విద్యార్థుల్లో కరోనాపై అవగాహన పెంచే కాన్సెప్ట్ గేమ్‌

ABN , First Publish Date - 2021-04-11T17:53:43+05:30 IST

ప్రతిభావంతులైన విద్యార్థుల్లో కరోనాపై అవగాహన పెంచే కాన్సెప్ట్‌ గేమ్‌ను..

విద్యార్థుల్లో కరోనాపై అవగాహన పెంచే కాన్సెప్ట్ గేమ్‌

హైదరాబాద్‌ : ప్రతిభావంతులైన విద్యార్థుల్లో కరోనాపై అవగాహన పెంచే కాన్సెప్ట్‌ గేమ్‌ను ఐఐఐటీహెచ్‌ రూపొందించింది. ప్రొఫెసర్‌ డాక్టర్‌ కవిత వేమూరి ఆధ్వర్యంలో అగస్త్య ఫౌండేషన్‌, స్టార్టప్‌ సంస్థ గోలైవ్‌ సంయుక్తంగా రూపొందించిన ఈగేమ్‌లో కరోనాపై 15 రకాల మల్టీ డిసిప్లెనరీ ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రధానమంత్రి ఇన్నొవేటివ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థుల్లో ప్రతిభను పెంచేలా ఈ గేమ్‌ను రూపొందించారు. రైజింగ్‌ ఏ మాథమెటీషియన్‌ ఫౌండేషన్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థలు దక్షిణ భారతదేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన 9నుంచి 11వ తరగతి చదువుతున్న 20మంది ప్రతిభా వంతులైన విద్యార్థులను గుర్తించి వారికి ఆన్‌లైన్‌లో గేమింగ్‌ గురించి శిక్షణ ఇచ్చారు. అగస్త్య ఫౌండేషన్‌ వారి సూచనల మేరకు నిజ జీవితంలో ఎదుర్కొనే  సమస్యలను విద్యార్థులకు వివరించేందుకు సులభమైన పద్ధతులను రూపొందించామని ప్రొఫెసర్‌ డాక్టర్‌ కవిత వేమూరి తెలిపారు.


ఐఐఐటీహెచ్‌ బీటెక్‌ విద్యార్థులు దేవాన్ష్‌, అనుషాగుప్తా ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందించిన ఈ గేమ్‌ను గోలైవ్‌ గేమింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ గేమ్‌లో 5 కల్పిత దేశాలుంటాయి. 12 రౌండ్ల వ్యవధిలో కరోనా వైర్‌సపై పోరాటం జరుపుతారు. ఈ గేమ్‌లో ఇతర దేశాలకు అందించిన సహకారాన్ని బట్టి ఆయా జట్లకు ట్రేడ్‌ పాయింట్లు లభిస్తాయి. ప్రతి ఒక్కరూ తమదేశం కోసం కాకుండా అందరూ కలిసి ప్రపంచ పౌరులుగా పోరాడాలనే భావనను పెంపొందించడమే గేమ్‌ లక్ష్యం. ఇందులో విద్యార్థులు ముందుగా వైరస్‌ గురించి తమకు లభించిన ప్రాథమిక సమాచారంతో పనిచేస్తారు. ప్రాధాన్యత అంశాల గుర్తింపు, వ్యాప్తి దశల గుర్తింపు వంటి క్లిష్టమైన నిర్ణయాలను తీసుకునే అధికారం ఉంటుంది. పాఠశాలలో నేర్పని విషయాలను ఇక్కడ ఆడుతూ నేర్చుకునే అవకాశముంటుందని గేమింగ్‌లో పాల్గొన్న విద్యార్థి ఒకరు తెలిపారు.

Updated Date - 2021-04-11T17:53:43+05:30 IST