ఇక బోనమెత్తుడే..

ABN , First Publish Date - 2022-06-30T05:21:19+05:30 IST

గ్రామ దేవతలు చల్లగా చూడాలని తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల సందడి ఆషాఢమాసం గురువారం నుంచి అరంభం అవుతుంది.

ఇక బోనమెత్తుడే..

- కొవిడ్‌తో రెండేళ్లుగా సాదాసీదాగా బోనాలు 

- జిల్లా వ్యాప్తంగా ముస్తాబైన ఆలయాలు 

- నేటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభం

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

గ్రామ దేవతలు చల్లగా చూడాలని  తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల సందడి ఆషాఢమాసం గురువారం నుంచి అరంభం అవుతుంది.  కొవిడ్‌ కారణంగా మొదటి సారిగా రెండేళ్లుగా సాదాసీదాగా బోనాల పండుగా సాగింది. అయితే ప్రతి ఇంటా అమ్మవారికి పూజలు, బోనాలను సమర్పించుకున్నా వనభోజనాలు, సామూహిక బోనాల జాతరలకు బ్రేక్‌ పడింది. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగను ఘనంగా జరుపుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో అమ్మవారి దేవాలయాలను నిర్వాహకులు ముస్తాబు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మాసాల్లో ఆషాఢ మాసానికి ప్రత్యేకత ఉంది. ఆషాఢం అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బోనాల సంబరమే. ఈ మాసంలో ప్రతీ గడప నుంచి మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, ఆంకాళమ్మ, పోలేరమ్మ, మారెమ్మ పేర్లతో పిలిచే అమ్మవారికి బోనం సమర్పించుకొని చల్లంగా దీవించమంటూ మహిళలు కోరుకుంటారు. ఆషాఢ మాసం వచ్చిందంటే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలే కాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లో  బోనాల సంబరాలు జరుపుకోవడానికి అతివలు ఉత్సాహం చూపుతారు. కుల మతాలకు అతీతంగా అమ్మవారికి బోనం నైవేద్యాన్ని సమర్పించుకుంటారు. తానీషా కాలం నుంచి నేటి వరకు ఆషాఢమాసం వచ్చిందంటే అందరిలోనూ బోనాల ఉత్సవాలతో ఉత్సాహం నిండుతుంది. విందు సంబరాలతో గడుపుతారు. ఆషాఢమాసం వస్తుందంటే కొత్తదంపతులకు విరహ వేదన ఎలా ఉన్నా బోనం సంబరాలు వాటిని దూరం చేస్తాయి. సిరిసిల్లలో మూడు చోట్ల ఘనంగా సంబురం జరుపుకుంటే వేములవాడలో బద్దిపోచమ్మకు, ఇల్లంతకుంటలో అంతగిరి పోచమ్మ దేవాలయాల్లో బోనాల సంబురం జోరుగా సాగుతుంది.

- బోనం అంటే అమ్మవారి నైవేద్యం..

బోనం అంటే నైవేద్యం, భోజనం, మహిళలు వండిన అన్నంతోపాటు పాలు, బెల్లంతో నైవేద్యాన్ని తయారు చేస్తారు. కొత్తకుండ లేదా రాగి, ఇత్తడి పాత్రలను పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి పైన చిన్న పాత్రను ఉంచి దానిపైన జ్యోతిని వెలిగిస్తారు. అలా తయారైన బోనానికి వేపాకులు కడుతారు. మహిళలు పట్టువస్త్రాలు నగలు ధరించి ఆ బోనాన్ని తలపైన పెట్టుకొని డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా బయలు దేరి అమ్మవారికి నీళ్లతో కూడిన సాకను సమర్పించుకుంటారు. బోనం ముందు యువకుల నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల శిగాలు ఉంటాయి. బోనం మొస్తున్న మహిళను దేవి అమ్మవారుగా విశ్వసిస్తారు. ఆమెను శాంతపరచడానికి మహిళలు ఆలయం వద్ద నీళ్లు కుమ్మరిస్తారు. పూర్వ కాలంలో పండుగ రోజున దుష్టశక్తులను పారదోలడానికి బోనంతోపాటు దున్నపోతును బలిచ్చే వారు. ఇప్పుడు మేకలు, గొర్రెలు, కోడిపుంజులను బలివ్వడం ఆనవాయితీగా మారింది. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించడంతోపాటు ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతోపాటు భుజిస్తారు. ఊరు శివారులలోని దేవాలయాలు, అటవీ ప్రాంతానికి వెళ్లి సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలను తెలంగాణలో వన భోజనాలుగా పిలుస్తారు. 

- గావుపట్టడం...

అమ్మవారి సోదరుడైన పోతరాజును ప్రతిభింభించే ఒక మనిషి బోనాల పండుగను నడిపించడం ఆనవాయితీ. పోతరాజు పాత్రను పోషించే వ్యక్తి ఒంటిపై పసుపు, నుదిటిపై కుంకుమ, కాలికి గజ్జెలు, ఎర్రని దోతిని ధరించి కొరడాతో బాదుకుంటూ, వేపాకులను నడుముకు చుట్టకొని అమ్మవారి సమక్షానికి బోనంతో వచ్చే మహిళలను తీసుకొని వెళతారు. అనంతరం పోతరాజు తన దంతాలతో మేకపోతును కొరికి తలా మొండం వేరు చేసే ప్రక్రియను గావు పట్టడం అంటారు. దీన్ని చూస్తుంటే ఒల్లు జలదరిస్తుంది. 

- కొత్త దంపతులకు విరహం..

అషాడ మాసంలో కొత్త దంపతులకు విరహం తప్పదు. కోడలు అత్తను చూడవద్దని చెపుతుంటారు కానీ భార్య భర్తలు కలవవద్దని భావిస్తారు. అషాడ మాసంతో గర్భం ధరిస్తే చైత్ర, వైశాఖ మాసం అంటే ఎండా కాలంలో పిల్లలు పుడుతారు. ఎండల వల్ల పసిపిల్లలు తట్టుకోరని భావించి భార్యభర్తలను కలవనివ్వరు. మరోవైపు ఆషాఢ మాసంలో వాతావరణంలో మార్పుల వల్ల బాక్టీరియా, వైరస్‌ల వల్ల ఆరోగ్య సమస్యలు, అంటు వ్యాఽధులు కూడా వస్తాయి. దీని ద్వారా ఇబ్బందులు ఉండవని కొత్తగా పెళ్లయిన అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్తారు. శ్రావణ మాసంలో వ్రతాలు, నోములు, జరుగుతాయి. మంచి శుభఘడియలు ఉంటాయి. శ్రావణంలో గర్భధారణ జరిగితే మంచిదని పెద్దల నమ్మకం, అంతేకాకుండా పెండ్లయిన కొత్తలోనే నెల రోజుల పాటు భార్య, భర్తల ఎడబాటు ప్రేమానురాగాలు పెరుగుతాయని పెద్దలు భావిస్తారు. 


Updated Date - 2022-06-30T05:21:19+05:30 IST