దాడులు పట్టించుకోరా?

ABN , First Publish Date - 2021-01-17T05:08:51+05:30 IST

రాష్ట్రంలో హిందూ సమాజం దయనీయ స్థితిలో ఉందని, దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోదా అని కర్ణాటకలోని ఉడిపి ఫెజ్వర్‌ పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ ప్రశ్నించారు. విజయనగరంలోని రింగురోడ్డు వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

దాడులు పట్టించుకోరా?
మాట్లాడుతున్న విశ్వప్రసన్న తీర్థ ఫెజ్వర్‌ స్వామీజీ

 రామతీర్థం ఘటన బాధాకరం

విశ్వప్రసన్న తీర్థ ఫెజ్వర్‌ స్వామీజీ 

విజయనగరం రూరల్‌/ నెల్లిమర్ల/ దాసన్నపేట/ విజయనగరం క్రైం, జనవరి 16: రాష్ట్రంలో హిందూ సమాజం దయనీయ స్థితిలో ఉందని, దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోదా అని కర్ణాటకలోని ఉడిపి ఫెజ్వర్‌ పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ ప్రశ్నించారు. విజయనగరంలోని రింగురోడ్డు వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం  ఆయన విలేకర్లతో మాట్లాడారు. అంతర్వేది ఘటన.. దేవాలయాల్లో అర్చకులపై దాడులు, విగ్రహాల ధ్వంసాలు యథేచ్ఛగా జరుగుతుంటే.. ఆ స్థాయిలో ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. దేశంలో ఇటువంటి సంఘటనలు జరగకూడదని, దీనివల్ల మతసామరస్యానికి విఘాతం కలుగుతుందని చెప్పారు. రామతీర్థంలో జరిగిన సంఘటన బాధాకరమని చెప్పారు. ఇంత పెద్ద సంఘటనపై ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించకపోవడంతో భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకి లేఖ రాశానని, ఆ లేఖను విలేకర్ల ముందు విడుదల చేశారు. కాగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రజలంతా సహకరించాలని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మెంబరు కూడా అయిన విశ్వ ప్రసన్న తీర్థ ఫెజ్వర్‌ స్వామిజీ కోరారు. నిర్మాణానికి  విరాళాలు స్వచ్ఛందంగా, హృదయపూర్వకంగా ఇవ్వవచ్చునన్నారు. రూ.10 నుంచి ఈ విరాళాలు ఇవ్వవచ్చునన్నారు. ఈ నెల 15 నుంచి దేశ వ్యాప్తంగా విరాళాల సేకరణ ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా విజయనగరం వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సంపత్‌కుమార్‌ రూ.1 లక్ష విరాళం, అదే విధంగా జి.అన్నపూర్ణ రూ.1 లక్ష విరాళం, కె.నర్సింగరావు రూ.10 వేలు విరాళం స్వామిజీకి అందజేసి రశీదు పొందారు. సమావేశంలో ఎమ్మెల్సీ మాధవ్‌, ఉడిపి ఫెజావర్‌ మఠం ప్రతినిధులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

ఆలయ సంరక్షణ చర్యలు చేపట్టాలి

రామతీర్థం కొండపై ఆలయ సంరక్షణ  చర్యలు చేపట్టాలని ఉడిపి ఫెజ్వర్‌ పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ కోరారు. ఆయన శనివారం రామతీర్థం దేవాలయాన్ని, శ్రీరాముడి విగ్రహం ధ్వంసమైన కోదండరాముని ఆలయాన్ని సందర్శించారు. ఆలయ పరిసరాలతో పాటు ఆలయం లోపలి భాగాన్ని కూడా పరిశీలించారు. తిరిగి కొండదిగి ప్రధాన ఆలయంలోకి వెళ్లి సీతారాములను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. 

బీజేపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు

బీజేపీ నాయకులు, కార్యకర్తలకు మరోసారి పోలీసుల నుంచి ఎదురు దెబ్బ తగిలింది. ఉడిపి నుంచి స్వామీజీ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న బీజేపీ ఎంఎల్‌సి పీవీఎన్‌ మాధవ్‌, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం ఉదయం 8 గంటలకే స్థానిక రామతీర్థం జంక్షన్‌కు చేరుకున్నారు. వారిని అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. స్వామీజీతో పాటు రామతీర్థం వెళ్తామని పట్టుపట్టినప్పటికీ అనుమతివ్వలేదు. ఆ సమయంలో బీజేపీ నాయకులు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్సీ మాధవ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ నెల్లిమర్ల నుంచి వెనుదిరిగారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ డీజీపీ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, ప్రజలకు పోలీస్‌ బాస్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని మాట్లాడుతూ పోలీసుల తీరులో మార్పు కనిపించలేదంటూ నిరాశ వ్యక్తంచేశారు. విజయనగరంలోని పార్టీ కార్యలయంలో ఎమ్మెల్యే మాధవ్‌ మరోసారి మాట్లాడారు. విగ్రహాల ధ్వంసానికి కారణమైన వారిని అరెస్టు చేయడం లేదని, రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విశాఖలో ఈ నెల 17న బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. 

దర్యాప్తు పూర్తి చేస్తాం: సిట్‌ చీఫ్‌ డీఐజీ

రాష్ట్రంలో ఆలయాల్లో జరుగుతున్న సంఘటనలపై త్వరితగతిన దర్యాప్తు పూర్తిచేసి స్థానిక పోలీసుల సహకారంతో రామతీర్థం కేసు మిస్టరీని ఛేదిస్తామని స్పెషల్‌ ఇన్విస్ట్‌గేషన్‌ టీం (సిట్‌) చీఫ్‌ డీఐజీ జీవీజీ అశోక్‌ కుమార్‌ అన్నారు. రాముడి విగ్రహ ధ్వంసంపై  ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన సిట్‌ బృందం శనివారం రామతీర్థం సందర్శించి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసులో ఇంత వరకూ చేపట్టిన దర్యాప్తు.. సాధించిన పురోగతిని జిల్లా పోలీసు కార్యాలయంలో అశోక్‌కుమార్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం లభిస్తే రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్‌కు( 93929 03400) సమాచారం అందించాలన్నారు. సమావేశ ంలో ఎస్‌పీ రాజకుమారి, సీఐడీ అదనపు ఎస్పీ ఎన్‌వీ శ్రీనివాసరావు, విజయనగరం డీఎస్పీ అనిల్‌కుమార్‌, సీసీఎస్‌ డీఎస్పీ పాపారావు, సిట్‌ డీఎస్పీ ఆర్‌వీఎస్‌ఎన్‌ మూర్తి, సీఐలు విజయానంద్‌, ఎన్‌ శ్రీనివాసరావు, రాంబాబు, పలువురు ఎస్‌ఐలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-17T05:08:51+05:30 IST