా సక్కారి చేతిలో ఓడి టోర్నీ నుంచి...

చాంపియన్‌కు షాక్‌!

  • క్వార్టర్స్‌లో స్వియటెక్‌కు సక్కారి ఝలక్‌
  • సెమీస్‌లో నడాల్‌, సిట్సిపాస్‌, క్రెజికోవా 
  • ఫ్రెంచ్‌ ఓపెన్‌ 

పారిస్‌: అలవోక విజయాలతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ హాట్‌ ఫేవరెట్‌గా దూసుకెళ్తున్న మహిళల డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియటెక్‌కు షాక్‌ తగిలింది. క్వార్టర్స్‌లో గ్రీస్‌ భామ మరియా సక్కారి చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరో పోరులో అమెరికా టీనేజర్‌ కొకొ గాఫ్‌ను కంగుతినిపించి అన్‌సీడెడ్‌ బార్బొరా క్రెజికోవా సెమీస్‌ చేరింది. ఫైనల్‌ బెర్త్‌ కోసం సక్కారితో క్రెజికోవా, పావ్‌ల్యుచెన్‌కోవాతో తమార జిదాన్‌సెక్‌  తలపడనున్నారు. కాగా, ఈ నలుగురు క్రీడాకారిణులకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌ కావడం విశేషం. దీంతో మహిళల్లో ఈసారి కొత్త చాంపియన్‌ రానుంది. పురుషుల్లో 14వ క్లే కోర్ట్‌ టైటిల్‌ వేటలో ఉన్న డిఫెండింగ్‌ చాంప్‌ రఫెల్‌ నడాల్‌, ఐదో సీడ్‌ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ సెమీ్‌సలోకి అడుగుపెట్టారు. 


మహిళల సెమీస్‌లో ఎవరితో ఎవరు?

పావ్‌ల్యుచెన్‌కోవా x జిదాన్‌సెక్‌

మరియా సక్కారి x  క్రెజికోవా


ఎదురు లేదనుకుంటే..: మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్ల నిష్క్రమణతో ఇగా స్వియటెక్‌ ఈసారి టైటిల్‌ నిలబెట్టుకొంటుందని అంతా భావించారు. అయితే, ఈ పోలెండ్‌ స్టార్‌ జోరుకు ఊహించని రీతిలో బ్రేక్‌ పడింది. బుధవారం జరిగిన క్వార్టర్స్‌లో 8వ సీడ్‌ స్వియటెక్‌ 4-6, 4-6తో మరియా సక్కారి చేతిలో చిత్తయింది. తొలి సెట్‌ ఆరంభంలో స్వియటెక్‌ జోరుమీద కనిపించింది. రెండో గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్‌ చేసి 2-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే, సక్కారి కూడా సత్తాచాటుతూ 2-2తో సమం చేసింది. అక్కడి నుంచి ఆధిక్యం చేతులు మారుతూ ఇరువురూ 4-4తో సమంగా నిలిచారు. ఈ దశలో ఇగా సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన సక్కారి.. తర్వాతి గేమ్‌ను నెగ్గి 6-4తో సెట్‌ను కైవసం చేసుకొంది. ఇక, రెండో సెట్‌లో మరియా ఆధిపత్యమే ఎక్కువగా కనిపించింది. ఏకంగా 4-2తో పైచేయి సాధించింది. మధ్యలో స్వియటెక్‌ మెడికల్‌ బ్రేక్‌ తీసుకున్నా పుంజుకోలేక పోయింది. బలమైన గ్రౌండ్‌ స్ట్రోక్‌లతో డిఫెండింగ్‌ చాంప్‌ను ముప్పుతిప్పులు పెట్టిన సక్కారి 6-4తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొంది. సాధికార విజయంతో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ సెమీ్‌సకు దూసుకెళ్లింది. మరో క్వార్టర్స్‌లో 24వ సీడ్‌ కొకొ గాఫ్‌కు చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన అన్‌సీడెడ్‌ బార్బొరా క్రెజికోవా ఝలక్‌ ఇచ్చింది. గాఫ్‌ 6-7(6), 3-6తో క్రజికొవా (చెక్‌) చేతిలో పరాజయం పాలైంది. హోరాహోరీగా సాగిన తొలిసెట్‌ను ట్రైబేక్‌లో బార్బొరా సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్‌లో మరింత దూకుడుగా ఆడిన చెక్‌ ప్లేయర్‌ అలవోకగా 6-3తో నెగ్గి సెమీ్‌సకు చేరుకొంది. 

Updated Date - 2021-06-10T10:21:14+05:30 IST